ఇవి తింటే కంటి సమస్యలకు చెక్..

by  |
ఇవి తింటే కంటి సమస్యలకు చెక్..
X

దిశ, వెబ్‌డెస్క్ : మానవ శరీరంలోని ఒక్కో అవయవానికి ఓ ప్రత్యేక లక్షణం ఉంటుంది. మనిషికి ఉన్న అవయవాల్లో కళ్లు అత్యంత ప్రధానమే కాదు, సెన్సిటివ్ కూడా. మనం కళ్లతో చూడగలికే రంగులు వాటికే కాదు, మనసుకు కూడా ఎంతో ఆహ్లదాన్ని కల్గిస్తాయి. కళ్లు కేవలం చూడటానికే కాదు, మన జీవితానికి దారి చూపించే ‘దిక్సూచి’ అని మరువొద్దు. వాటి విలువ కళ్లు ఉన్నవారి కంటే లేనివారికే బాగా తెలుస్తోంది. అందుకే ‘సర్వేంద్రీయానం నయనం ప్రధానం’ అని ఓ సామెత కూడా పుట్టించారు మన పూర్వీకులు. మానవ జీవితానికి దారి చూపించే కళ్లను మనం ఇంకెంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. కానీ, నేడు చాలా మంది తగినన్నీ జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే 40 ఏళ్లలో వచ్చే కంటి సమస్యలు పదేండ్ల వయస్సులో వచ్చేస్తున్నాయి.

ప్రస్తుతం మారుతున్న ఆహారపు అలవాట్లు, పోషకాలు లేని ఫుడ్ తీసుకోవడం, రాత్రుళ్లు లేట్‌గా వర్క్ చేయడం, సెల్‌ఫోన్ వినియోగం, లేట్‌నైట్ వరకు మేల్కొని ఉండటం వలన ఉద్యోగులు, నేటి యువత అధికంగా కంటి సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్కూల్‌కు వెళ్లే విద్యార్థులు, చిన్నారులు ఈ మధ్యకాలంలో ఎక్కువగా కంటి సమస్యల బారిన పడుతున్నారు. అందుకు పోషకాహార లోపం,సెల్‌ఫోన్‌, కంప్యూటర్ వినియోగం పెరగడమే కారణమని కంటి వైద్యులు చెబుతున్నారు.

వీటితో కంటి సమస్యలు దూరం..

కంటి సమస్యలతో బాధపడుతున్నవారు తాము తీసుకునే ఆహారంలో తప్పకుండా ఇవి ఉండేలా చూసుకోవాలి. ఇలా చేస్తే తక్కువ రోజుల్లోనే దృష్టి సమస్యలకు ఫుల్‌స్టాప్ పెట్టొచ్చు. రోజువారీ ఆహారంలో పలురకాల విటమిన్లు, ఖనిజాలు (మినరల్స్‌), లుటీన్‌, జియాగ్జాంథిన్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆకుకూరలు, గుడ్లు, బ్రోకలీ, స్వీట్‌ కార్న్‌ ఎక్కువగా తీసుకోవాలి. దీనివలన వయసుతో పాటు వచ్చే కంటి వ్యాధుల్ని కూడా అదుపులో ఉంచవచ్చని పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా విటమిన్‌-సి, విటమిన్‌-ఇ నేత్రాల రక్షణకు ఎంతో అవసరం. విటమిన్‌-ఎ, బీటా కెరోటిన్‌ అధికంగా ఉండే క్యారెట్లు, ఆకుకూరలు, గింజలు, కర్జూర వంటివి రెటీనాకు రక్షణ కవచంలా పనిచేస్తాయి.

జింక్‌ అధికంగా లభించే మాంసాహారం, పాలు, బీన్స్‌… ఆహారంలో భాగం చేసుకుంటే కళ్లకు ఆరోగ్యం లభిస్తుంది. అంతేకాకుండా రోజుకు కనీసం అరగంట సేపు వ్యాయామం చేయడం వల్ల.. రక్తప్రసరణ బాగుంటుంది. దీంతో కంటికి చేరే రక్తంలో ఆక్సిజన్‌ పరిమాణం పెరుగుతుంది. కళ్లల్లో మంటలు రాకుండా ఉండాలంటే చల్లని నీటితో వాష్ చేసుకోవడం, కీరదోస ముక్కలు పెట్టుకోవడం వలన వేడి తగ్గుతుంది. అదే పనిగా చదవడం, సెల్‌ఫోన్, కంప్యూటర్‌ చూడటం వల్ల కళ్లు అలసిపోతాయి. అలాంటి సమయంలో 15, 20 నిమిషాలకోసారి 30 సెకెన్ల పాటు కళ్ళు మూసుకోవడం, లేదా కాసేపు నిద్రించడం వలన చేస్తే తిరిగి కళ్లు ఉత్తేజమవుతాయి.


Next Story

Most Viewed