పార్టీ ఎందుకంటే..? షర్మిల ప్రసంగంపై సర్వత్ర ఉత్కంఠ

by  |
పార్టీ ఎందుకంటే..? షర్మిల ప్రసంగంపై సర్వత్ర ఉత్కంఠ
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఖమ్మం బహిరంగసభలో వైఎస్ షర్మిల ఏం మాట్లాడబోతున్నారనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం మొదలు తాజాగా నిరుద్యోగి సునీల్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నంత వరకు అనేక అంశాలను ఆమె తన ప్రసంగంలో ప్రస్తావించాలనుకుంటున్నారు.

ఏ లక్ష్యం కోసం తెలంగాణ సాధించుకున్నారో రాష్ట్ర ప్రజలకు అది అందని ద్రాక్షగానే మారిందంటూ ఏడేళ్ళ కేసీఆర్ పాలనలోని వైఫల్యాలను ఆమె ఏకరువు పెట్టాలనుకుంటున్నారు. సమైక్య రాష్ట్రంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలైన సంక్షేమ ఫలాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎందుకు అమలుకావడంలేదన్న అంశాలపై ఆమె నొక్కిచెప్పనున్నట్లు సన్నిహితుల సమాచారం.

తెలంగాణ ఉద్యమంలో యువత, విద్యార్థుల ఆకాంక్షలు, ఆత్మ బలిదానాల అంశాన్ని ప్రస్తావించడంతో పాటు స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా రైతుల, విద్యార్థుల, యువకుల ఆత్మహత్యలు కొనసాగుతుండడాన్ని కూడా ఆమె ప్రస్తావించనున్నారు. ఖమ్మం వేదికగానే ఈ అంశాలను ఎందుకు ప్రస్తావించాలనుకుంటున్నారో కూడా కారణాన్ని వివరించనున్నారు. రాజకీయ పార్టీని పెట్టాలన్న ఆలోచన, దానికి దారితీసిన కారణాలను కూడా తన ప్రసంగంలో వివరించనున్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆరున్నరేళ్ళయినా యువత ఆకాంక్షలు ఎందుకు అమల్లోకి రాలేకపోయాయని ప్రశ్నించడంతో పాటు వారిలో ఉన్న నిరాశా నిస్పృహలను తన ప్రసంగంలో పేర్కొంటారని సమాచారం.

రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు వార్తలు వెలువడగానే ఫలానా పార్టీకి ‘బీ-టీమ్’, ఈ పార్టీ వెనక ఫలానా పెద్దలున్నారు.. అంటూ వస్తున్న రకరకాల విమర్శలకు కూడా ఈ వేదికగా ఆమె స్పష్టత ఇవ్వనున్నట్లు తెలిసింది. రాజన్న రాజ్యాన్ని తీసుకురావడం, వైఎస్సార్ సంక్షేమ ఫలాలను ప్రజలందరికీ అందించడం మినహా తనకు మరో ఉద్దేశం లేదని, ప్రస్తుతం తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు కాబట్టే రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందన్న విషయాన్ని స్పష్టం చేయనున్నట్లు తెలిసింది. తెలంగాణ కోడలిగా, ఖమ్మం జిల్లా మెట్టినిల్లుగా తెలంగాణ ప్రజల సంక్షేమం గురించి మాట్లాడడం తన బాధ్యత అంటూ కొన్ని ఊహాగానాలకు తెరదించే తరహాలో వివరణ ఇచ్చే అవకాశమూ ఉంది.

వైస్సార్ సంక్షేమ పథకాలు, కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలు, యువతలో ఉన్న నిరాశా నిస్పృహలు, వివిధ సెక్షన్ల ప్రజలకు ఇప్పటికీ అందని సంక్షేమం తదితరాలే ఆమె ప్రసంగంలో ప్రధాన అంశాలుగా ఉంటాయని షర్మిల సన్నిహితులు ఒకరు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ఉపాధి కల్పన, ప్రభుత్వం చెప్తున్న లెక్కలు, నిరుద్యోగుల్లో అసంతృప్తి తదితర అంశాలను ప్రస్తావించనున్నట్లు తెలిసింది.


Next Story

Most Viewed