పెరుగుతోన్న డ్రగ్స్ అడిక్షన్.. మెంటల్ బ్యాలెన్స్ కోల్పోతున్న యువత

199
Cannabis, Youth

యువత మత్తులో జోగుతున్నది. రోజురోజుకూ డ్రగ్స్ వినియోగం పెరుగుతున్నది. మత్తుకు బానిసైన యువత నేరాలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటూ అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. గడిచిన మూడేళ్ల గణాంకాలను పరిశీలిస్తే డ్రగ్స్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తున్నది. యావత్ భారత దేశాన్ని ఈ సమస్య కుదిపేస్తున్నది. రాష్ట్రంలో జరిగిన పలు పెద్ద నేరాలు సైతం గంజాయి, డ్రగ్స్, మత్తు ఇంజక్షన్లకు బానిస అయిన వారే చేసినట్టు తేలడం గమనార్హం. పలువురు సినీతారలు సైతం డ్రగ్స్ వివాదంలో చిక్కుకొని పలుమార్లు విచారణకు హాజరయ్యారు. క్లాస్ టు మాస్​అంతా మత్తులో జోగుతున్నారని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలోని అనేక రాష్ట్రాల్లో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం ఏటేటా పెరుగుతూ ఉన్నది. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో యాక్టివ్ రోల్ పోషిస్తుండడంతో గడచిన మూడేళ్లలో మాదకద్రవ్యాల స్వాధీనమూ పెరిగింది. ఒకవైపు మద్యం విస్తృతంగా అందుబాటులోకి వచ్చినా డ్రగ్స్ బారిన పడుతున్నవారి సంఖ్య సైతం పెరుగుతూనే ఉన్నది. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా అన్ని రాష్ట్రాల్లోనూ ఈ భూతం వ్యాపిస్తూ ఉన్నది. కేసులు నమోదైనా, అరెస్టులు జరిగినా, ఛార్జిషీట్లు దాఖలు చేసినా చివరకు శిక్ష పడుతున్నది మాత్రం కొద్దిమందికే. మూడేళ్ల గణాంకాలను పరిశీలిస్తే మాదకద్రవ్యాల రవాణా, వినియోగం, వాటి స్వాధీనం గణనీయంగా పెరిగింది. ఎక్కువగా 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపు వయసున్నవారిలోనే డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు తేలింది. డ్రగ్ డీ-అడిక్షన్ కేంద్రాలు పనిచేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి వేలాది అవగాహనా, చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఈ భూతాన్ని పూర్తిస్థాయిలో నియంత్రించలేకపోతున్నాయి. తెలంగాణలో నాలుగేళ్ల క్రితం సినీ సెలెబ్రెటీలు మాదకద్రవ్యాల బారిన పడిన సంగతి విదితమే. చివరకు వారంతా నిర్దోషులుగానే తేలారు.

2018 గణాంకాలు

ప్రాంతం         కేసులు         ఆత్మహత్యలు
దేశం               63, 137         7,193
ఏపీ                 534              196
తెలంగాణ         311              16

2019 గణాంకాలు

ప్రాంతం     కేసులు       ఆత్మహత్యలు
దేశం          72,721       7,860
ఏపీ            717            464
తెలంగాణ    311            26

2020   గణాంకాలు

ప్రాంతం        కేసులు       ఆత్మహత్యలు
దేశం              59.806      9,169
ఏపీ                866           385
తెలంగాణ        509           77

గంజాయిదే అగ్రస్థానం

మాదకద్రవ్యాల సరఫరా, వినియోగంపై కేంద్ర సోషల్ జస్టిస్ మంత్రిత్వశాఖ దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో మద్యం తర్వాత ఎక్కువగా వాడుతున్నది గంజాయి అనే తేలింది. మితిమీరిన వినియోగంతో మెంటల్ బ్యాలన్సు కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, కొన్ని సందర్భాల్లో నేరాలకు పాల్పడుతున్నారని తేలింది. దేశవ్యాప్తంగా గంజాయి వినియోగాన్ని నిర్దిష్టంగా గణించలేకపోయినప్పటికీ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో విభాగం స్వాధీనం చేసుకున్న లెక్కలతో పోల్చి చూసింది. ఆ విభాగం నిర్వహించిన తనిఖీల్లో 2018లో 12.28 లక్షల కిలోల గంజాయి స్వాధీనం కాగా ఆ తర్వాతి సంవత్సరం 4.43 లక్షల కిలోలు దొరికింది. గతేడాది అది 8.53 లక్షల కిలోలకు పెరిగింది.

గడచిన మూడేళ్లలో మందుల షాపుల్లో దొరికే వివిధ రకాల ఇంజెక్షన్లు, రసాయనాల కాంబినేషన్లతో మత్తును సృష్టించే పదార్ధాలను తయారుచేసి వాడడం పెరిగిందని ఈ సర్వే తేల్చింది. ఆ ప్రకారం 2018లో 1.17 కోట్ల ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకుంటే ఆ మరుసటి సంవత్సరం 2.07 కోట్ల ఇంజెక్షన్లు, గతేడాది 5.60 కోట్ల చొప్పున స్వాధీనం చేసుకున్నట్లు తేలింది. దేశంలోనే అత్యధికంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం పంజాబ్‌లో ఉంటున్నా ఇటీవలి కాలంలో తీసుకుంటున్న చర్యలతో గణనీయంగా తగ్గినట్లు ఎన్సీఆర్‌బీ గణాంకాలు చెబుతున్నాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉన్నది.

శిక్షలు పడుతున్నది తక్కువే

నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో, రాష్ట్రాల్లోని ఎక్సైజ్ విభాగాలు ఎంతగా తనిఖీలు నిర్వహిస్తున్నా, అక్రమ రవాణాకు పాల్పడేవారిని అరెస్టు చేస్తున్నా, కేసులు నమోదు చేసినా, ఛార్జిషీట్లు దాఖలుచేసినా చివరకు శిక్ష పడుతున్నవారి సంఖ్య మాత్రం చాలా తక్కువగానే ఉంటున్నది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ గణాంకాలనే పరిశీలిస్తే 2018లో 534 కేసులు నమోదు చేసి 1,635 మందిని అరెస్టు చేసి 399 చార్జిషీట్లు దాఖలు చేస్తే శిక్ష పడింది మాత్రం కేవలం 175 మందికే. ఆ తర్వాతి సంవత్సరంలో 717 కేసుల్లో 1559 మందిని అరెస్టుచేసి 1182 మంది మీద చార్జిషీట్లు దాఖలు చేస్తే 80 మందికి మాత్రమే శిక్ష పడింది. గతేడాది 866 కేసుల్లో 1569 మందిని అరెస్టు చేసి అందులో 905 మంది మీద చార్జిషీటు దాఖలు చేస్తే కేవలం 22 మందికి మాత్రమే శిక్ష పడింది.

తెలంగాణలో ఐదున్నర లక్షల మంది ఓపియం వినియోగం

కేంద్ర సోషల్ జస్టిస్ మంత్రిత్వశాఖ 2018లో నషా ముక్త్ భారత్ అభియాన్ పథకం కింద దేశవ్యాప్తంగా పలు సంస్థల సహకారంతో అధ్యయనం చేసి డీ-అడిక్షన్ సెంటర్ల వారీగా మొత్తం 272 జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులను సేకరించింది. ఆ ప్రకారం తెలంగాణలో మొత్తం జనాభాలో సగటున 19 శాతం మంది మద్యానికి అలవాటు పడ్డారని, ఆ తర్వాతి స్థానంలో ఓపియం సంబంధిత మాదకద్రవ్యాలను వాడుతున్నవారు సుమారు ఐదున్నర లక్షల మంది ఉన్నట్లు తేల్చింది. మరో మూడున్నర లక్షల మంది ఇంజెక్షన్ల లాంటి మత్తు పదార్థాలను వాడుతున్నట్లు గుర్తించింది. సుమారు రెండు లక్షల మంది గంజాయిని వినియోగిస్తున్నట్లు తేలింది. ఆంఫెటమైన్ తరహా పదార్ధాలను సుమారు రెండు లక్షల మంది, ముక్కుద్వారా పీల్చే మత్తు పదార్ధాలను సుమారు 1.70 లక్షల మంది, కొకెయిన్‌ను వాడుతున్నవారు 22 వేల మంది ఉన్నట్లు తేల్చింది.

ఒకవైపు మద్యం, మరోవైపు మత్తు పదార్ధాల వినియోగానికి ఎక్కువగా 18-45 ఏళ్ల మధ్య వారు గురవుతున్నారని, ఇందులోనూ యువత ఎక్కువా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. మత్తు పదార్ధాల వినియోగాన్ని తగ్గించడానికి, ప్రజల్లో చైతన్యం కలిగించడానికి, అవగాహనా సదస్సులను నిర్వహించడానికి, విద్యా సంస్థల్లో ప్రత్యేక క్యాంపెయిన్‌లను చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నా వీటి వినియోగం, అక్రమ రవాణా, ఎన్సీబీ తనిఖీల్లో స్వాధీనమవుతున్న మాదక ద్రవ్యాలు ఎక్కువగానే ఉంటున్నాయి. కేంద్ర హోం మంత్రిత్వశాఖ అధ్యయనంలో మత్తు వ్యసనం నేరాలు పెరగడానికి కూడా దారితీస్తున్నట్లు పలు సందర్భాల్లో నివేదికల రూపంలో వెల్లడించింది. ఈ భూతాన్ని తరిమికొట్టి నేరాలను తగ్గించడం ఇప్పుడు ప్రభుత్వాలకు సవాలుగా మారింది.

మల్టిలింగువల్ డిజిటల్ ఎక్స్‌ప్రెషన్