అంతా సైలెన్స్.. నోరు విప్పాలంటే పర్మిషన్ ఉండాల్సిందే!

by  |
BJP logo
X

దిశ, తెలంగాణ బ్యూరో : నిన్న మొన్నటి వరకు విమర్శలు, ప్రతివిమర్శలు చేసిన నేతలు ఒక్కసారిగా సైలెంటయ్యారు. కార్యాలయానికి వచ్చిన ఒకరిద్దరు కూడా నోరు మెదపలేదు. బీజేపీ ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నట్లు స్వయంగా ప్రధాని మోడీ ప్రకటించారు. దీనిపై ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదు. రాష్ట్రంలో టీఆర్ఎస్​బీజేపీ మధ్య ధాన్యం కొనుగోలుపై మాటల యుద్ధం జరుగుతోంది. మీరంటే మీరని, మీ వైఫల్యంతోనే ధాన్యం కొనుగోళ్లు జరగట్లేదని పరస్పరం విమర్శించుకుంటున్నాయి. ఈ విమర్శలు తారాస్థాయికి చేరాయి.

ఈ నేపథ్యంలో కేంద్రం అనూహ్యంగా సాగు చట్టాలపై నిర్ణయం తీసుకోవడంతో బీజేపీ నేతలు రైతన్నలతో పాటు పార్టీ శ్రేణుల్లో ప్రభుత్వ నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పి వారిలో భరోసా నింపుతారని అందరూ భావించారు. అయినప్పటికీ ఏ ఒక్కరూ కూడా నోరు మెదపలేదు. కనీసం కేంద్రాన్ని సమర్థిస్తూ కూడా ఎలాంటి ప్రకటనలు చేపట్టకపోవడం గమనార్హం. ఇందుకు కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలే కారణమని తెలుస్తోంది.

కేంద్రం కొత్తగా తెచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ శుక్రవారం ప్రకటించారు. కాగా ఈ ప్రకటన అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయం మూగబోయింది. నేతలంతా గప్​చుప్​గా అయిపోయారు. నేతలతో ఎప్పుడూ సందడిగా కనిపించే బీజేపీ రాష్ట్ర కార్యాలయం నిర్మానుష్యంగా మారింది. పార్టీ కార్యకర్తలు రాకపోవడంతో బోసిపోయింది. సందడి లేకపోవడంతో పార్టీ కార్యాలయం ఏమైనా మార్చారా? అనే అనుమానం ప్రజల్లో కలిగింది. కాగా ప్రతిరోజు మూడు నాలుగు ప్రెస్ మీట్లు నిర్వహించే నేతలు.. శుక్రవారం మోడీ ప్రకటన వెలువడిన అనంతరం ప్రెస్​మీట్లను సైతం రద్దు చేసుకున్నారు. కాగా హుజురాబాద్​ఎమ్మెల్యే ఈటల ఇంటికే పరిమితమవ్వగా.. కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి హైదరాబాద్​పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన ఆర్ఎస్ఎస్​కార్యక్రమానికి హాజరైనట్లు సమాచారం.

ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్​ఢీ.. అంటే ఢీ.. అంటున్నాయి. ఇందిరాపార్క్ వద్ద అధికార పార్టీ ధర్నాకు సైతం దిగింది. సీఎం కేసీఆరే స్వయంగా ఈ ధర్నాలో పాల్గొన్నారు. కాగా తాము ధర్నా చేయడం వల్లే కేంద్రం వెనక్కి తగ్గి నల్ల చట్టాలను కేంద్రం రద్దు చేసిందని చెబుతున్నారు. క్రెడిట్​ను తమ ఖాతాలో వేసుకుంటున్నారు. అయినా బీజేపీ నేతలు నోరుమెదపకపోవడం గమనార్హం. కనీసం సమర్థించుకునే పని కూడా చేయకపోవడంతో బలమైన కారణమే ఉంటుందని పలువురు అభిప్రాయం వెల్లడించారు. అయితే ఈ విషయంపై లేనిపోని కామెంట్లు చేస్తే ఇబ్బందిపడే అవకాశాలున్నాయని కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతోనే పార్టీ శ్రేణులు సైలెంట్​అయిపోయాయని సమాచారం. అందుకే శుక్రవారం నిర్వహించాల్సిన మీడియా సమావేశాలను సైతం వాయిదా వేసుకున్నాయని చెబుతున్నారు.


Next Story

Most Viewed