బడులు ప్రారంభమైనా.. బస్సులు రావడం లేదు

by  |
బడులు ప్రారంభమైనా.. బస్సులు రావడం లేదు
X

దిశ ప్రతినిధి, మెదక్: పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమైన రోజు నుంచే పల్లెలకు బస్సులు పంపిస్తాం. విద్యాలయాల్లో బస్ పాసులు అందిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వ హామీ ఆచరణలో సాధ్యం కావడం లేదు. బడులు ప్రారంభమై పది రోజులు పూర్తయిన పల్లెలకు బస్సులు రావడం లేదు. విద్యార్థులకు ఉచిత బస్ పాసులు అందజేయలేదు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు స్కూల్, కళాశాలలకు వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయివేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు.

ఆటోలే దిక్కు..

ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో ఎనిమిది బస్ డిపోలు ఉన్నాయి. ఈ డిపోల పరిదిలో 660 బస్సులు ఉండగా అందులో 360 ఆర్టీసీ బస్సులు, 300 అద్దె బస్సులు ఉన్నాయి. స్కూల్స్ కాలేజీలు ప్రారంభమై పది రోజులు పూర్తయిన వల్లెలకు బస్సులు రావడం లేలదు. ఆర్టీసీ అధికారులు ప్రధాన రూట్లలోనే బస్సులు నడుపుతుండటం తో పల్లెల నుంచి పట్నానికి వెళ్లి విద్యనభ్యసించే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేసేదేమీ లేక విద్యార్థులు ఉదయాన్నే తొందరగా లేచి ప్రైవేటు వాహనాలైన ఆటోలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. మరికొందరు తల్లిదండ్రులేతమ పిల్లలను కాలేజీ, స్కూళ్ల వద్ద దింపి వెళ్తున్నారు.

పడిపోతున్న హాజరు..

కొవిడ్ కారణంగా మూతపడ్డ పాఠశాలలు, కళాశాలలు సుమారు 11 నెలల తర్వాత ప్రారంభమైనప్పటికీ విద్యార్ధులు కరోనా పేరిట పాఠశాలలకు, కళాశాలలకు వచ్చేందుకు కొంత విముఖత చూపుతున్న విషయం తెలిసిందే. దీనికి తోడు పట్టణాల్లో చదివే విద్యార్ధులకు ప్రభుత్వం ఆర్టీసీ బస్సు సదుపాయం, బస్ పాసులు అందించకపోవడంతో రోజు రోజుకు హాజరు శాతం మరింతగా తగ్గుతున్నది. కొన్ని పాఠశాల్లో కనీసం 50 శాతం కూడా హాజరు నమోదు కావడం లేదని పలువురు ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పల్లెల్లోకి బస్సులను పంపిస్తే బాగుంటుందని పలు ప్రయివేటు, ప్రభుత్వ కళాశాలల, పాఠశాలల యాజమాన్యాలు కోరుతున్నారు.

స్కూల్స్, కాలేజీలు ప్రారంభమై పది రోజులు కావొస్తున్న ఇంకా ఆర్టీసీ బస్సులు గ్రామాల్లోకి రాకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయివేటు వాహనాల్లో పంపిస్తామని చూస్తే వారు డీజిల్ ధరలు పెరగడంతో ఒకేసారి ఆటో చార్జీలను డబుల్ చేసేశారు. పిల్లలను ఆటోలో పంపే స్తోమత తమ దగ్గర లేదని, వెంటనే బస్సు సౌకర్యం కల్పించి .. బస్ పాసులు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.


Next Story