ప్రపంచంలోనే అతిపెద్ద స్కూటర్ తయారీ ప్లాంట్ నిర్మించనున్న సింపుల్ ఎనర్జీ!

118
elelctric scooter

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ స్కూటర్ తయారీ సంస్థ సింపుల్ ఎనర్జీ ప్రపంచంలోనే అతిపెద్ద స్కూటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. దీని కోసం కంపెనీ రూ. 2,500 కోట్ల పెట్టుబడులను పెట్టాలని భావిస్తోంది. ఏడాదికి 10 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో 2022లో కార్యకలాపాలను కంపెనీ ప్రారంభించనుంది.

అలాగే, 2023లో తన రెండో ప్లాంట్‌ను ప్రారంభించి ఏడాది 12.5 లక్షల స్కూటర్లను తయారు చేసే సామర్థ్యాన్ని సాధించనున్నట్టు కంపెనీ పేర్కొంది. తాము ఇప్పటివరకు సుమారు రూ. 160 కోట్ల నిధులను సేకరించాం, త్వరలో మరిన్ని నిధులను సేకరించనున్నట్టు కంపెనీ సీఈఓ సుహాస్ రాజ్‌కుమార్ అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో 99 శాతం ఆధిపత్యం ఉన్న చైనాను అధిగమిస్తూ బ్యాటరీ ప్యాక్, మోటార్‌తో సహా ప్రతీది చేయాలనే లక్ష్యంతో కంపెనీని స్థాపించామని రాజ్‌కుమార్ తెలిపారు. తాము ప్రపంచ దిగ్గజాలైన టెస్లా, రివియన్ కంపెనీ మాదిరిగానే ప్రతీదీ స్వయంగా తయారు చేయాలని భావిస్తున్నామని ఆయన వెల్లడించారు.