నమస్తే తెలంగాణ పేపర్‌పై ధ్వజమెత్తిన ఈటల

by  |
Etala Rajender
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: మాజీ మంత్రి, హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం వీణవంకలో ఈటల మీడియాతో మాట్లాడుతూ.. 2వ తేదీన మంత్రిగా తనను తొలగించిన తర్వాత 7వ తేదీన మంత్రిగా రేవంత్ రెడ్డిని కలిసానని ‘నమస్తే తెలంగాణ’ రాసిందని ఎద్దేవా చేశారు. విషాన్ని చిమ్ముతూ.. గుండెలను గాయపరచడం ఆ పత్రిక పని అని మండిపడ్డారు. దేనికీ పనికిరాని పత్రిక అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఛీ.. ఆ పత్రిక పచ్చి అబద్ధాలు రాస్తోంది’ అంటూ చీదరించుకున్నారు.

ఏప్రిల్ 30న చిల్లర ఆరోపణ చేసి, మే 2న మెడలు పట్టి బయటికి పంపించారన్నారు. కరోనా లాంటి గంభీరమైన సమయంలో మంత్రి పదవి తీసివేయడం బాధ అనిపించింది తప్ప, మంత్రి పదవి పోయినందుకు కాదని ఈటల స్పష్టం చేశారు. రాజీనామా చేస్తావా లేదా అని డిమాండ్ చేస్తే వారి మొఖాన కొట్టి వచ్చానన్నారు. మే 7న మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి కూతురు ఎంగేజ్‌మెంట్‌కి ఏనుగు రవీందర్ రెడ్డి, తాను కలిసి వెళ్లామని, అప్పటికే అక్కడ సండ్ర వెంకట వీరయ్య, రేవంత్ రెడ్డి కూడా వెల్లడించారు. శుభకార్యంలో కలిస్తే.. మాట్లాడుకోవడం తప్పా? అని ప్రశ్నించారు.

తెల్ల రేషన్‌కార్డు చూపిస్తే ప్రైవేట్ హాస్పిటల్‌లో ఆరోగ్యం అందడం లేదని, రూ.1300 కోట్లు ప్రభుత్వం బాకీ ఉందని అన్నారు. ఆర్థికమంత్రి హరీష్ రావు, ఆరోగ్య శ్రీ బకాయిలు ఇవ్వాల్సింది పోయి హుజురాబాద్‌లో డబ్బులు పంచుతున్నాడని సంచలన ఆరోపణ చేశారు. తడిచిన ధాన్యం కొనాల్సిన మంత్రి మద్యం సీసాలు పంచుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం, రైతులపై శ్రద్ధ లేకుండా పోయిందన్నారు. కేవలం రాజేందర్‌ను ఓడించడమే వారి పనిగా మారిందన్నారు.


Next Story

Most Viewed