ఫామ్ హౌస్‌ నుంచే నాపై కుట్ర చేశారు: ఈటల రాజేందర్

115

దిశ, జమ్మికుంట: నేను ఏది మాట్లాడినా ప్రజల కోసమేనని.. ఏనాడు నా స్వార్థం కోసం మాట్లాడలేదని.. ఫామ్ హౌస్‌లో కుట్ర చేసి మంత్రి పదవి నుంచి తీసేశారని ఈటల రాజేందర్ అన్నారు. జమ్మికుంట పట్టణంలోని ఈటల రాజేందర్ క్యాంప్ కార్యాలయంలో.. కందుగుల, సిరిసేడు, కృష్ణ కాలనీ, మోత్కలగూడెం, ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి వాసులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ఏనాడూ కనపడని నేతలు హుజురాబాద్ కొత్తగా తిరుగుతున్నారని, కక్ష కట్టి మాట్లాడుతున్నారన్నారు. మధ్యలో వచ్చి మధ్యలో పోయాడు అంటూ నాపై ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ముందు భూ ఆక్రమణ అన్నారు.. ఇప్పుడు సీఎం కుర్చీ కోసం కుట్ర చేశానని అంటున్నారు.. ఏది నిజమో ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం దళితులకు 10 లక్షల రూపాయలు ఇచ్చారు.. అలాగే బీసీలకు కూడా 50 వేల రూపాయలు ఇవ్వాలని చూస్తున్నారట.. తీసుకోండి.. కానీ, దీనికి కారణమైన ఈటల రాజేందర్‌ను మాత్రం మర్చిపోకండన్నారు. నేను రాజీనామా చేసి నిలబడితేనే ఇవన్నీ వస్తున్నాయి.. గెలిచిన తర్వాత ఇంకా ఎన్ని వస్తాయో చూడాలన్నారు. తెలంగాణ మొత్తం హుజురాబాద్ వైపు చూస్తుందని.. మీ చేతుల్లో తెలంగాణ భవిష్యత్తు ఉందని, ప్రజల ఆత్మగౌరవం ఉందని, నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తుల ఉమ, బీజేపీ నాయకురాలు గండ్ర నలిని తదితరులు పాల్గొన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..