తడబడ్డ బంగ్లాదేశ్.. ఇంగ్లాండ్ ఘన విజయం

133
england vs Bangladesh

దిశ, స్పోర్ట్స్: టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ జైత్రయాత్ర కొనసాగుతున్నది. వన్డే వరల్డ్ కప్ విజేతలైన ఇంగ్లాండ్ జట్టు.. టీ20 వరల్డ్ కప్ కూడా గెలిచి చరిత్ర సృష్టించాలని భావిస్తున్నది. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై భారీ విజయాన్ని నమోదు చేసిన ఇంగ్లాండ్.. రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై పూర్తి ఆధిపత్యం సాధించింది. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లా నిర్దేశించిన 125 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. జేసన్ రాయ్, జాస్ బట్లర్ కలసి తొలి వికెట్‌కు 39 పరుగులు జోడించారు. జాస్ బట్లర్ (18) నాసుమ్ అహ్మద్ బౌలింగ్‌లో మహ్మద్ నయీంకు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. ఇక ఆ తర్వాత మరో ఓపెనర్ జేసన్ రాయ్, డేవిడ్ మలన్‌ కలసి బంగ్లా బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. ముఖ్యంగా జేసన్ రాయ్ బౌండరీలు, సిక్సులతో బంతిని స్టేడియం నలువైపులా పరుగెత్తించాడు. మరో ఎండ్‌లో డేవిడ్ మలన్ అతడికి సరైన సహకారం అందించారు. వీరిద్దరూ కలసి రెండో వికెట్‌కు 73 పరుగులు జోడించారు. జేసన్ రాయ్ కేవలం 38 బంతుల్లోనే 61 పరుగులు చేసి ఇస్లామ్ బౌలింగ్‌లో నాసుమ్ అహ్మద్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. ఇక ఆ తర్వాత మరో వికెట్ పడకుండా డేవిడ్ మలన్ (28), జానీ బెయిర్‌స్టో (8) మ్యాచ్‌ను ముగించారు. ఇంగ్లాండ్ జట్టు కేవలం 14.1 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. దీంతో బంగ్లాదేశ్‌పై 8 వికెట్లతో విజయం సాధించింది. జాసన్ రాయ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

england vs Bangladesh

చేతులెత్తేసిన బంగ్లా బ్యాటర్లు

టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌కు సరైన ఆరంభం లభించలేదు. ఓపెనర్లు లిటన్ దాస్ (9), మహ్మద్ నయీం (5), ఫస్ట్ డౌన్‌లో వచ్చిన షకీబుల్ హసన్ (4) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. కేవలం 26 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన బంగ్లాను ముష్ఫికర్ రహీమ్, మహ్ముదుల్లా ఆదుకోవడానికి ప్రయత్నించారు. వీరిద్దరూ కలసి నాలుగో వికెట్‌కు కీలకమైన 37 పరుగులు జోడించారు. అయితే ముష్ఫికర్ రహీం (29) లియామ్ లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇక ఆ తర్వాత బంగ్లా బ్యాటర్లు ఎవరూ నిలదొక్కుకోలేక పోయారు. నారుల్ హసన్ (16), నాసుమ్ అహ్మద్ (19) పర్వాలేదనిపించారు. ఇంగ్లాండ్ బౌలర్లు కట్టు దిట్టంగా బౌలింగ్ చేయడంతో క్రమం తప్పకుండా వికెట్లు పడటమే కాకుండా పరుగులు కూడా రాలేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో బంగ్లాదేశ్ 9 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. టైమల్ మిల్స్ 3 వికెట్లు, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టన్ చెరి రెండు వికెట్లు తీయగా.. క్రిస్ వోక్స్‌కు ఒక వికెట్ లభించింది.

స్కోర్ బోర్డు:

బంగ్లాదేశ్: లిటన్ దాస్ (సి) లియామ్ లివింగ్‌స్టోన్ (బి) మొయిన్ అలీ 9, మహ్మద్ నయీం (సి) క్రిస్ వోక్స్ (బి) మొయిన్ అలీ 5, షకీబుల్ హసన్ (సి) రషీద్ ఖాన్ (బి) క్రిస్ వోక్స్ 4, ముష్ఫకర్ రహీం (ఎల్బీడబ్ల్యూ)(బి) లియామ్ లివింగ్‌స్టోన్ 29, మహ్ముదుల్లా (సి) క్రిస్ వోక్స్ (బి) లియామ్ లివింగ్‌స్టోన్ 19, అఫిఫ్ హోస్సెన్ (రనౌట్) 5, నారుల్ హసన్ (సి) జాస్ బట్లర్ (బి) టైమల్ మిల్స్ 16, మహెది హసన్ (సి) క్రిస్ వోక్స్ (బి) టైమల్ మిల్స్ 11, నాసుమ్ అహ్మద్ 19 నాటౌట్, ముస్తఫిజుర్ రెహ్మాన్ (బి) టైమల్ మిల్స్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లు) 124/9

వికెట్ల పతనం: 1-14, 2-14, 3-26, 4-63, 5-73, 6-83, 7-98, 8-124, 9-124

బౌలింగ్: మొయిన్ అలీ (3-0-18-2), క్రిస్ వోక్స్ (4-0-12-1), ఆదిల్ రషీద్ (4-0-35-0), క్రిస్ జోర్డాన్ (2-0-15-0), టైమల్ మిల్స్ (4-0-27-3), లియామ్ లివింగ్‌స్టోన్ (3-0-15-2)

ఇంగ్లాండ్: జేసన్ రాయ్ (సి) నాసుమ్ అహ్మద్ (బి) షోరిఫుల్ ఇస్లామ్ 61, జాస్ బట్లర్ (సి) మహ్మద్ నయీం (బి) నాసుమ్ అహ్మద్ 18, డేవిడ్ మలన్ 28 నాటౌట్, జానీ బెయిర్‌స్టో 8 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (14.1 ఓవర్లు ) 126/2

వికెట్ల పతనం: 1-39, 2-112

బౌలింగ్: షకీబుల్ హసన్ (3-0-24-0), ముస్తాఫిజుర్ రెహ్మాన్ (3-0-23-0), షోరిఫుల్ ఇస్లామ్ (3.1-0-26-1), నాసుమ్ అహ్మద్ (3-0-26-1), మెహదీ హసన్ (2-0-21-0)