స్పిన్ దెబ్బకు కకావికలమైన భారత్

by  |
స్పిన్ దెబ్బకు కకావికలమైన భారత్
X

దిశ, స్పోర్ట్స్ : గబ్బాలో ఆసీస్‌ను దెబ్బకొట్టిన టీమ్ ఇండియానేనా ఇది? వికెట్ పడకుండా సెషన్ అంతా ఆడి డ్రా చేసుకున్న జట్టేనా? తొలి ఇన్నింగ్స్‌లో డెబ్బైల్లోనే నాలుగు వికెట్లు పడిన తర్వాత కూడా మూడొందలు దాటించిన కోహ్లీ సేనేనా? స్పిన్‌తో ఇంగ్లాండ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో మట్టి కరిపించిన టీమ్ ఇండియా.. అదే స్పిన్ దెబ్బకు కకావికలమైంది. హాట్ ఫేవరెట్లుగా బరిలోకి దిగి చతికిలపడింది. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఘోర పరాజయం మూటగట్టుకుంది. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 0-1తో వెనుకబడింది.

చెన్నైలోని చేపాక్ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమ్ ఇండియా 227 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. ఇంగ్లాండ్ జట్టు నిర్దేశించిన 420 పరుగుల విజయలక్ష్యంతో నాలుగో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియా ఆట ముగిసే సమయానికి రోహిత్ శర్మ వికెట్ కోల్పోయి 39 పరుగులు చేసింది. ఓవర్ నైట్ స్కోర్ 39/1తో ఐదో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియా తొలి సెషన్ నుంచే వికెట్లో కోల్పోవడం మొదలు పెట్టింది. పిచ్ బౌలర్లకు సహకరిస్తుండటంతో ఇంగ్లాండ్ కెప్టెన్ జాక్ లీచ్, అండర్సన్‌లతో బౌలింగ్ చేయించాడు. స్పిన్నర్లు బంతిని తిప్పేస్తుండటమే కాకుండా.. అండర్సన్ రివర్స్ స్వింగ్ కూడా చేయగలిగాడు. దీంతో ఏ ఒక్క బ్యాట్స్‌మన్ కూడా క్రీజులో ఎక్కువ సేపు ఉండలేకపోయారు. ఓవర్ నైట్ స్కోర్‌కు మరో 19 పరుగులే జోడించిన తర్వాత 58 పరుగుల వద్ద పుజారా (15) జాక్ లీచ్ బౌలింగ్‌లో బెన్ స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ, గిల్‌తో కలసి ఇన్నింగ్స్ నిర్మించడానికి ప్రయత్నించాడు. ఒక వైపు గిల్ వేగంగా పరుగులు సాధిస్తుంటే, కోహ్లీ ఆచితూచి ఆడాడు. వీరిద్దరూ కలసి మూడో వికెట్‌కు 34 పరుగులు జోడించారు.

భారీ భాగస్వామ్యాన్ని అందిస్తారనుకున్న సమయంలో జో రూట్ బంతిని అండర్సన్‌కు ఇచ్చాడు. వచ్చీ రావడంతోనే రివర్స్ స్వింగ్‌తో అర్ద సెంచరీ పూర్తి చేసుకున్న గిల్ (50)ను బోల్తా కొట్టించాడు. బంతి నేరుగా బ్యాట్, ప్యాడ్స్ మధ్య నుంచి వెళ్లి హాఫ్ స్టంప్‌ను గిరాటేసింది. ఆ తర్వాత బరిలోకి వచ్చిన అజింక్య రహానే (0)ను కూడా అలాంటి బంతితోనే బౌల్డ్ చేశాడు. అంతకు ముందు బంతికి రహానే ఎల్బీడబ్ల్యూ అయ్యాడనుకొని డీఆర్ఎస్ వెళ్లారు. కానీ రహానే బతికిపోయాడు. కానీ తర్వాత బంతికే క్లీన్ బౌల్డ్ అవడంతో మరో ఎండ్‌లో కోహ్లీని కూడా నిరాశకు గురిచేసింది. టీమ్ ఇండియాను కష్టాల్లో ఆదుకుంటున్న రిషబ్ పంత్ (11) కూడా అండర్సన్ బౌలింగ్‌లో జో రూట్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇక గత కొంత కాలంగా నిలకడగా ఆడుతున్న వాషింగ్టన్ సుందర్ (0) డామ్ బెస్ బౌలింగ్‌లో జాస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరో ఎండ్‌లో కోహ్లీ నిలకడగా ఆడుతున్న.. మరో వైపు అతడికి సహకారం లభించలేదు. లంచ్ విరామ సమయానికి టీం ఇండియా 6 వికెట్ల నష్టానికి 144 పరుగులతో పీకల్లోకి కష్టాల్లో పడింది.

తొలి సెషన్‌లోనే టీమ్ ఇండియా ఓటమి దాదాపు ఖరారయ్యింది. మిగిలిన నాలుగు వికెట్లతో రెండు సెషన్లు నిలవాలంటే అద్బుతమే జరగాలి. కానీ ఇంగ్లాండ్ బౌలర్లు భారత బ్యాట్స్‌మెన్‌కు ఆ అవకాశం ఇవ్వలేదు. కోహ్లీ నిలకడగా ఆడుతూ అర్ద సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడికి రవిచంద్రన్ అశ్విన్ (9) నుంచి కాస్త అండ లభించింది. ఏడో వికెట్‌కు వీరిద్దరూ కలసి 54 పరుగులు జోడించారు. లీచ్ మరోసారి బంతితో మ్యాజిక్ చేయడం మొదలు పెట్టాడు. లీచ్ బౌలింగ్‌లో రవిచంద్రన్ అశ్విన్ (9) బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే విరాట్ కోహ్లీ (72) బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఇక షాబాజ్ నదీమ్ (0)ను లీచ్ అవుట్ చేయగా.. జస్ప్రిత్ బుమ్రాను ఆర్చర్ అవుట్ చేశాడు. దీంతో 58.1 ఓవర్లలో టీమ్ ఇండియా 192 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ 227 పరుగులతో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. జాక్ లీచ్ 4, అండర్సన్ 3 వికెట్లు తీయగా, జోఫ్రా ఆర్చర్, డామ్ బెస్, బెన్ స్టోక్స్ తలా ఒక వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ చేసిన కెప్టెన్ జో రూట్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో ఇంగ్లాండ్ సిరీస్‌లో 1-0 ఆధిక్యత సంపాదించింది.

స్కోర్ బోర్డు :

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 578 ఆలౌట్
ఇండియా తొలి ఇన్నింగ్స్ 337 ఆలౌట్
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ 178 ఆలౌట్
ఇండియా రెండో ఇన్నింగ్స్

రోహిత్ శర్మ (బి) జాక్ లీచ్ 12, శుభమన్ గిల్ (బి) జేమ్స్ అండర్సన్ 50, చతేశ్వర్ పుజార (సి) బెన్ స్టోక్స్ (బి) జాక్ లీచ్ 15, విరాట్ కోహ్లీ (బి) బెన్ స్టోక్స్ 72, అజింక్య రహానే (బి) అండర్సన్ 0, రిషబ్ పంత్ (సి) జో రూట్ (బి) జేమ్స్ అండర్సన్ 11, వాషింగ్టన్ సుందర్ (సి) జాస్ బట్లర్ (బి) డామ్ బెస్ 0, రవిచంద్రన్ అశ్విన్ (సి) జాస్ బట్లర్ (బి) జాక్ లీచ్ 9, షాబాజ్ నదీమ్ (సి) రోరీ బర్న్స్ (బి) జాక్ లీచ్ 0, ఇషాంత్ శర్మ 5 నాటౌట్, జస్ప్రిత్ బుమ్రా (సి) బట్లర్ (బి) ఆర్చర్ 4; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (58.1 ఓవర్లు) 192 ఆలౌట్

వికెట్ల పతనం : 1-25, 2-58, 3-92, 4-92, 5-110, 6-117, 7-171, 8-179, 9-179, 10-192
బౌలింగ్ : జోఫ్రా ఆర్చర్ (9.1-4-23-1), జాక్ లీచ్ (26-6-76-4), జేమ్స్ అండర్సన్ (11-4-17-3), డామ్ బెస్ (8-0-50-1), బెన్ స్టోక్స్ (4-1-13-1)


Next Story