ఇంగ్లాండ్‌పై గెలవాలి.. మరో ఆప్షన్ లేదు

by  |
ఇంగ్లాండ్‌పై గెలవాలి.. మరో ఆప్షన్ లేదు
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియాలో కుర్రాళ్లతోనే విజయం సాధించిన టీమ్ ఇండియా.. పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దికి చెన్నై టెస్టులో ఘోర ఓటమిపాలైంది. అప్పటి వరకు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో అగ్రస్థానంలో ఉన్న టీమ్ ఇండియా.. ఒక్క ఓటమితో నాలుగో స్థానానికి పడిపోయింది. ఇక రేపటి నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టులో కచ్చితంగా గెలిస్తేనే సిరీస్ రేసులో, టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో ఉంటుంది. ఇప్పటికే తొలి టెస్టు ఓటమిపై పూర్తి సమీక్ష చేసిన జట్టు.. రెండో టెస్టు కోసం పూర్తిగా సన్నద్దం అయ్యింది.

తుది జట్టు కూర్పుపై కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి మల్లగుల్లాలు పడుతున్నారు. తొలి టెస్టులో ముగ్గురు స్పిన్నర్ల వ్యూహం బెడిసి కొట్టడంతో.. రెండో టెస్టు కోసం ఎలాంటి వ్యూహాలతో బరిలోకి దిగుతారనే దానిపై ఆసక్తిగా మారింది. మరోవైపు ఇంగ్లాండ్ జట్టు తొలి టెస్టు విజయంతో పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నది. ఒక మార్పు మినహా పాత జట్టుతోనే ఇంగ్లాండ్ జట్టు రెండో టెస్టు ఆడనున్నది. టెస్టు సిరీస్ గెలుపుతో పాటు వరల్డ్ టెస్టు చాంపియన్‌‌షిప్ ఫైనల్‌పై ఇంగ్లీష్ జట్టు కన్నేసింది.

మార్పులు బౌలింగ్‌లోనే..

భారత జట్టు ముఖ్యంగా బౌలింగ్‌లో మార్పులతోనే బరిలోకి దిగే అవకాశం ఉన్నది. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టుకు భారత బౌలర్లు 190 ఓవర్లు పాటు బౌలింగ్ చేశారు. తొలి రోజు అసలు బౌలర్లు ప్రభావం చూపలేక పోయారు. ఎడమ మడమ గాయం కారణంగా జట్టుకు దూరమైన అక్షర్ పటేల్‌ను రెండో టెస్టులో తీసుకోవడం ఖాయంగానే కనిపిస్తున్నది. దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌లో స్పిన్నర్ ఆల్‌రౌండర్‌గా మంచి పేరున్న అక్షర్ చెన్నై పిచ్‌పై ప్రభావం చూపించగలడని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నది. తొలి టెస్టులో ఆడిన షాబాజ్ నదీమ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.

దీంతో అతడిని పక్కన పెట్టి అక్షర్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకుంటారని తెలుస్తున్నది. బీసీసీఐ కూడా తాజాగా షాబాజ్ నదీమ్‌ను స్టాండ్ బై ఆటగాళ్లలో చేర్చి.. అక్షర్ పటేల్‌ను ప్రధాన ఆటగాళ్లలో చేర్చింది. ఇక తొలి టెస్టులో కుల్దీప్‌కు చోటివ్వకపోవడంపై విమర్శలు వచ్చాయి. అయితే కుల్దీప్‌ను ఆడించాలంటే వాషింగ్టన్ సుందర్‌ను పక్కన పెట్టాల్సి వస్తుంది. కానీ, బ్యాటింగ్ పరంగా సుందర్ మంచి ఫామ్‌లో ఉండటంతో అతడినే కొనసాగిస్తారా లేదా కుల్దీప్‌ను తీసుకుంటారా అనే దానిపై సందిగ్దత నెలకొన్నది. ఇక టీమ్ ఇండియా కనుక మరో ఫాస్ట్ బౌలర్‌ను తీసుకోవాలనుకుంటే మాత్రం సుందర్ బదులు హార్దిక్ పాండ్యాను ఆడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. కానీ, పిచ్ మొదటి రోజు నుంచే టర్న్ అవుతుందని క్యూరేటర్ చెప్పడంతో ముగ్గురు స్పిన్నర్ల వ్యూహాన్నే అమలు చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

రోహిత్, రహానేలు గాడిన పడాలి..

ఆస్ట్రేలియా పర్యటనలో పర్యటనలో పర్వాలేదనిపించిన ఓపెనర్ రోహిత్ శర్మ, అజింక్య రహానేలు ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో పూర్తిగా విఫలమయ్యారు. టాప్ ఆర్డర్‌లో కీలకమైన వీరిద్దరూ వరుసగా విఫలమవుతుండటంతో ఆ భారం మిగిలిన వారిపై పడుతున్నది. మెల్‌బోర్న్‌లో సెంచరీ చేసిన తర్వాత రహానే వరుసగా విఫలమవుతున్నాడు. రోహిత్ శర్మ సహచర ఓపెనర్ గిల్‌కు తోడ్పాటు ఇవ్వలేకపోతున్నాడు. వీరిద్దరూ కుదురుకుంటే బ్యాటింగ్‌లో టీమ్ ఇండియాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి రావడం, పంత్, సుందర్, పుజార జట్టు అవసరాలకు తగ్గట్లు ఆడుతుండటం కలిసొచ్చే అంశం. రెండో టెస్టుకోసం స్నిన్నింగ్ పిచ్ ఉపయోగిస్తుండటంతో ఇంగ్లాండ్ స్పిన్నర్లను మరింత ధీటుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది. డామ్ బెస్, జాక్ లీచ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. బంతిని వేగంగా తిప్పుతుండటంతో భారత జట్టు నెట్స్‌లో స్నిన్నర్లతో ప్రాక్టీస్ చేస్తున్నది.

కీలక మార్పులతో ఇంగ్లాండ్..

శ్రీలంక సిరీస్‌తో మొదలు పెట్టిన ఫామ్‌ను ఇంగ్లాండ్ జట్టు కొనసాగిస్తున్నది. తొలి టెస్టు విజయంతో పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నది. కీపర్ జాస్ బట్లర్ విశ్రాంతి కోసం ఇంగ్లాండ్ తిరిగి వెళ్లిపోవడంతో అతడి స్థానంలో బెన్ ఫోక్స్‌ను తీసుకున్నారు. ఇక గాయం కారణంగా జోఫ్రా ఆర్చర్ దూరమవడంతో అతడి స్థానంలో స్టువర్ట్ బ్రాడ్‌ను తీసుకుంది. ఇక అండర్సన్‌ బదులు క్రిస్ వోక్స్ తుది జట్టులోకి వచ్చాడు. తొలి టెస్టులో రాణించిన డామ్ బెస్ స్థానంలో మొయిన్ అలీని తీసుకున్నారు. గెలిచిన జట్టులో మార్పులు చేయడం పలువురిని ఆశ్చర్యపరిచినా.. పిచ్‌లో మార్పులు జరుగుతుండటంతోనే జట్టులో కీలకమార్పలు చేసినట్లు తెలుస్తున్నది.

టీమ్ ఇండియా అంచనా : శుభమన్ గిల్, రోహిత్ శర్మ, చతేశ్వర్ పుజార, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే (వైస్ కెప్టెన్), రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్/కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రిత్ బుమ్రా, ఇషాంత్ శర్మ/మహ్మద్ సిరాజ్

ఇంగ్లాండ్ జట్టు : జో రూట్ (కెప్టెన్), మొయిన్ అలీ, స్టువర్ట్ బ్రాడ్, రోరీ బర్న్స్, బెన్ ఫోక్స్ (కీపర్), డాన్ లారెన్స్, జాక్ లీచ్, ఓలీ పోప్, డామ్ సిబ్లే, బెన్ స్టోక్స్, ఓలీ స్టోన్/క్రిస్ వోక్స్


Next Story

Most Viewed