గంజాయి పీడ విరుగుడుకు కృషి చేద్దాం : ఎస్పీ

by  |
SP Rajendra Prasad
X

దిశ, హుజూర్ నగర్: సూర్యాపేట జిల్లాను గంజాయి రహితంగా మార్చడానికి అందరు కలిసి కట్టుగా కృషి చేయాలని ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ కోరారు. గంజాయి మత్తులో యువత జీవితాలు ఛిద్రమవుతున్నాయని అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కట్టవారి గూడెంలో పట్టుబడిన గంజాయి కేసు మీడియాకు వెల్లడించారు.

మనవడి సహాయంతో..

కట్టవారిగూడెంకు చెందిన పఠాన్ మస్తాన్ పెరటిలో దొంగచాటుగా గంజాయి మొక్కలను పెంచుతున్నాడని సమాచారం అందడంతో గరిడేపల్లి‌‌ పోలీసులు రైడ్ చేసి 1.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. పఠాన్ మస్తాన్‌తో పాటు గంజాయి మొక్కలను పెంపకాన్ని చూసుకుంటున్న అతని మనవడు షేక్ ఖాదర్ పాషాపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మస్తాన్‌కు గత పదేళ్లుగా గంజాయి తాగే అలవాటు ఉందన్నారు. అప్పట్లో విజయవాడలో కలిసిన‌ ఓ సాధువు చెప్పడంతో గంజాయి తాగడం అలవాటు చేసుకున్నాడని ఎస్పీ వెల్లడించారు.

ఆ వివరాలను గోప్యంగా ఉంచుతాం..

జిల్లాలో గంజాయి అమ్మినా.. సాగు చేసినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ కోరారు. సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు. జిల్లాను గంజాయి రహితంగా మార్చడంలో అందరు సామాజిక‌ బాధ్యతగా భావించాలన్నారు. రెగ్యులర్‌గా గంజాయి తాగే హాట్ స్పాట్‌లను గుర్తించి దాడులు నిర్వహించాలని పోలీసులను ఆదేశించారు. ‌ సమావేశంలో ఆయన వెంట డీఎస్పీ రఘు, సీఐ రామలింగారెడ్డి, ‌ఎస్ఐలు కొండల్ రెడ్డి, వెంకటరెడ్డి పాల్గొన్నారు.


Next Story