నిరుద్యోగ యువతకు గోల్డెన్ ఛాన్స్.. ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ పథకం ప్రారంభం

by Ramesh Naini |   (  Updated:2026-04-25 05:05:36  IST  )

యువతకు ఉపాధి అవకాశాలను మెరుగు పరచడం, వారికి పరిశ్రమల్లో ప్రాక్టికల్ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ పథకం (PMIS) - 2026’ను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది.

నిరుద్యోగ యువతకు గోల్డెన్ ఛాన్స్.. ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ పథకం ప్రారంభం
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలోని నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం గోల్డెన్ ఛాన్స్ కబురు చెప్పింది. యువతకు ఉపాధి అవకాశాలను మెరుగు పరచడం, వారికి పరిశ్రమల్లో ప్రాక్టికల్ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ పథకం (PMIS) - 2026’ను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, యువజన సర్వీసులు, క్రీడల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఏప్రిల్ 24న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. వివిధ రంగాలు, వృత్తులలో యువతకు వాస్తవ ప్రపంచ వ్యాపార వాతావరణంపై అవగాహన కల్పించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం.

అర్హతలు మరియు విద్యార్హతలు..

ప్రస్తుతం చదువు లేదా ఉద్యోగం చేయని 18 నుంచి 25 ఏళ్ల లోపు యువత ఈ పథకానికి అర్హులు. పదో తరగతి (Class 10), ఇంటర్ (Class 12), ఐటీఐ (ITI), డిప్లొమా, డిగ్రీ (గ్రాడ్యుయేషన్), మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రయోజనాలు - స్టైపెండ్ వివరాలు..

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 9 వేల చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు. ఇంటర్న్‌షిప్‌లో చేరిన వెంటనే ఒక్కసారిగా (One-time joining grant) రూ. 6 వేలు అందిస్తారు. ఈ ఇంటర్న్‌షిప్ వ్యవధి 6 నుంచి 9 నెలల పాటు ఉంటుంది. ప్రతిష్టాత్మక కంపెనీలలో నేరుగా పనిచేసే అనుభవం (Hands-on experience) లభిస్తుంది.

తెలంగాణలో అవకాశాలు ఎక్కడంటే..

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ ఇంటర్న్‌షిప్ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, పెద్దపల్లి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో యువత ఈ అవకాశాలను వినియోగించుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు తమకు అనువైన ప్రాంతం, రంగం, రోల్ మరియు విద్యార్హతల ఆధారంగా ఇంటర్న్‌షిప్ అవకాశాలను వెతుక్కోవచ్చు. అధికారిక పోర్టల్ https://mybharat.gov.in/ ద్వారా రిజిస్టర్ చేసుకుని దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లోనే ఇంటర్న్‌షిప్ ఆఫర్‌ను అంగీకరించి, కేటాయించిన ప్రదేశంలో విధుల్లో చేరాల్సి ఉంటుంది. అర్హులైన యువత ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, వాస్తవ పరిశ్రమ అనుభవాన్ని, ప్రాక్టికల్ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన ‘మై భారత్ (MY Bharat), హైదరాబాద్’ విభాగం తాజాగా ఒక ప్రకటనలో పిలుపునిచ్చింది. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://pminternship.mca.gov.in/login/ ను సందర్శించగలరు.

నిరుద్యోగులకు తపాలా శాఖ సువర్ణావకాశం.. ఫ్రాంచైజీల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

Next Story