‘నీట్’ రీఎగ్జామ్‌లో మాల్‌ ప్రాక్టీస్ కలకలం.. అడ్డంగా దొరికిన అచ్చంపేట విద్యార్థి

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-22 02:43:10  IST  )

హైదరాబాద్ ఆదిభట్ల పరిధిలో జరిగిన ‘నీట్’ పరీక్షలో మాల్ ప్రాక్టీస్ బయటపడింది.

‘నీట్’ రీఎగ్జామ్‌లో మాల్‌ ప్రాక్టీస్ కలకలం.. అడ్డంగా దొరికిన అచ్చంపేట విద్యార్థి
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నీట్ (NEET) ప్రవేశ పరీక్షలో మాల్ ప్రాక్టీస్ కలకలం రేపింది. పరీక్ష కేంద్రంలోకి పక్కా ప్లాన్‌తో మొబైల్ ఫోన్‌ను తీసుకెళ్లి, వాష్‌రూమ్‌లో దాచి కాపీయింగ్‌కు పాల్పడిన విద్యార్థి జండావత్‌ నరేందర్‌‌ (18)ను హైదరాబాద్ సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట (Achampet)కు చెందిన సదరు నిందితుడు (18) నీట్ పరీక్షలో ఎలాగైనా కాపీ కొట్టాలని ఒక పక్కా స్కెచ్ వేశాడు. పరీక్ష ప్రారంభానికి చాలా సమయం ముందే.. అంటే ఉదయం 7 గంటల ప్రాంతంలోనే రాగన్నగూడ జెడ్పీహెచ్ఎస్ (ZPHS) పరీక్ష కేంద్రానికి చేరుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా కాలేజీ వెనుక వైపు నుంచి గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. పరీక్ష రాసే సమయంలో గూగుల్ సెర్చ్ చేయడం కోసం తను తెచ్చుకున్న స్మార్ట్‌ఫోన్‌ (Smart Phone)ను అక్కడి వాష్‌రూమ్‌లో రహస్యంగా దాచిపెట్టాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా బయటకు వచ్చి, గేట్ ఓపెన్ అయ్యాక నిబంధనల ప్రకారం తనిఖీలు పూర్తి చేసుకుని పరీక్ష గదిలోకి వెళ్లాడు.

కడుపునొప్పి అంటూ డ్రామా..

పరీక్ష ప్రారంభమైన కొంత సమయానికి క్వశ్చన్ పేపర్‌లోని సమాధానాల కోసం జండావత్‌ నరేందర్‌ తన ప్లాన్‌ను అమలు చేశాడు. తనకు తీవ్రంగా కడుపునొప్పి వస్తోందంటూ పరీక్ష గదిలోని ఇన్విజిలేటర్లను నమ్మించాడు. అత్యవసరంగా వాష్‌రూమ్‌కు వెళ్లాలని కోరడంతో సిబ్బంది అతడిని అనుమతించారు. అయితే, వాష్‌రూమ్‌కు వెళ్లిన విద్యార్థి ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అక్కడి భద్రతా సిబ్బందికి అనుమానం వచ్చింది. వెంటనే వాష్‌రూమ్‌లోకి వెళ్లి పరిశీలించగా.. సదరు విద్యార్థి అంతకుముందు దాచిపెట్టిన మొబైల్ ఫోన్ తీసి, గూగుల్ క్రోమ్ (Google Chrome) ఓపెన్ చేసి ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలను వెతుకుతూ అడ్డంగా దొరికిపోయాడు. మాల్ ప్రాక్టీస్‌పై పరీక్ష కేంద్రంలోని అధికారులు వెంటనే ఆదిభట్ల పోలీసులకు సమాచారం అందజేయగా వారు స్పాట్‌కు చేరుకుని విద్యార్థిని అదుపులోకి తీసుకుని, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Next Story