ఉద్యోగాలు.. 3 లక్షల ఉపాధి అవకాశాలు! పర్యాటక రంగంలో తెలంగాణ ప్రభుత్వం బిగ్ ప్లాన్!

by Ramesh Naini |

రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు రేవంత్ సర్కార్ దృష్టి సారించింది.

ఉద్యోగాలు.. 3 లక్షల ఉపాధి అవకాశాలు! పర్యాటక రంగంలో తెలంగాణ ప్రభుత్వం బిగ్ ప్లాన్!
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు రేవంత్ సర్కార్ దృష్టి సారించింది. వచ్చే ఐదేళ్లలో చేపట్టాల్సిన కార్యాచరణను ఈ మేరకు రూపొందించుకుని ముందుకు వెళ్తున్నది. దీనిలో భాగంగా తెలంగాణ టూరిజం పాలసీ (2025 - 2030)ని పర్యాటక శాఖ రూపొందించింది. ఇప్పటికే రూపొందిన ఈ పాలసీలో పెట్టుబడుల ఆకర్షణ, ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, వ్యూహాత్మకంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి సమగ్రమైన ఫ్రేమ్‌వర్క్‌ను అందిస్తూ ప్రపంచస్థాయి సేవలు, పర్యాటక, మౌలిక రంగ అభివృద్ధికి పెద్దపీట వేయాలని నిర్ణయించారు. ప్రధానంగా ఈ ఐదేళ్లలో ఫలితాలను నిర్ధేశించుకున్నారు. రాబోయే ఐదేళ్లలో రూ.15 వేల కోట్ల కొత్త పెట్టుబడులను ఆకర్షించడం, 3 లక్షల కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా తెలంగాణను మొదటి 5 రాష్ట్రాల్లో ఒకటిగా నిలపడం, డిజిటల్ మార్కెటింగ్, బలమైన సోషల్ మీడియా, కల్చరల్ డాక్యుమెంటేషన్ ద్వారా చేయడం వంటి వాటిని ఈ పాలసీలో పొందుపర్చారు. దీనితో పాటుగా ప్రధానంగా రాష్ట్ర జీఎస్డీపీ పర్యాటక రంగం వాటాను 10 శాతం, అంతకంటే ఎక్కువకు పెంచడం వంటి లక్ష్యాలను పాలసీలో పొందుపర్చారు. వీటిలో సురక్షిత పర్యాటకం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పర్యాటక ప్రాంతాల అభివృద్ధిని ప్రధాన అంశంగా చేపట్టాలని రాష్ట్ర పర్యాటక రంగం భావిస్తోంది.

ప్రతిపాదించిన కీలకమైన స్టాటజీల్లో..

పర్యావరణ పర్యాటకం, వైద్యారోగ్య పర్యాటకం, ఆధ్యాత్మిక పర్యాటకం, వ్యాపార ప్రయోజనాల కోసం లేదా కార్పొరేట్ కార్యక్రమాల కోసం సమూహాలుగా ప్రయాణించే పర్యాటక రంగం అభివృద్ధి దీనిలో సమావేశాలు, ప్రోత్సహాకాలు, కాన్ఫరెన్స్‌లు, ప్రదర్శనలు ఉంటాయి. దీంతో పాటుగా క్రీడా పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ప్రత్యేక కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు బలోపేతం చేయడం, పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యాలను ప్రోత్సహించడం, ప్రోత్సహకాలు, రాయితీలు వంటివి ఉన్నాయి. బ్రాండింగ్, మార్కెటింగ్, జాతరలు, పండుగల నిర్వహణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, పర్యాటక అవార్డులు, వ్యాపారం చేసే వేగం, సౌలభ్యం వంటి అంశాలను కీలకమైన వ్యూహాత్మక అంశాలుగా నిర్దేశించుకున్నారు.

సంస్థాగత యంత్రాంగం..

పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందేందుకు సంస్థాగతంగా చేపట్టే అంశాలను కూడా పాలసీలో పొందుపర్చారు. రాష్ట్ర పర్యాటక ప్రోత్సాహక బోర్డు (ఎస్టీపీబీ)లో సీఎం అధ్యక్షతన కీలక అంశాలపైన చర్చిస్తారు. దీనిలో విధానాలు, వ్యూహాత్మకమైన ప్రాజెక్టులపై చర్చకు ఐకానిక్, మెగా ప్రాజెక్టుల చర్చలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎంపవర్డ్ కమిటీ (ఈసీ) దీంతో పర్యాటక శాఖ మంత్రి అధ్యక్షతన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. అంతర్గత సమస్యల పరిష్కారం వంటి అంశాలపైనా నిర్ణయాలు తీసుకుంటారు. పెద్ద, మధ్య తరహా, సూక్ష్మ, చిన్న తరహా సంస్థల ప్రతిపాదనల ఆమోద అధికారిగా వ్యవహారించే బాధ్యత ఉంటుంది. డెస్టినేషన్ మేనేజ్‌మెంట్ ఆర్గనైజేషన్స్ (డీఎంఓలు) పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోని ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ యూనిట్ ద్వారా సమగ్ర అభివృద్ధి పనులు, అమలు, నిర్వహణ, ప్రణాళిక, ప్రచారం, సమీక్ష, పర్యవేక్షణ కోసం ప్రతి ప్రత్యేక పర్యాటక ప్రాంతంలో జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ఇవి పనిచేస్తాయని ప్రభుత్వ వర్గాలు వివరించాయి. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ పాలసీని అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించారు. దీని ద్వారా పెరిగే పెట్టుబడులకు అనుకూలమైన పర్యావరణ వ్యవస్థను పెంపొందిస్తుందన్న అంచనాల్లో పర్యాటక విభాగం ఉంది. దీని ద్వారా సాధికారిత, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, దీర్ఘకాలిక ఆర్ధికపరమైన స్వావలంబన లభిస్తుందని, ఈ పాలసీలో పర్యావరణ, సామాజిక, పరిపాలన సూత్రాలు(ఈఎస్జీ) అనుగుణంగా సుస్థిర పర్యాటక పద్ధతులకు ప్రాధాన్యతను ఈ పాలసీ ఇస్తుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

Next Story