12వ తరగతి ఫలితాల్లో అమ్మాయిలదే హవా.. కొత్త విధానంలో మార్కుల గణన

by Phanindra |

12వ తరగతి ఫలితాలను సీబీఎస్ఈ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో అమ్మాయిలు సత్తాచాటారు. ఈసారి కొత్త విధానంలో మార్కుల గణన చేపట్టినట్లు సీబీఎస్ఈ తెలిపింది.

12వ తరగతి ఫలితాల్లో అమ్మాయిలదే హవా.. కొత్త విధానంలో మార్కుల గణన
X

దిశ, నేషనల్ బ్యూరో: 12వ తరగతి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఫలితాలు మంగళవారం నాడు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఉత్తీర్ణతా శాతం మెరుగైనట్లు స్పష్టంగా కనిపించింది. ఈ ఏడాది మొత్తం 88.39 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇది గతేడాదితో పోలిస్తే 0.41 శాతం ఎక్కువ. ఈ ఏడాది 12వ తరగతి పరీక్షలు రాసిన 16,92,794 మందిలో 14,96,307 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే ఈసారి కూడా అబ్బాయిలపై అమ్మాయిలే పైచేయి సాధించారు. పరీక్ష రాసిన అమ్మాయిల్లో 91.64 శాతం మంది ఉత్తీర్ణులవగా.. అబ్బాయిలు కేవలం 85.70 శాతం మంది మాత్రమే పరీక్షలు పాసయ్యారు.

మారిన మార్కుల విధానం..

సీబీఎస్ఈ ఈ ఏడాది మార్కులు లెక్కించే విధానాన్ని మార్చింది. సాధారణంగా ఉపయోగించే గ్రేడింగ్ విధానం స్థానంలో రిలేటివ్ గ్రేడింగ్ సిస్టంను వాడింది. ఈ విధానం ప్రకారం, విద్యార్థుల మార్కులను అదే సబ్జెక్టులో మిగతా స్టూడెంట్స్ ప్రదర్శనను బట్టి లెక్కిస్తారు. దీని వల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని, అనవసరమైన పోటీతత్వం పోవడంతోపాటు విద్యావాతావరణం మరింత సమతూకంగా మారుతుందని సీబీఎస్ఈ భావిస్తోంది.

ఈ కొత్త విధానంలో విద్యా్ర్థులు ఉత్తీర్ణులవడానికి ప్రాక్టికల్, థియరీ విభాగాలు కలిపి 33 శాతం మార్కులు సాధిస్తే చాలు. ఒకవేళ కొద్దితేడాతో 33 శాతం మార్కులు మిస్సయితే.. కొన్ని సందర్భాల్లో బోర్డు గ్రేస్ మార్కులు జోడించి సదరు విద్యార్థులను పాస్ చేసే అవకాశం కూడా ఉంది.

Next Story