నేపాల్‌లో కొత్త రాజకీయ యుగం!

by Ravi |   (  Updated:2026-03-11 00:30:35  IST  )

నేపాల్‌లో యువత ఆధ్వర్యంలో రాజకీయ మార్పు చోటుచేసుకుంది. అవినీతి, పాత రాజకీయాలకు వ్యతిరేకంగా జెన్-జీ మద్దతుతో బాలెన్ షా నాయకత్వంలో కొత్త రాజకీయ ప్రయోగం ప్రారంభమైంది.

నేపాల్‌లో కొత్త రాజకీయ యుగం!
X

సుదీర్ఘ కాలంగా రాజకీయ అనిశ్చితిని ఎదుర్కొంటున్న నేపాల్‌లో సంప్రదాయ రాజకీయ నేతలకు కాలం చెల్లినట్లే కనిపిస్తోంది. అవినీతిపై విసిగిపోయిన యువత, మార్పు కోరుకున్న సామాన్యులు దశాబ్దాలుగా దేశాన్ని ఏలుతున్న దిగ్గజ రాజకీయ పార్టీలను కాదని, పాత తరం నేతలను ఘోరంగా ఓడించి రాష్ట్రీయ స్వతంత్ర పార్టీకి బ్రహ్మరథం పట్టారు.. దీనికి నాయకునిగా ఉన్న బాలేంద్ర షా ప్రధాని కానున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో నేపాల్ యువత చేపట్టిన భారీ నిరసనలు ఈ మార్పునకు పునాది వేశాయి. అవినీతి, బంధుప్రీతి, పాత తరం నాయకత్వంపై విసిగిపోయిన యువత బాలెన్ వెనుక నిలబడ్డారు.. దీనిలో ప్రధాన భూమిక జెన్-జీ. ఈ తరం ప్రత్యేకత ఇంటర్నెట్, సోషల్ మీడియా, డిజిటల్ టెక్నాలజీ‌తో పెరిగిన తరం. సమాకాలీన సవాళ్లను అర్ధం చేసుకొని వేగంగా స్పందించే, సాంకేతికంగా ముందంజలో ఉండే తరం అన్నమాట. చిన్నతనం నుండే స్మార్ట్ ఫోన్‌లు, ఇంటర్నెట్ ఉపయోగించడం, సమయం, భౌగోళిక సరిహద్దులు లేని ప్రపంచంలో జీవించడం, భిన్న మైన ఆలోచనలు, సంస్కృతి‌లను గౌరవించడం జెన్ -జీ ముఖ్య ఆలోచనా విధానం. వీరిది ప్రపంచం ఇంత వరకూ చూడని, ఒక ప్రత్యేక జీవన ఆలోచనా విధానం. రాజుల పాలన నుండి కమ్యూనిస్ట్/మావోయిస్ట్ / ఏకైక హిందుత్వ భావజం కాదని స్వేచ్ఛా ప్రపంచానికి బాటలు వేయనున్న నవతరం అన్నమాట. ఇదో కొత్త ప్రయోగం. దీని మనుగడ, భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో, మిగిలిన దేశాలు ఎలా ఆహ్వానిస్తాయో వేచిచూద్దాం! 18 ఏళ్లలో 14 ప్రభుత్వాలను చూసిన నేపాల్‌కు ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని అందించాల్సిన బాధ్యత ఇప్పుడు బాలెన్‌పై ఉంది. నేపాల్‌కు ఇది కేవలం రాజకీయ మార్పు మాత్రమే కాదు. ఆ దేశ అంతర్జాతీయ సంబంధాలను సమతుల్యం చేయడం, అవినీతి రహిత పాలన అందించడం బాలెన్ ముందున్న ప్రధాన సవాళ్లు..

- రమణాచారి

99898 63039

Next Story