బొద్దింకలు కాదు.. దేశ భవిష్యత్తును మార్చే యువత!

by Ravi |   (  Updated:2026-06-03 21:15:48  IST  )

కాక్రోచ్ జనతా పార్టీ కేవలం సోషల్ మీడియా ట్రెండ్ కాదు. నిరుద్యోగం, అవకాశాల కొరత, రాజకీయ వ్యవస్థపై యువతలో పెరుగుతున్న అసంతృప్తికి ఇది ప్రతిబింబం. డిజిటల్ నిరసనగా మారిన ఈ ఉద్యమం భారత యువత మానసిక స్థితిని ఎలా ప్రతిఫలిస్తుందో తెలుసుకోండి.

బొద్దింకలు కాదు.. దేశ భవిష్యత్తును మార్చే యువత!
X

కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియాలో పుట్టుకొచ్చిన తాజా సంచలనం. ఈ పార్టీకి చెందిన ఎక్స్ ఖాతా బ్లాక్ కావడం, దానిపై ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేయడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అయితే ఒక సోషల్ మీడియా ఉద్యమాన్ని అడ్డుకునేందుకు ఇంతటి చర్యలు అవసరమా? అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. కానీ ఇది కేవలం సోషల్ మీడియా ట్రెండ్ కాదు. భారత యువత మానసిక స్థితికి అద్దం పట్టే సామాజిక సంకేతం.

దేశ చరిత్రలో ప్రతి తరం తన అసంతృప్తిని ఏదో ఒక రూపంలో వ్యక్తపరుస్తూనే వచ్చింది. ఒకప్పుడు వీధుల్లో జెండాలతో నినాదాలు, ఇప్పుడు మీమ్స్, హ్యాష్‌ట్యాగ్‌లు, డిజిటల్ ప్రచారాలు. రూపం మారింది కానీ ఆవేదన మారలేదు.. నిరుద్యోగం, అవకాశాల కొరత, రాజకీయాలపై విసుగు ఇవన్నీ యువతలో అసంతృప్తిని పెంచుతున్నాయి. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ నేటి యువత ఆవేదనకు ప్రతిబింబం. ‘ప్రశ్నించే వేదికలు మూసేస్తే, వ్యంగ్యమే ఆయుధం అవుతుంది’ అనే సందేశాన్ని ఇది తెలియజేస్తుంది.

అవమానాన్ని నిరసనగా మార్చుకుని..

భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద యువ జనాభా కలిగిన దేశం. దేశ జనాభాలో సుమారు 65 శాతం మంది 35 ఏళ్లలోపు వారే. కానీ అదే యువతలో నిరుద్యోగం ఆందోళనకర స్థాయికి చేరింది. పట్టణ ప్రాంతాల్లో యువ నిరుద్యోగిత 15 నుంచి 20 శాతం మధ్య ఉన్నట్లు పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఒకవైపు లక్షల రూపాయల ఫీజులతో విద్య వ్యాపారంగా మారుతుండగా, మరోవైపు పేపర్ లీకేజీలు, నియామకాల జాప్యం, కాంట్రాక్ట్ ఉద్యోగాలు యువత భవిష్యత్తును అనిశ్చితిలోకి నెడుతున్నాయి. చదువుకున్న యువకుడు ఉద్యోగం కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూస్తూ చివరకు తాత్కాలిక ఉపాధితో సరిపెట్టుకోవాల్సి వస్తే, అది వ్యక్తిగత వైఫల్యం కాదు. వ్యవస్థ వైఫల్యం. "కాక్రోచ్ జనతా పార్టీ" పుట్టుక వెనుక కూడా ఇదే అసంతృప్తి ఉంది. యువతను "బొద్దింకలు" అంటూ చేసిన వ్యాఖ్యలను అదే యువత నిరసన చిహ్నంగా మార్చుకోవడం వెనుక లోతైన సామాజిక సందేశం దాగి ఉంది. ఇది కేవలం సోషల్ మీడియా హడావుడి కాదు. వ్యవస్థపై పేరుకుపోయిన అసంతృప్తికి ప్రతిధ్వని.

ప్రతి ఉద్యమం వెనక.. ఒక ఆవేదన

నేటి పరిస్థితుల్లో అత్యంత ఆందోళనకర అంశం యువత రాజకీయ వ్యవస్థపై నమ్మకం కోల్పోతుండటమే. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రతి మీమ్ వెనుక ఒక బాధ ఉంది. ప్రతి వ్యంగ్య పోస్టు వెనుక ఒక నిరాశ ఉంది. ప్రతి డిజిటల్ ఉద్యమం వెనుక ‘మమ్మల్ని వినండి’ అనే ఆవేదన ఉంది. భారత యువత కేవలం నిరుద్యోగుల సమూహం కాదు. అది ఆలోచించే శక్తి, సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యం, సామాజిక బాధ్యత కలిగిన తరం. అందుకే కాక్రోచ్ జనతా పార్టీ వంటి ఉద్యమాలు కూడా కేవలం వ్యంగ్యానికి పరిమితం కాకుండా ప్రత్యామ్నాయ ఆలోచనలను సమాజం ముందుంచాలి. ఉద్యోగాలు, నైపుణ్యా భివృద్ధి, స్టార్టప్‌లు, సామాజిక సమానత్వం, ప్రజాస్వామ్య భాగస్వామ్యం, బీసీ-ఓబీసీ యువత సాధికారత వంటి అంశాలపై స్పష్టమైన దృక్పథాన్ని ప్రదర్శించాలి. ప్రభుత్వాలు యువతను కేవలం ఓటు బ్యాంక్‌గా కాకుండా విధాన నిర్ణయాల్లో భాగస్వాములుగా చూడాల్సిన అవసరం ఉంది. ‘చెట్టు బలంగా పెరగాలంటే వేర్లు బలంగా ఉండాలి’ అన్నట్టుగా యువత బలపడితేనే దేశ భవిష్యత్తు బల పడుతుంది.

ఈ ఉద్యమం ట్రెండ్ కాదు..

దేశ రాజకీయ వ్యవస్థ ఇప్పటికైనా ఒక విషయాన్ని గుర్తించాలి. యువత రోడ్డెక్కినప్పుడు మాత్రమే ఉద్యమం కాదు. సోషల్ మీడియాలో వ్యంగ్యంగా స్పందించినప్పటికీ అది ఒక నిరసనే. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వంటి ఉద్యమాలను కేవలం ట్రెండ్‌గా తీసుకోవడం సరైంది కాదు. అవి ఈ తరం మానసిక స్థితిని ప్రతిబింబిస్తున్నాయి. యువతను అవమానించే రాజకీయాలు తాత్కాలికంగా చప్పట్లు కొట్టించ‌వచ్చు. కానీ భవిష్యత్తును నిర్మించలేవు. ఈ దేశ యువత ఉద్యోగం అడుగుతోంది. ఆత్మగౌరవం అడుగుతోంది. భాగస్వామ్యం అడుగుతోంది. యువతను ‘బొద్దింకలు’గా చూడటం ఆపి.. భారత భవిష్యత్తుగా చూడాల్సిన సమయం వచ్చింది. లేకపోతే... ఈరోజు సోషల్ మీడియాలో వినిపిస్తున్న వ్యంగ్యం, రేపు దేశ రాజకీయ వ్యవస్థను కదిలించే పెద్ద సామాజిక ఉద్యమంగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు.

-దుండ్ర కుమారస్వామి

జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు

99599 12341

Next Story