- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జీవితం ఒక వరం - దాన్ని సంరక్షిద్దాం!
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా ‘ప్రపంచ ఆత్మహత్యల నిరోధక దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా ‘ప్రపంచ ఆత్మహత్యల నిరోధక దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ ఆత్మహత్యల నిరోధక సమితి(IASP) ఆధ్వర్యంలో ఈ దినోత్సవం నిర్వహించబడు తుంది. దీని ఉద్దేశం.. పెరుగుతున్న ఆత్మహత్యల సమస్యపై అవగాహన పెంచడం, ఆత్మహత్యలకు గురయ్యే ప్రమాదంలో ఉన్నవారిని రక్షించడం. ప్రభుత్వాలు, సమాజం, కుటుంబం కలిసి పని చేయడం.
2025 కాలానికి థీమ్, ‘Changing the Narrative on Suicide – Start the Conversation’ అంటే ఆత్మహత్యలపై మౌనం కాకుండా సంభాషణ మొదలుపెట్టాలి. ఎందుకంటే ఆత్మహత్య ఆలోచనలను దాచి పెట్టడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది. ఆత్మహత్య అనేది వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు, ఇది ఒక సామాజిక, ఆర్థిక, మానసిక ఆరోగ్య సమస్య.
దేశంలోని పరిస్థితి..
ప్రపంచంలో అత్యధిక ఆత్మహత్యలు జరుగు తున్న దేశాల్లో భారత్ ఒకటి. ఆత్మహత్యలతో తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ప్రతి సంవత్సరం విడుదల చేసే గణాంకాలు మన దేశంలో మానసిక ఆరోగ్య పరిస్థితి ఎంత దారుణంగా ఉందో బహిర్గతం చేస్తాయి. 2024 నివేదిక ప్రకారం భారత్‌లో 1,77,557 లక్షల మందికి పైగా ప్రాణాలు తామే తీసుకున్నారు. అంటే సగటున ప్రతిరోజూ 485 మంది, ప్రతి గంటకు 20 మందికి పైగా భార తీయులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 2023లో 1,70,924 మందితో పోలిస్తే 2024లో 3.9% పెరుగుదలన్న మాట. ఇక లింగ ప్రాతిపదికన, పురుషులు 67%, మహిళలు 32%, ఇతరులు 1% కన్నా తక్కువవయసు వారీగా 2024లో 18–30 ఏళ్లు 36%, 31–45 ఏళ్ల వారు 33%, 46–60 ఏళ్ల వారు 17%, 60 ఏళ్లు పైబడిన వారు 7%, అంటే భారతదేశ యువజనులు మొత్తం ఆత్మహత్యల్లో 70% పైగా ఉన్నారు.
తెలుగు రాష్ట్రాలలో..
ఎన్‌సీఆర్బీ 2024 ప్రకారం, తెలంగాణలో 10,856 ఆత్మహత్యలు జరిగాయి. 2021లో 10,171 ఉంది. అయితే ప్రస్తుతానికి ఇవి కొద్దిగానే పెరిగినప్పటికీ సంఖ్య భయంకరంగానే ఉంది. ఆత్మహత్యల రేటు, 15.8 (జాతీయ సగటు కంటే ఎక్కువ), రైతుల ఆత్మహత్యలు 1,720. అప్పులు, పంటలు విఫలం, వాతా వరణం. విద్యార్థులు 890 (పరీక్షల ఒత్తిడి, ఉద్యోగ భయం). గృహిణీలు 2,040 మంది చనిపోయారు. కుటుంబ సమస్యలు, రోగాలు, పరీక్ష విఫలతలు, రైతుల రుణ బాధలు ప్రధాన కారణాలు.. ముఖ్యంగా హైదరాబాద్, వరంగ ల్, ఖమ్మం జిల్లాల్లో అధిక ఆత్మహత్యల రేట్ నమోదు అయింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో 12,320 ఆత్మహత్యలు చేసుకు న్నారు. ఎక్కువగా కర్నూలు, విజయవాడ, గుంటూరు, విశాఖ జిల్లాలో నమోదు చేసినవి. ఇక విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువగా ఇంటర్మీడియట్, ప్రవేశ పరీక్షల సమయంలో జరుగుతున్నాయి. రైతుల ఆత్మహత్యలు కూడా పెద్ద సమస్యగానే కొనసాగుతున్నాయి.
ప్రధాన కారణాలు..
2024లో రైతులు, వ్యవసాయ కార్మికుల ఆత్మహత్యలు 12,160 నమోదు అయ్యాయి. ఇందులో రైతులు, పెద్దలు – 9,543, వ్యవసాయ కూలీలు – 2,617. 2024లో విద్యార్థుల ఆత్మహత్యలు 13,120. అంటే ప్రతి రోజు 36 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ముఖ్యంగా నీట్, ఐఐటీ-జేఈఈ, యూపీఎస్సీ వంటి పోటీ పరీక్షల ఒత్తిడి పెరుగుతూనే ఉంది. 2024లో 15,920 నిరుద్యోగులు తమ జీవితాన్ని ముగించారు. 2023తో పోలిస్తే ఇది 6% పెరుగుదల. 2024లో 22,380 గృహిణులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది మొత్తం మహిళా ఆత్మహత్యల్లో దాదాపు 50%. కుటుంబ ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, సంబంధాల విభేదాలు ప్రధాన కారణాలు.. వయస్సు, వృత్తి వారీగా చూసినట్లయితే, 15–29 ఏళ్ల యువతలో పరీక్షలు, కెరీర్ ఒత్తిడి, ప్రేమ విఫలతలు ప్రధాన కారణాలు.. 30–45 ఏళ్ల వారిలో ఆర్థిక ఒత్తిడి, కుటుంబ సమస్యలు. 45–60 ఏళ్ల వారిలో వ్యాధులు, డిప్రెషన్. దినసరి కూలీలు, అప్పులు. వర్షాభావం, రుణభారం, మార్కెట్ సమస్యలు ఇందుకు కారణాలుగా చెప్పవచ్చు.
నివారణ పద్ధతులు..
ఆత్మహత్య వ్యక్తిగత నిర్ణయం కాదు, అది సమాజం, కుటుంబం, ఆర్థిక వ్యవస్థల ప్రతి బింబం. ఎన్‌సీఆర్బీ గణాంకాలు మన ముందు ఒక మేల్కొలుపు గంట మోగిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుంటే, ప్రతి మనిషి ప్రాణం విలువైనదే అని గుర్తిస్తే, ఇవి తగ్గించడం సాధ్యమే. వ్యక్తిగత స్థాయిలో, సమస్యలు పంచుకోవడం, మానసిక సహాయం పొందడం. వ్యసనాల నుండి దూరంగా ఉండడం. ధ్యానం, యోగా, ఆరోగ్యకర జీవనశైలి. కుటుంబం స్థాయిలో, ఓపెన్ కమ్యూనికేషన్, ప్రేమతో ప్రోత్సహించడం. పిల్లలపై అధిక ఒత్తిడి లేకుండా చూసుకోవడం. మానసిక రుగ్మతల లక్షణాలు గమనించడం. పాఠశాల కాలేజీ స్థాయిలో, కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు. పరీక్షల ఒత్తిడిపై అవగాహన కార్యక్రమాలు. పీర్ సపోర్ట్ గ్రూప్‌లు, ప్రభుత్వం స్థాయిలో, మానసిక ఆరోగ్య సేవల విస్తరణ, ఆర్థిక సంక్షోభం తగ్గించే పథకాలు. రైతులకు బీమా, రుణమాఫీ. పెస్టిసైడ్ నియంత్రణ, హై రిస్క్ ఏరియాలో రక్షణ చర్యలు, మీడియా తన వం తుగా ఆత్మహత్యలపై సంచలన వార్తల ప్రసారాన్ని నివారించాలి. హెల్ప్‌లైన్ నంబర్లను తప్పనిసరిగా ప్రచురించాలి. పాఠశాల స్థాయిలో నుంచే మానసిక ఆరోగ్యంపై అవగాహన తప్పనిసరి చేయాలి. అందుకు సమాజం మొత్తం కృషి అవసరం.
-డా. కేశవులు బి.
ఎండి. సైకియాట్రీ,
85010 61659.






