- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ధరిత్రిని కాపాడుకోకపోతే..
భారతదేశం ప్రకృతిని పవిత్ర మనస్సుతో దేవతగా పూజించే దేశం. వేదాలలో "మాతా భూమిః పుత్రోహం పృథివ్యాః

భారతదేశం ప్రకృతిని పవిత్ర మనస్సుతో దేవతగా పూజించే దేశం. వేదాలలో "మాతా భూమిః పుత్రోహం పృథివ్యాః"అని పేర్కొన్నట్లు, భూమిని తల్లిగా భావించే తత్వం మన దేశానికి ఉన్న ప్రత్యేకత. ప్రకృతిని దైవంగా చూసే మన సంప్ర దాయం – వృక్ష పూజ, నది పూజ, పర్వత పూజ వంటి అంశాలలో వ్యక్తమవుతుంది. తులసి చెట్టు, రావి చెట్టు వంటి వృక్షాలను పూజించడం, గంగ, యమున, సరస్వతి వంటి నదులను పవిత్రంగా భావించడం ఇవన్నీ మన ప్రకృతి కేంద్రక ప్రాపంచిక దృక్పథాన్ని సూచిస్తాయి. ఇటువంటి జీవన విధానం ద్వారా మన పురాణాలు, శాస్త్రాలు ప్రకృతి పరిరక్షణపై చక్కటి సందేశాలను అందించాయి.
ప్రపంచీకరణ ప్రభావం..
నేటి ప్రపంచీకరణ యుగంలో మానవ జీవిత విధానాలు సంపూర్ణంగా మారిపోయాయి. విపరీతమైన పట్టణీకరణ, ఖనిజ వనరుల తవ్వకాలు, పర్యావరణ కాలుష్యం, ప్లాస్టిక్ వినియోగం, పురుగుల మందుల వినియోగం, కార్బన్ ఉద్గారాలు భూమిని శ్వాస తీసుకోలేని పరిస్థితికి నెట్టివేసాయి. ఇక వనరుల శోషణ, పర్యావరణ నాశనం వల్ల భూమి వేడెక్కుతుంది, మానవ ఆరోగ్యం దెబ్బతింటుంది. పంటల ఉత్పత్తి దెబ్బతింటుంది, వాతావరణ మార్పులు, హరిత గృహ వాయువుల పెరుగుదల, అకాల అతి వర్షాలు, ఊహించని కరువు, వరదలు వంటి విపత్తులు భవిష్యత్తును అందకారంలో మార్చేలా ఉన్నాయి.
ధరిత్రి అప్రతిహత శక్తి
పారిశ్రామికీకరణం దేశ ఆర్థిక ప్రగతికి అవసరమే కానీ అంతకు మించి పర్యావరణ రక్షణ కూడా అవసరం అని దేశంలోని, రాష్ట్రాలలో ప్రతి రాజకీయ పార్టీ గమనించాలి. ఇలాంటి పరిస్థితుల్లో ధరిత్రి దినోత్సవం ఒక అప్రతిహత శక్తిగా నిలుస్తోంది. ఇది ప్రతి మనిషిలో పర్యావరణ చైతన్యం కలిగించడానికి మార్గదర్శకంగా మారుతోంది. ఈ సందర్భంగా మనం భారతీయ సంప్రదాయాల నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు అనేకం ఉన్నాయి.
భూమికి ఆధారంగా మనం
ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పర్యావరణ పరిరక్షణలో వాడుకోవచ్చు. వృక్షాభి వృద్ధిని ట్రాక్ చేయడం, కాలుష్య స్థాయిని గమనించడం, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు దోహదం చేయడం కోసం టెక్నాలజీ ఉపయోగపడుతుంది. నేడు ప్రపంచం నేడు సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. భూమి మన ఆధారంగా ఉండాలంటే, మనం దానికి ఆధారంగా నిలవాలి. ప్రకృతి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కంకణ బద్దలు కావాలి. ప్రతి పౌరుడు ప్లాస్టిక్‌ను తగ్గించి పర్యావరణ హితమైన వస్తువులు వాడటం, పచ్చదనం పెంపుదలపై దేశ పౌరులలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అవసరం. ఇక్కడ సామాజిక బాధ్యతతో పాటు వ్యక్తిగత భద్రతా దాగి ఉంది. భారతదేశ సంస్కృతిలో నిక్షిప్తమైన ప్రకృతి ప్రేమను నేటి తరాలకు తెలియజేయాలి. భవిష్యత్ తరాల కోసం పచ్చని భూమిని అందించడమే మన గొప్ప బాధ్యతగా ఉండాలి.
(నేడు ప్రపంచ ధరిత్రి దినోత్సవం)
కమల హాసన్ తుమ్మ
- Tags
- World Earth Day






