రీయింబర్స్‌మెంట్ సంక్షోభం తీర్చరా?

by Ravi |   (  Updated:2026-05-22 00:30:56  IST  )

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల కాకపోవడంతో లక్షలాది మంది పేద విద్యార్థులు ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీవో నెం.7, ప్రైవేట్ కాలేజీల ఫీజుల ఒత్తిడి, ప్రభుత్వ నిర్లక్ష్యంపై విశ్లేషణ.

రీయింబర్స్‌మెంట్ సంక్షోభం తీర్చరా?
X

పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన పథకమే ఫీజు రీయింబర్స్‌మెంట్. తెలంగాణలో దాదాపు 90 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులు ఈ పథకంపై ఆధారపడి చదువుకుంటున్నారు. అయితే గత నాలుగైదు సంవత్సరాలుగా సుమారు రూ.10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్‌ బకాయిలు పేరుకుపోయినా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2024-25 విద్యా సంవత్సరం నుంచి నిధులను క్రమం తప్పకుండా విడుదల చేస్తామని, పాత బకాయిలను వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద చెల్లిస్తామని సీఎం ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు అమలు కాలేదు. ఇకనుండి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ట్రస్ట్, CSR నిధులతో అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించి ప్రత్యేక కమిటీని నియమించింది. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించినప్పటికీ, ఇప్పటికీ నివేదికపై ఎలాంటి స్పష్టత లేదు. ఇక బకాయిల కారణంగా ప్రైవేట్ కాలేజీలు విద్యార్థులపై ఫీజుల భారం మోపుతున్నాయి. ఫీజులు చెల్లించకపోతే సర్టిఫికెట్లు ఇవ్వబోమని యాజమాన్యాలు స్పష్టం చేయడంతో విద్యార్థులు పీజీ అడ్మిషన్లు, ఉద్యోగ అవకా‌శాలు కోల్పోతున్నారు. ఇదే పరిస్థితిపై కొన్ని కాలేజీలు హైకోర్టును ఆశ్రయించగా, ప్రభుత్వం సమాధానం ఇవ్వకపోవడంతో విద్యార్థుల నుంచే పూర్తి ఫీజులు వసూలు చేసుకోవచ్చని మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇక ఇటీవల విడుదలైన జీవో నెం.7 ద్వారా స్కాలర్షిప్ మొత్తాన్ని నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమ చేసి, వారే కాలేజీలకు చెల్లించే విధానం తీసుకురావడం పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్త మవుతున్నాయి. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బకాయిలను విడుదల చేసి, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని సమర్థంగా అమలు చేయాలి.

- దేవేందర్ ముంజంపల్లి

ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్

8978458611

Next Story