చూపు మారితేనే మహిళా వికా‌సం!

by Ravi |   (  Updated:2025-03-08 01:15:18  IST  )

ఏ సమాజం, ఏ సంస్కృతి, ఏ జాతి స్త్రీకి సమున్నత స్థానం కల్పిస్తుందో ఆ సమాజం, ఆ సంస్కృతి, ఆ జాతి అభివృద్ధి పథంలో

చూపు మారితేనే మహిళా వికా‌సం!
X

ఏ సమాజం, ఏ సంస్కృతి, ఏ జాతి స్త్రీకి సమున్నత స్థానం కల్పిస్తుందో ఆ సమాజం, ఆ సంస్కృతి, ఆ జాతి అభివృద్ధి పథంలో ముందుంటుంది. ఏ దేశంలోనైనా జనాభాలో సగ భాగమైన స్త్రీలు వారిలోని ఉత్పాదక శక్తిని వినియోగించే అవకాశం ఉంటేనే కదా సమాజం అన్ని రంగాల్లో సాధించి ముందుకు వెళుతుంది. ప్రస్తుత స్త్రీ అన్ని రంగాల్లో పురుషుల కన్నా మిన్నగా రాణిస్తున్నప్పటికీ స్త్రీ పట్ల చులకన భావం నుంచి సమాజం బయటపడలేదు.

సమాజంలో మార్పు రావాలంటే వాస్తవాన్ని ఒప్పుకోవాలి. స్త్రీని ఒక మహిళగా చూడడం నేర్చుకోవాలి. పిల్లలకు పాఠశాల దశ నుండి స్త్రీ పట్ల చైతన్యవంతమైన దృక్పథంతో అలవాటు పడాలి. పాఠ్యపుస్తకాలు ఇందుకు దోహదపడాలి. అప్పుడే లైంగిక వేధింపులకు అడ్డుకట్టపడుతుంది. అయితే దృక్పథంలో మార్పు అనేది నిరంతరం జరగాల్సిన ప్రక్రియ. స్త్రీల మీద జరిగే దాడుల విషయంలో సత్వర న్యాయం జరిగే విధంగా చూడాలి.

ఎవరు ఎక్కువ పనిచేస్తున్నట్టు?

మహిళ రక్షణ కోసం రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు పాలకులు అనేక చట్టాలు చేశారు. అయినప్పటికీ శతాబ్దాల తరబడి మహిళను సంస్కృతి పేరుతో అనేక రకాలుగా అణిచి వేస్తూనే ఉన్నారు. నేటికీ అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రూపం మారింది తప్ప మూలం మారలేదు. మహిళలు, విద్యార్థినిలు, లైంగిక వేధింపులకు, అత్యాచార, గృహహింస, వరకట్న వేధింపులకు తీవ్రమైన ఇబ్బందులు గురవుతున్నారు. ఉదాహరణకు ఒకే సంస్థలో ఉద్యోగం చేసే ఒక పురుషుడిని, ఒక మహిళను తీసుకుంటే, మగవారు ఇంటి దగ్గర నుంచి వచ్చింది మొదలు మళ్లీ ఇంటికి వచ్చే వరకు తన పని తాను చేసుకుంటూ వెళ్తాడు. అయితే స్త్రీ తన విధులు పురుషులతో సమానంగా నిర్వహించడంతో పాటు ఇంటి గురించి ఆలోచిస్తుందన్న విషయాన్ని కాదనగలమా? పసిపిల్లలు ఉంటే వాళ్లు ఎలా ఉన్నారో అని, బడికి పోయే పిల్లలు ఉంటే వాళ్లు బడి నుంచి వచ్చాక తిన్నారో లేదో నని ఆలోచించేది స్త్రీ మాత్రమే. పురుషుడికి బాధ్యత లేదు అని ఇక్కడ వాదన కాదు. ఇంటి వ్యవహారం అంతా స్త్రీ చూసుకుంటుందని భరోసా. ఈ పరిస్థితుల్లో ఎవరు ఎక్కువ పని చేస్తునట్లు? పైగా స్త్రీ ప్రకృతి పరంగా తనకుండే ఇబ్బందులను అధిగమించి పనిచేయాలి. కానీ పురుషులకు ప్రకృతి పరమైన ఇబ్బందులు ఏమీ లేవు.

వస్త్రధారణపై అడ్డగోలు వాదనలా?

ఈ సృష్టికి మూలం స్త్రీ ఒక అమ్మగా, అక్కగా, చెల్లిగా, భార్యగా వివిధ మానవ సంబంధాలలో పిలుచుకుంటూ స్త్రీని ఒక దేవతగా పూజించే సంస్కృతి మనది. కానీ ప్రస్తుత యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం, అశ్లీల చిత్రాలు చూడడం, పిల్లలు ఫోన్ వాడకంపై పెద్దల నియంత్రణ లేకపోవడంతో అత్యాచారాలు కారణం అవుతున్నాయి. మహిళా మణులు వస్త్రధారణ విషయంలో జాగ్రత్తగా ఉండకపోవడంతో అత్యాచారాలు పెరుగుతున్నాయని కొందరు మేధావులు అంటారు.. మరి గతంలో జరిగిన తొమ్మిది నెలల పసి పాపను ఏ దుస్తుల్లో చూసి హత్యాచారానికి పాల్పడ్డారు? దీనిని అడ్డుకోవడంతో పాటు ఇలాంటి వాదనలను నిర్మూలించాలి. స్త్రీలు పని ప్రదేశంలో ఇంటి గురించి ఆలోచించేది పని కిందికి రాదనే వితండ వాదులు ఉన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు.. మరి పని ప్రదేశంలో ఉండి అక్కడ బాధ్యతలు పురుషులతో సమానంగా నిర్వహిస్తూ కూడా రేపటి పౌరులను, అంటే తన పిల్లలను గురించి ఆలోచించడం అంటే అది సమాజ సేవ కాదా? ఆ పిల్లలే కదా రేపు ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు అయ్యేది.

సమాజ శ్రేయస్సు కోసం..

నిజానికి మహిళా సమస్యలను పురుషులు కొంతవరకే అర్థం చేసుకోగలరు. పకృతి పరంగా స్త్రీకి ఉన్న సమస్యలు స్త్రీలకు మాత్రమే అర్థమవుతాయి‌. మరి ఆ సమస్యల పరిష్కారానికి చేసే విధాన రూపకల్పన ప్రక్రియలో స్త్రీలకు స్థానం ఉండాలా? లేదా? ఇప్పటికీ చట్ట సభల్లో స్త్రీలకు జనాభాలో వారి నిష్పత్తి ప్రకారం తగిన ప్రాతినిధ్యం లేదు. నేడు డ్వాక్రా మహిళ ఉద్యమం కారణంగా బ్యాంకులు స్వయం సహాయక సంఘాలకు పూచీ కత్తు లేని రుణాలను విరివిగా ఇస్తున్నాయి. మహిళలు ఆత్మవిశ్వాసంతో బ్యాంకు మెట్లు ఎక్కుతున్నారు. బ్యాంకు అధికారులతో ధైర్యంగా మాట్లాడుతున్నారు. నిజానికి స్త్రీ మొహంలో చిరునవ్వు ఉంటే తన ఇంట్లో సంతోషం ఉన్నట్టు, స్త్రీ ఆరోగ్యంగా ఉంటే తన ఇల్లు కూడా ఆరోగ్యంగా ఉన్నట్టు, స్త్రీ చేతిలో ధనం ఉంటే ఆ ఇంట్లో ధనం ఉన్నట్లు, స్త్రీ చేతిలో ఉండేది ఏదైనా కుటుంబంలో ప్రతి మనిషికి అందుతుందటంలో ఎటువంటి సందేహం లేదు. మధ్యతరగతి ఇండ్లలో స్త్రీ తినే సమయంలో కూడా ముందు పిల్లలకు, తర్వాత పెనిమిటికి ఇచ్చి మిగిలితే తాను తింటుంది. తానే ముందు తినదు. స్త్రీ సహజంగా త్యాగశీలి. అంతటి బాధ్యత, స్ఫూర్తి, త్యాగనిరతి ఉన్న వ్యక్తి విధాన రూపకల్పన ప్రక్రియలో తప్పని సరిగా భాగస్వామి అయి ఉండాలి. ఇది సమాజానికి శ్రేయస్కరం. ఆ దిశగా స్త్రీలు పయనించడానికి, విధాన రూప కల్పనలో భాగస్వామ్యం పొందడానికి కుటుంబ పరంగా, సమాజపరంగా అనువైన వాతావరణం కల్పించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నదన్న విషయాన్ని ఈరోజు మన అర్థం చేసుకుంటే మహిళా దినోత్సవం వేడుక పరిపూర్ణమైనట్టే.

(నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం)

భూక్యా రజిత

కండక్టర్, వరంగల్

73828 39738

Next Story