భారతీయ సినిమాల్లో మహిళా రచయితలు..

by Disha edit |
భారతీయ సినిమాల్లో మహిళా రచయితలు..
X

హుశా భారత రాజకీయాల్లోనూ, సినిమా రంగంలోనూ ఉన్నన్ని మూఢ నమ్మకాలూ, సెంటి మెంట్లూ మరే ఇతర రంగాల్లో కనిపించవు. ఒక రాజకీయ పార్టీ రైతుల గురించి మాట్లాడి విజయం సాధిస్తే మొత్తం పార్టీలన్నీ అదే మాట మాట్లాడతాయి. అట్లాగే సినిమా రంగంలోనూ ఒక ఒరవడిలో సినిమా ఆర్థికంగా విజయం సాధిస్తే ఇక కొంత కాలం అదే మూసలో సినిమాలు నిర్మాణం కావడం సాధారణం. వాటిమీద జనానికి విసుగెత్తడంతో ఒకటి రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయిన తర్వాతే మరో మూస ఫార్ములా కోసం పాకులాడటం మనం చూస్తూనే ఉంటాం. 1980లో ‘మాభూమి’ విజయం తర్వాత ‘ఎర్రమల్లెలు’, ఆ తర్వాత అవే ఎర్ర సినిమాలు ఎన్ని వచ్చాయో మనం చూసాం. అదే విధంగా బాలకృష్ణ నటించిన ఒక రాయలసీమ ఫ్యాక్షన్ సినిమా విజయం సాధించిన తర్వాత అదే ఫార్ములాతో ఎన్ని తెలుగు సినిమాలు విడుదల అయ్యాయో చూసాం. ఇవి మచ్చుకు కొన్నే. ఈ పరిస్థితి కేవలం తెలుగు సినిమాలకే కాదు భారతీయ అన్ని భాషల్లోని ప్రధాన స్రవంతి సినిమాల్లోనూ ఉంది. హిందీ సినిమా రంగం సైతం ఇందుకు మినహాయింపు లేదు. మూడు ఫైట్లు, ఆరు పాటలూ అన్న చందంగా అనేక రొటీన్ రొడ్డకొట్టుడు సినిమాలు హిందీలో కూడా అనేకం.

అవుట్ ఆఫ్ ది బాక్స్ సినిమాలు..

అట్లాగే అన్ని భారతీయ సినిమాల్లో హీరో డైరెక్టర్, హీరో హీరోయిన్‌ల కాంబినేషన్ అన్న ఫార్ములా కూడా ఉంది. ఇట్లా విచిత్రమయిన అంధ విశ్వాసాలతో హిందీ సినిమా కూడా కునారిల్లుతూనే ఉంది. అయితే హిందీ సినిమా విస్తృతి పెద్దది కనుక ఆ ఫార్ములా ఒరవడిలో అది కొట్టుకుపోతున్నా అప్పుడప్పుడూ కొంత భిన్నమైన సినిమాలు హిందీలో వస్తూనే ఉన్నాయి. ఆర్ట్ సినిమాలు వాస్తవిక సినిమాలు కనుమరుగయినప్పటికీ సబ్జెక్ట్స్‌లోనూ, మేకింగ్‌లోనూ కొంత భిన్నమైన సినిమాలు హిందీలో వస్తూనే ఉన్నాయి. అందుకే హిందీ సినిమా రంగంలో ఇట్లా వచ్చి విడుదలై కోట్లు కొల్లగొట్టి అట్లా ప్రేక్షకుల మనసుల్లోంచి మాయమయి పోయే సినిమాలకు సమాంతరంగా నాలుగు కాలాలపాటు చూపరులకు గుర్తుండే కొన్ని మంచి సినిమాలు కూడా తయారవుతూనే ఉన్నాయి. విజయవంతమవుతూనే వున్నాయి. మంచి సినిమా చూసామన్న అనుభూతిని ప్రేక్షకుల్లో మిగులుస్తున్నాయి. సామాజిక, మానసిక అంశాల్ని కూడా ఇలాంటి ‘అవుట్ ఆఫ్ బాక్స్’ సినిమాలు తరుముతూనే వున్నాయి. అలాంటి కనీస అర్థవంతమైన సినిమాలు హిందీతో సహా పలు ఇతర భాషా సినిమా రంగాల్లో వస్తూనే వున్నాయి.

ఇలాంటి అవుట్ ఆఫ్ బాక్స్ సినిమాలు రావడానికి ప్రధానంగా భిన్నమైన కథ, వినూత్నమైన స్క్రీన్ ప్లే, అవుట్ ఆఫ్ ది ట్రాక్ ఫిలిం మేకింగ్‌లు ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. ఇలా భారతీయ సినిమా విలక్షణతను సంతరించుకుని దాని ముఖ చిత్రం మారుతూ వుండడం మనం గమనించవచ్చు. ఆ స్థితికి ప్రధానంగా కొంతమంది విలక్షణ మహిళా రచయిత్రులు స్క్రీన్ రైటర్లు రంగంలోకి రావడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. కొన్ని సంవత్సరాలుగా పలువురు మహిళా రచయితలు పలు విజయవంతమైన అర్థవంతమైన సినిమాల నిర్మాణంలో భాగం పంచుకున్నారు. అలా ఆ మధ్య వచ్చిన ‘మంటో’, ‘మన్మర్జియా’, గల్లీ బాయ్ లాంటి సినిమాల రచయిత్రులు దర్శకుల గురించి ఒకసారి మాట్లాడుకుందాం.

కనికా ధిల్లాన్

అమృత్‌సర్‌లో పుట్టిన కనికా మంచి రచయిత్రిగా ఎదిగి.. బాంబే డక్ ఈస్ ఏ ఫిష్, శివ అండ్ ద రైస్ ఆఫ్ షాడోస్, ద డాన్స్ ఆఫ్ ద దుర్గా లాంటి నవలలు రాశారు. ఆమె మొదట రెడ్ చిల్లీలో పనిచేస్తూ ‘ఓం శాంతి ఓం’కి సహాయ దర్శకురాలిగా పని చేసింది, తర్వాత రావన్, సైజ్ జీరో, మాన్ మర్జియాలకు స్క్రిప్ట్ రచన చేసింది. ఇటీవల కేదార్‌నాథ్, మెంటల్ హై క్యాలకు కథ, స్కీన్‌ప్లే సంభాషణలు రాసింది. విజయవంతమైన రచయిత్రిగా నిలదొక్కుకుంది.

జుహీ చతుర్వేది

1975లో లక్నోలో జన్మించిన జుహీ లక్నోలోనే డిగ్రీ పూర్తి చేసి టైమ్స్ ఆఫ్ ఇండియాలో చేరింది. ఆ తర్వాత 1996లో ఢిల్లీలో అడ్వర్‌టైస్‌మెంట్ కంపెనీలో చేరింది. తర్వాత అక్కడే తన మొదటి సినిమా ‘విక్కీ డోనార్’ సినిమా స్క్రిప్ట్ రాయడం ఆరంభించింది. విక్కీ డోనార్‌కు రచయిత్రి‌గా, ‘మద్రాస్ కెఫే’కు సంభాషణలు, ‘పీకూ’, ‘అక్టోబర్’, ‘స్కై ఈస్ పింక్’ సినిమాలకు రచయిత్రిగా పనిచేసి అద్భుతమైన సినిమాల్ని అందించింది. ఆమె విక్కీ డోనార్ సినిమాకు జాతీయ స్థాయి అవార్డును సైతం అందుకుంది.

కొంకణ సేన్ శర్మ

బెంగాలి నటి అపర్ణ సేన్ కూతురు అయిన కొంకణ మొదట మంచి నటిగా గుర్తింపు పొందింది. రెండు జాతీయ అవార్డులు, నాలుగు ఫిలిం ఫేర్ అవార్డులు సొంతం చేసుకుంది. ఇక రచయిత్రిగా దర్శకురాలిగా కొంకణ ‘ఎ డెత్ ఇన్ ద గంజ్’తో తన ప్రతిభను నిరూపించింది.

అలంకృతా శ్రీవాస్తవ

ఢిల్లీలో జన్మించిన అలంకృత ప్రకాష్ ఝా తీసిన ‘గంగా జల్’, ఖోయా ఖోయా చాంద్, ‘రాజనీతి’ లాంటి సినిమాలకు సహాయ దర్శకురాలిగా పనిచేసి తన మొదటి సినిమా ‘టర్నింగ్ 30’ రూపొందించింది. తర్వాత ఆమె తీసిన ‘లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా’ ఎంత చర్చనీయాంశమైన సినిమాగా నిలబడిందో చూసాం. తర్వాత ఆమె ‘దోలి కిట్టీ అవుర్ చమక్తే సితారే’, ‘మెర్ ఇన్ హెవెన్’ సినిమాలు రూపొందించింది. ఆమె ఈ సినిమాలకు రచయిత్రి, దర్శకురాలిగా పనిచేసారు.

గౌరీ షిండే

పూనేలో పుట్టి పెరిగిన గౌరీ షిండే ముంబై లి సిద్దార్థ్ ఖక్ దగ్గర సహాయ దర్శకురాలిగా పని చేసింది. తన మొదటి సినిమాగా ‘ఇంగ్లీష్ వింగ్లిష్’ రూపొందించింది. కథా రచన, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతల్ని తానే నిర్వహించింది. ఆ సినిమా శ్రీదేవి చలనచిత్ర కెరీర్‌కు పునర్ ఆరంభం పలికింది. తర్వాత షారుఖ్ ఖాన్, అలియా భట్ నటించిన ‘డియర్ జిందగీ’ సినిమాకు కూడా ఆమె కథా రచన, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహించింది. ఆ రెండు సినిమాల కథలు విలక్షణతను సంతరించుకున్నాయి. రచయిత్రిగానూ దర్శకురాలి గాను షిండే ఇవ్వాళ హిందీ రంగంలో ప్రముఖ స్థానాన్ని పొందింది.

జోయా అక్తర్

జావేద్ అక్తర్, హనీ ఇరానీల కూతురైన జోయా న్యూయార్క్‌లో చదువుకున్నారు. మీరా నాయర్ లాంటి వాళ్ళ దగ్గర సహాయకురాలిగా పని చేసారు. ‘లక్ బై ఛాన్స్’, ‘జిందగీ న మిలేగీ దోబారా’, ‘బాంబే టాకీస్’, ‘గల్లీ బాయ్’ లాంటి సినిమాలు భిన్నంగా రూపొంది జోయా కి మంచి పేరు తెచ్చాయి.‘దిల్ ధడక్ నే దో’, ‘లాస్ట్ స్టోరీస్’ లాంటి సినిమాలు కూడా జోయా రూపొందించి ప్రతిభ కల దర్శకురాలిగా పేరు తెచ్చుకుంది. తను దర్శకత్వం వహించిన దాదాపు అన్ని సినిమాలకు జోయా రచనా బాధ్యతలు కూడా నిర్వహించారు.

నందితా దాస్

1969లో పుట్టిన నందితా దాస్ 40కి పైగా సినిమాల్లో నటించారు. దాదాపు అన్ని భారతీయ భాషల్లో నటించిన నందిత, దర్శకురాలిగా మొట్టమొదట 2008లో ‘ఫిరాఖ్’తో ఆరంభించింది. ఫిరాఖ్ గుజరాత్‌లో 2001 నాటి హింసాకాండ గురించి నిజాయితీగా తీసిన సినిమాగా నిలిచింది. అనేక వాస్తవ కథల్ని 24 గంటల సమయంలో పరస్పర సమన్వయంతో నిర్మించారీ సినిమాను. గత ఏడాది నందిత ‘మంటో’ సినిమా రూపొందించింది. సుప్రసిద్ధ రచయిత బియోపిక్‌గా రూపొందిన మంటో సినిమా దేశ విదేశాల్లో ప్రశంసలు అందుకుంది.

జీనత్ లఖాని

జీనత్ లఖాని దర్శకురాలిగా మొట్టమొదటి సినిమా 'షాదీ కే సైడ్ ఎఫ్ఫెక్ట్స్' విద్యా బాలన్, ఫర్హాన్ అక్తార్‌లు ప్రధాన భూమికల్ని పోషించారు. 2017లో జీనత్ లఖాని రచన బాధ్యతల్ని నిర్వహించిన సినిమా ‘హిందీ మీడియం’, ఇర్ఫాన్ ఖాన్, సబా ఖమర్‌లు ప్రధాన పాత్రల్ని పోషించారు. సామాజిక కోణం లోంచి వర్తమాన విద్యా వ్యవస్థను తూర్పార పట్టిన సినిమాగా హిందీ మీడియం నిలుస్తుంది.

అన్వితా దత్ గుప్తన్

అన్విత ప్రధానంగా సంభాషణలు, పాటల రచయిత్రిగా పేరెన్నికగన్నది. రచయిత్రిగా ఆమె రాసిన సినిమాలు ‘శాందార్’, ‘ఫైల్లౌరీ’లు రోడ్డ కొట్టుడు సినిమాలకు భిన్నమైన సినిమాలుగా నిలిచాయి.

కామ్నా చంద్ర

కామ్నా చంద్ర గతంలో పలు మంచి ప్రేమకథా చిత్రాలకు రచనలు చేసారు. ‘1942-లవ్ స్టోరీ’ లాంటి సినిమాలకు ఆమె రచన చేశారు. ఇటీవలి కాలంలో ఆమె రచన చేసిన సినిమా ‘ఖరీబ్ ఖరీబ్ సింగల్’.

ఇట్లా అనేక మంది మహిళా రచయిత్రులు భారతీయ సినిమాకు కొత్త దారులు చూపిస్తున్నారు. కొత్త దానాన్ని అద్ది సరికొత్త సినీ భాష్యాన్ని లిఖిస్తున్నారు. వారి కృషిలో నిర్మాణమైన సినిమాల్ని చూస్తే భారతీయ సినిమాకు ఇంకా సొంత గొంతుకతో పాటు సొంత స్టైల్ కూడా వుందని తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ మహిళా రచయిత్రులు, దర్శకుల్లో అధిక శాతం మంది 1970 లలో జన్మించిన వాళ్లే కావడం గమనించదగ్గ అంశం అంటే కొత్త తరం కొత్తగా ఆలోచిస్తోందని, సరికొత్త ఆవిష్కరణలకు దారులు వేస్తోందని, వీరు అవుట్ ఆఫ్ ద బాక్స్ సినిమాల్ని రూపొందిస్తారని విదితమవుతుంది.

వారాల ఆనంద్

94405 01281

Next Story

Most Viewed