మీకు తెలియకుండానే.. కిడ్నీలు పాడవుతున్నయ్!

by Ravi |   (  Updated:2026-03-12 01:00:46  IST  )

తెలంగాణలో కిడ్నీ వ్యాధులు జాతీయ సగటుతో పోలిస్తే ఎక్కువగా పెరుగుతున్నాయి. హైబీపీ, మధుమేహం, డీహైడ్రేషన్, జీవనశైలి మార్పులు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. కిడ్నీ సమస్యల లక్షణాలు, ప్రమాదాలు, ముందస్తు పరీక్షలు మరియు మూత్రపిండాల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుసుకోండి.

మీకు తెలియకుండానే.. కిడ్నీలు పాడవుతున్నయ్!
X

దేశంలో రాను రానూ కిడ్నీ సమస్యల బాధితులు పెరుగుతున్నారు. ప్రతి సంవత్సరం లక్షకు పైగా కొత్త మూత్రపిండ వైఫల్యాల కేసులు బయటపడుతున్నాయి. దేశంలోనే కిడ్నీ సమస్యల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది. దేశంలో సగటున 13 నుంచి 14 శాతం మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతుంటే.. తెలంగాణలో మాత్రం అది దాదాపు 17 శాతం. ఇది జాతీయ సగటు కన్నా చాలా ఎక్కువ.

కిడ్నీ వ్యాధికి కారణాలు..

కిడ్నీ సమస్యలకు ప్రధాన కారణాలు హైబీపీ, మధుమేహం కాగా.. తెలంగాణలో ఈ రెండు సమస్యలు ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్యశ్రీ, వైద్యారోగ్య శాఖల లెక్కలు వెల్లడిస్తున్నాయి.. రాష్ట్రంలో ఈ రెండు వ్యాధులతో బాధపడుతున్న వారు సుమారు 50 లక్షల మంది వరకు ఉన్నారని అంచనా. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, చక్కెర, ఉప్పు అధిక వినియోగం, ఊబకాయం వంటివి ఈ సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి. కిడ్నీ జబ్బులను సైలెంట్ కిల్లర్ అని అంటారు.. చాలా మందిలో సమస్య బయటపడే సమయానికే మూత్రపిండాలు 70-80 శాతం పాడైపోయి ఉంటున్నాయి. 30 ఏళ్ల లోపు వారిలో కూడా మధుమేహం, హైబీపీ వంటి సమస్యలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నొప్పి నివారణ మాత్రలు, గ్యాస్-ఎసిడిటీ మందులు, అశాస్త్రీయ వైద్య విధానాలను ఆశ్రయించడం (ఆయుర్వేదిక్, హోమియోపతి, అల్లోపతి ఇలా అన్ని రకాల మందుల్నీ కలిపి వాడటం వంటివి కూడా) కిడ్నీ సమస్యలను మరింత పెంచుతున్నాయి. జన్యుపరమైన లోపాల వల్ల కూడా కిడ్నీ జబ్బుల బారిన పడే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది.

అజ్ఞాత కారణాలతో కిడ్నీ వైఫల్యం!

మారుతున్న జీవనశైలి, షుగర్, హైబీపీలతో పాటు తెలంగాణలో అజ్ఞాత కారణాల వల్ల (CKDu) సమస్యలు ఎక్కువయ్యాయి.. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో తెలియని కారణాల వల్ల దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి చాలా మంది పేదల్ని పట్టి పీడిస్తోంది. ఇక్కడి ప్రతి ఐదుగురిలో ఒకరు కిడ్నీ వ్యాధి బాధితులే.. తెలంగాణలోని పలు జిల్లాల్లో భూగర్భ జలాల ప్రభావం, వ్యవసాయ రసాయనాల వాడకం వంటి కారణాలతో యువత ఎక్కువగా కిడ్నీ సమస్యలని ఎదుర్కొంటున్నారు..

డీహైడ్రేషన్‌తోనే అధిక ప్రమాదం..!

అధిక ఉష్ణోగ్రతల మధ్య వేడి వాతావరణంలో ఎక్కువ గంటలు పనిచేసే కార్మికులు రైతులు డీహైడ్రేషన్‌కి గురౌతారు. దాని వల్ల మూత్రపిండాలకు రక్త ప్రవాహం తగ్గి, దీర్ఘకాల నష్టం జరుగుతుంది. తగినంత నీరు తాగక‌పోవడం, ఉప్పు ఎక్కువగా వాడే జంక్ ఫుడ్ తినడం, నొప్పి నివారణ మందుల వాడకం కిడ్నీ సమస్యలకు కారణాలు.. పసర్లు, మూలికా వైద్యాలు మూత్రపిండాలకు హాని కలిగిస్తాయి. 40% మంది కిడ్నీ రోగులు అశాస్త్రీయ వైద్యవిధానాల్ని విశ్వసించి మందులు వాడినట్లు అధ్యయనాలు చూపిస్తున్నాయి. ఉద్దానం, నల్గొండ వంటి ప్రాంతాల్లో ప్రభుత్వాలు కిడ్నీ పరిశోధనా కేంద్రాలు, ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నాయి. కానీ లక్షణాలు కనిపించే సమయానికే వ్యాధి ముదిరిపోయి ప్రమాద స్థాయికి చేరుకుని వుంటుంది. సీరమ్ క్రియాటినిన్, రక్తపోటు మానిటరింగ్, యూరిన్ ఆల్బుమిన్ వంటి సాధారణ పరీక్షల ద్వారా తొలి దశలోనే సమస్యని గుర్తించగలం. రొటీన్ స్క్రీనింగ్ అనివార్య నష్టాన్ని నివారించడానికి కీలక పాత్ర పోషిస్తుంది.

మూత్రపిండాల సంరక్షణకు ఏం చేయాలి?

మూత్రపిండాల సమస్య లక్షణాలు కనిపించినప్పుడు మొదలవదు.. అంతకు ముందే మొదలవుతుందని ముందుగా గ్రహించాలి. మధుమేహం, హైపర్ టెన్షన్, కుటుంబ చరిత్ర వంటి రిస్క్ ఫ్యాక్టర్లను తెలుసుకోవాలి. రిస్క్ ఫ్యాక్టర్లు ఉంటే మూత్రపిండాల పనితీరు పరీక్షలు చేయించుకోండి. నొప్పి నివారణ మందులు, నియంత్రణ లేని సప్లిమెంట్లను దీర్ఘకాల వాడకాన్ని నివారించండి. శుభ్రమైన, సురక్షితమైన నీరు తాగండి. సమతుల ఆహారం తీసుకోండి. రోగ లక్షణాలు ముదిరిపోయే వరకు వేచి ఉండకుండా త్వరగా వైద్య సలహా తీసుకోండి. 30 ఏళ్లు దాటిన వారు ప్రతి సంవత్సరం కిడ్నీ పరీక్షలు (Serum Creatinine, Urinalysis) చేసుకోవాలి.

కిడ్నీలు కాపాడుకోవడం మన చేతుల్లోనే..

తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉష్ణ ప్రదేశాలు.. వేడి వాతావరణంలో మరీ ముఖ్యంగా బహిరంగ ప్రదే శాల్లో తీవ్రమైన ఉష్ణోగ్రతల మధ్య గనుల్లో కార్ఖానాల్లో పని చేసేవారు తగినంత నీరు తాగడం, ఉప్పు తగ్గించడం, సమతుల ఆహారం తీసుకోవడం అవసరం. సమస్య వచ్చిన తర్వాత డాక్టర్ల దగ్గరికి పరుగెత్తడం కంటే ముందు జాగ్రత్తలు పాటించడం మంచిది. డయాలిసిస్ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల వరకూ పోకుండా కిడ్నీలు కాపా డుకోవడం మన చేతుల్లోనే ఉంది.

(నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా)

-డాక్టర్ హిమ దీప్తి ఆళ్ళ

ఎం.డి. డి.ఎం.(నెఫ్రాలజీ)

[email protected]

Next Story