రాముడిని కాపాడిన రాజమౌళి..నిజమా?

by Ravi |   ( Updated:2023-05-06 02:49:18.0  )
రాముడిని కాపాడిన రాజమౌళి..నిజమా?
X

త సంవత్సరం ప్రారంభంలో విడుదలై బాక్సాఫీసును బద్దలుగొట్టిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాపై వచ్చిన వివాదాలు, భిన్నాభిప్రాయాలు ఇటీవలి కాలంలో మరే సినిమాకూ రాలేదని చెప్పవచ్చు. మగధీర, ఈగ, బాహుబలి వంటి చిన్న పిల్లలను ఆకట్టుకునే ఇతివృత్తాల ప్రాతిపదికన సినిమాలు తీస్తూ పెద్దలను కూడా అద్వితీయంగా ఆకట్టుకోవడంలో రాజమౌళిని మించిన దర్శకుడు లేడంటే అతిశయోక్తి కాకపోవచ్చు. తనది ఫక్తు కాల్పనిక గాథ అని చెబుతూనే అటు అల్లూరి సీతారామరాజును, ఇటు కొమురం భీమ్‌ని ప్రేరణగా తీసుకున్న ఆర్ఆర్ఆర్ దర్శకుడు చరిత్ర, జానపదం, సాంఘికం మూడూ కానీ విచిత్రమైన సినిమాను తీసి మెప్పించడంలో సాధించిన విజయం అద్వితీయమనే చెప్పాలి. తీసిన సినిమాను అమ్ముకోవడంలో, మార్కెట్ చేయడంలో రాజమౌళిని మించిన దర్శకుడు సమకాలీన భారత సినీ నిర్మాణ చరిత్రలో లేడనే చెప్పాలి. నాటు నాటు వంటి ఊర మాస్ సాంగ్‌ని ఆస్కార్ వరకు తీసుకుపోయి అక్కడ దానికి అవార్డు గెలుచుకురావడంలో రాజమౌళి ముద్రే కనిపిస్తుంది. ఏం సినిమా... ఇదేం సినిమా.. ఇదీ ఒక సినిమానేనా... వెండితెరను పులకింపజేసిన సినిమా అంటూ రాజమౌళి సినిమాలపై గత పదేళ్లకు పైగా అభిప్రాయాలు వస్తూనే ఉండటం తెలిసిందే..

ఆదే సమయంలో ఆర్ఆర్ఆర్ సినిమాపై మరొక భిన్నమైన అభిప్రాయం వెలుగులోకి వచ్చింది. ఎన్నడూలేని విధంగా భారతీయ పౌరాణిక, ఐతిహాసిక గాథలకు ఆధునిక చిత్ర రూపమిచ్చి సక్సెస్ బాట పట్టడం అనే పాఠాన్ని భారతీయ సినిమా ఇప్పుడు నేర్చుకుంటోంది. మహాభారతాలు, రామాయణాలు, జానపదాలకు ఇక కాలం చెల్లింది అనుకుంటున్న తరుణంలో రాజమౌళి మగధీర సినిమాతో భారతీయ సినిమాను మళ్లీ వెనక్కు మళ్లించాడని పేరు పొందాడు. భారతీయ సంస్కృతి అని చెప్పుకుంటున్న ఒక అమూర్త భావాన్ని ప్రమోట్ చేస్తూ ప్రస్తుతం రాజ్యమేలుతున్న పాలకులకు రాజమౌళి తీసిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ అమితానందం కలిగించాయనడంలో వాస్తవముంది. ఈ నేపథ్యంలో మోటు పద్ధతిలో సంస్కృతీ సంప్రదాయాలను రాజకీయ క్రీడలో భాగం చేసి ప్రయోజనం పొందుతున్న నేటి పాలకవర్గం నుంచి ప్రధానంగా సంఘీలనుంచి రాముడిని రాజమౌళి కాపాడాడని ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల సందర్భంగా కొందరు క్రిటిక్స్ ప్రశంసించడం కూడా విన్నాం. కానీ అది నిజమేనా అన్నది ప్రశ్న. సంఘీలనుంచి శ్రీరాముడిని రాజమౌళి కాపాడారని, హిందువులమని గర్వంగా చెప్పుకునే క్రమంలో ఒక నిర్దిష్ట మతాన్ని ద్వేషించే, దూషించే, ఒంటరిని చేసే రాజకీయాలకు భిన్నంగా రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలో సకల జనులు మెచ్చుకునే రీతిలో రామ్ పాత్రను మలిచాడని వీరంటున్నారు.

జాతీయవాదంతో హిందుత్వను ముడిపెట్టి ఆధునిక భారతజాతి నిర్మాణ ప్రాజెక్టును మోదీ ప్రభుత్వం పద్ధతి ప్రకారం తీసుకొస్తోందన్నది వాస్తవం. నిజమైన హిందుత్వ చరిత్రలో ఎన్నడూ ఒక మతాన్ని దాన్ని పాటించే ప్రజలను వ్యక్తిగత స్థాయిలో ఇంతగా ద్వేషించడం గతంలో ఎన్నడూ జరగలేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందరికీ షేర్ చేయడం, అందరూ మనుగడ సాధించే హక్కు, ఎవరూ ఎవరినీ ద్వేషించకుండా ఉండే బాధ్యత, ఇతరుల వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘించకూడని వర్తన వంటివి రాజ్యాంగం మనకు ప్రసాదించిన హక్కులు కాగా మెజారిటీకి లోబడి ఉంటేనే ఈ దేశంలో ఏమతానికైనా మనుగడ సాధించే హక్కు ఉంటుందని కొత్త సూత్రాలు చెబుతున్నారు. ఇలాంటి హిందుత్వ... భారతీయ మూలాలను కుళ్లపొడిచే హిందుత్వ మాత్రమే. ఈ నేపథ్యంలో రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ సినిమా విద్వేష రాజకీయాల జోలికి పోకుండా సకల వర్గాల ప్రజల ఆమోదం పొందేలా రాముడి పాత్రను మల్చడంలో సఫలమైందని కొందరు పాజిటివ్ విమర్శకులు అంటున్నారు.

ఆర్ఆర్ఆర్ రాముడు సాధించిన దిగ్భ్రాంతికరమైన ప్రజాకర్షణ వెండితెరపై కానీ, టీవీ షోల్లో కానీ ఇంతవరకు చూసి ఉండం. రాజమౌళి గ్రాఫిక్ రాముడు అగ్నిజ్వాలల నుంచి విల్లంబులతో కిందికి దుముకుతున్న దృశ్యం భారత్‌నే కాదు అమెరికాను, జపాన్‌ని, ఆఫ్రికా వాసులను కూడా మంత్రముగ్ధులను చేసింది. వలస పాలన సాగించిన అన్యాయాలకు మానుష ప్రయత్నమే కాదు.. దైవ ప్రయత్నం కూడా తోడైందనే భావనను ఆ దృశ్యం అద్భుతంగా, అద్వితీయంగా చూపించగలిగింది. అందుకే ఒక దృక్పథంలోంచి సాగే విమర్శలన్నింటినీ పక్కన పెట్టి ఆర్ఆర్ఆర్ రాముడు వివిధ ఖండాల ప్రజలను ఆకట్టుకున్నాడని చెప్పక తప్పదు. వలస పాలన దౌర్జన్యాలకు అడ్డు తగిలే పౌరాణిక పాత్రలో ఆర్ఆర్ఆర్ రాముడు దేశాన్నే కాదు, పశ్చిమదేశాలనే కాదు జపాన్ వంటి తూర్పు దేశాల వీక్షకులనే కాదు... ఆఫ్రికా ఖండ ప్రజలను కూడా మంత్రముగ్ధులను చేశాడని చెప్పక తప్పదు. కల్పన, వాస్తవం రెండింటి హద్దులను పూర్తిగా దాటేసిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినీమా ఆఫ్రికా ఖండం నుంచి విమర్శకుల ప్రశంసలకు నోచుకోవడం, యూరప్ వలస పాలనా దౌష్ట్యానికి గురై శతాబ్దాలు మగ్గిపోయిన ఆఫికన్ సగటు ప్రజానీకం ఆర్ఆర్ఆర్ సినిమాలో చూపించిన బ్రిటిష్ పాలనా పీడనను ఓన్ చేసుకుని తమ నేలపై యూరప్ సామ్రాజ్య పాలన చీకటి కోణాన్ని మళ్లీ గుర్తు చేసుకోవడాన్ని ఇలా కాక మరెలా అర్థం చేసుకోవాలి?

అందుకే భారత్ మాతాకు జై, జై శ్రీరామ్ వంటి బోలుమాటలతోనే రాజకీయం చేస్తూ సంస్కృతిని సంకుచిత ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్న పాలకవర్గ రాముడి స్థానంలో ఆర్ఆర్ఆర్ రాముడు విస్తృత ప్రజానీకం ఆమోదాన్ని పొందాడని చెప్పకతప్పదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆర్ఆర్ఆర్ హిందుత్వ ప్రజలను భయపెట్టదు. విద్వేష ప్రచారంతో, నిర్దిష్ట మత వ్యతిరేకతతో దూకుడుగా ముందుకొస్తున్న మిలిటెంట్ హిందుత్వకు ఆర్ఆర్ఆర్ రాముడు దూరం తొలిగాడు కాబట్టే, విస్తృత ప్రజానీకం ఆమోదాన్ని పొందగలిగాడు. రాముడిని రాజమౌళి సంఘీల నుంచి కాపాడాడని కొంతమంది చేసిన వ్యాఖ్యను ఈ నేపథ్యంలోనే అర్థం చేసుకోవలసి ఉంటుంది. రాజమౌళి చిత్రించిన హిందుత్వ మిలిటెంట్ హిందుత్వ కాదు. హింసను ప్రేరేపించే హిందుత్వ కాదు.. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఇద్దరు హీరోలు వందే మాతరం పతాకను చేతబట్టి ముందుకు నడిస్తే కోట్లాది ప్రేక్షకులు వివశులై హర్షధ్వానాలు చేశారు. ఆర్ఆర్ఆర్ రాముడు కూడా విద్వేషాన్ని ప్రేరేపించే ఉంటే ఆ పాత్ర ఈ స్థాయిలో జనం మెప్పును పొంది ఉండదు.

బీమ్ పాత్రధారి ముస్లింల పొరుగునే జీవించడం, ముస్లిం కుటుంబం ఆశ్రయం పొందడం, గోండు నాయకుడి లక్ష్య సాధనకు ఆ ముస్లిం ఫ్యామిలీ తమ ప్రాణాలనే పణంగా పెట్టడం, హిందూ ముస్లిం స్నేహబంధానికి ప్రతీకగా అక్తర్, రామ్ తెరపై కనిపించడం, (అమర్, అక్బర్, ఆంథోనీ సినిమా ఆరోజుల్లో ఎందుకంత విజయం పొందిందో చెప్పాల్సిన పనిలేదు) ముస్లిం పాత్రలతో కలిపి రామ్, అక్తర్ మాంసాహార భోజనం పంచుకోవడం, ఒకే పాత్రలో అందరూ కలిసి ఆరగించడం, దశాబ్దాలుగా దేశంలో కొనసాగుతున్న హిందూ, ముస్లిం సోదరబంధానికి విశాల ప్రాతిపదికన హిందూ సౌందర్య శాస్త్రం ఆర్ఆర్ఆర్‌ రూపంలో పట్టం కట్టింది కాబట్టే సినిమా అంత విజయం, ప్రజామోదాన్ని పొందగలిగింది. దేశ ప్రజల మనస్తత్వంలోకి రామ్ పాత్ర ఇంకిపోవడానికి బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా శ్రీరాముడు పోరాడటం ఒక్కటి చాలు కదా.

ఆర్ఆర్ఆర్ విడుదలైన కొద్దికాలానికే రాజమౌళి తండ్రి, ఆర్ఆర్ఆర్ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్‌కి కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం యాదృచ్ఛికం కాదు. అయినా సరే సంఘీలు కోరుకుంటున్న మిలిటెంట్ రాముడికి, మిలిటెంట్ హిందుత్వకి భిన్నంగా ఆ రాముడికే ప్రజామద్దతును సంపాదించి పెట్టిన రాజమౌళి సంఘీలనుంచి రాముడిని కాపాడాడంటే పాక్షికంగానైనా సరే సత్యం కాకపోదు.

- ప్రత్యూష

73496 94557

Also Read: పాశవికతకు అద్దంపట్టిన చిత్రం..

Advertisement

Next Story