తీర్పులు అనుకూలంగా లేకపోతే సుప్రీంనే బెదిరిస్తారా?

by Ravi |   (  Updated:2025-04-29 00:45:54  IST  )

ఇటీవల వక్ఫ్ సవరణ చట్టం 2025 విచారణ సందర్భంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల పట్ల కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

తీర్పులు అనుకూలంగా లేకపోతే సుప్రీంనే బెదిరిస్తారా?
X

ఇటీవల వక్ఫ్ సవరణ చట్టం 2025 విచారణ సందర్భంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల పట్ల కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం ధర్మాసనం వక్ఫ్ భూముల విషయంలో ఎవరి తరపున నిలుస్తోంది అన్న సందేహాన్ని బలంగా ప్రచారంలో పెడుతున్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై స్పందించే ముందు, న్యాయ వ్యవస్థ పాత్రను సరైన దృక్పథంతో విశ్లేషించడం అవసరం. వక్ఫ్ చట్టంపై కోర్టు చేసిన వ్యాఖ్యలు విచారణలో భాగంగా వచ్చిన ప్రశ్నలే కానీ, మత పక్షానికో, రాజకీయ పక్షానికో అనుకూలంగా ప్రతికూలంగా చేయబడినవి కావు. ఇది ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగం. తుది తీర్పు ఇంకా రావలసి ఉంది.

ఘటన స్థాయిని బట్టే స్పందన..

ఇటీవలే తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆక్షేపణలు ఇదే విషయాన్ని మరింత స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లులపై గవర్నర్ ఆలస్యంగా స్పందించడాన్ని కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఇది సూత్రాలకు కట్టుబడి న్యాయం చెప్పే కోర్టు ధోరణికి ఉదాహరణ. ఇక 'మణిపూర్ విషయంలో కోర్టు తీవ్రంగా స్పందించింది, కానీ పశ్చిమ బెంగాల్‌లో అటువంటి స్పందన ఎందుకు లేదు' అనే విమర్శలు చేస్తున్నారు. ఇక ఆయా రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలకు పరస్పరం పోలికే లేదు. మణిపూర్లో జరిగిన ఘోరం, మహిళలపై సామూహిక లైంగికదాడి, నగ్నంగా నడిరోడ్డుపై వదిలేయడం, సామాజిక అస్థిరత మధ్య సుదీర్ఘ కాలంగా కొనసాగిన అశాంతి – ఇవన్నీ మానవ హక్కుల ఉల్లంఘనకు అత్యంత దారుణ ఉదాహరణలు.. సుప్రీంకోర్టు స్పందన కూడా ఆ ఘాతుక స్థాయికి తగినట్టుగానే తీవ్రంగా వ్యక్తమైంది.

విశ్లేషణ అవసరం!

పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకున్న ఎన్నికల హింస, పోలీసు వ్యవస్థ వైఫల్యం వంటి అంశాలు కోర్టు విచారిస్తోంది. కానీ రెండింటికీ ఒకే స్థాయిలో, ఒకే తీరు స్పందించాలన్న తర్కం అర్ధరహితం. న్యాయవ్యవస్థ ప్రతి అంశాన్ని దాని దృఢత, స్థితిగతుల మేరకే పరిశీలిస్తుంది. ఎప్పుడూ ఒకే తీరుగా, ఒకే స్థాయిలో స్పందించదు. మణిపూర్ విషయంలో సుప్రీంకోర్టు స్పందించకపోతే, బాధిత మహిళలకు న్యాయం ఎక్కడి నుంచి లభిస్తుంది ఇది ఆలోచించాల్సిన విషయం కాదా! వక్ఫ్ సవరణ చట్టం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసి వ్యాఖ్యలను మతపరమైన కోణంలో చూస్తున్నారు. కానీ, అది భూయాజమాన్యం, హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ బాధ్యత వంటి ప్రాధాన్యత కలిగిన అంశాలకు సంబంధించిన చర్చ. ఈ నేపథ్యంలో కోర్టు ప్రశ్నలు చాలా సహజమైనవి. అవి మత వ్యతిరేకమైనవి కాదు.

సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో సమీక్షకు తావిస్తే తప్పు కాదు. కోర్టు తీర్పులను, వ్యాఖ్యలను నిందించే ముందు, వాటిలోని గంభీరతను, అవసరాన్ని గుర్తించాలి. విమర్శలకంటే విశ్లేషణ అవసరం అదే ప్రజాస్వామ్యాన్ని బలపరిచే మార్గం. న్యాయవ్యవస్థ ప్రశ్నకు అతీతం ఏంకాదు. విమర్శ ప్రజాస్వామ్య ఆరోగ్యానికి అవసరమే! అయితే అది వివేచనతో, విజ్ఞతతో ఉండాలి. లేకపోతే న్యాయం అన్న భావనే అపహాస్యం పాలయ్యే ప్రమాదం ఉంది.

- యండి. ఉస్మాన్ ఖాన్

99125 80645

Next Story