- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ బడ్జెట్ తెలంగాణను ఆదుకుంటుందా..?
ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశ పెట్టనున్న కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ ప్రభుత్వం ఎన్నడు లేనంతగా భారీ ఆశలు పెట్టుకుంది.

ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశ పెట్టనున్న కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ ప్రభుత్వం ఎన్నడు లేనంతగా భారీ ఆశలు పెట్టుకుంది. గత బడ్జెట్‌లో తెలంగాణకు తక్కువ కేటాయింపులు జరగడం, ఆ కేటాయింపులు కూడా కార్యరూపం దాల్చకపోవడంతో ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ నుంచి దాదాపు రూ.40,000 కోట్లు కేటాయించాలని, ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, రవాణా, పట్టణ అభివృద్ధి, నీటి నిర్వహణ, బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వంటి కీలక ప్రాజెక్టులకు ఈ సారైనా కేంద్ర సాయంతో పూర్తి చేయాలనే ఆలోచనలతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. మరి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సారైనా భారీ కేటాయింపులు చేయకపోతారా..? పన్నుల్లో వాటా, గ్రాంట్లు ఇవ్వకపోతారా? అని రాష్ట్ర ప్రభుత్వం గంపెడు ఆశతో ఎదురు చూస్తోంది.
పన్నుల వాటా...
రాష్ట్రాలకు కేంద్రం నిధులు జనాభా ప్రాతిపదికన నేరుగా ఇచ్చే పన్నుల్లో వాటాను 41 శాతంగా 15వ ఆర్థిక సంఘం ప్రతిపాదించినా బడ్జెట్లో కేవలం 32 శాతానికి మించి ఇవ్వడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని విమర్శిస్తున్నాయి. ప్రస్తుతం ఏడాదికి రూ.15 వేల కోట్లకు మించి రావడం లేదని అంటున్నారు. పూర్తి స్థాయిలో ఇస్తే మరో రూ. 10-15 వేల కోట్లు అధికంగా వస్తాయని రాష్ట్రం చెబుతోంది. గడిచిన మూడేళ్ల కాలంలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ వివరాలను చూస్తే.. 2022-23లో రూ.41,001.73 కోట్లు ఇస్తారని ఆశిస్తే అందులో 32.14 శాతం అంటే కేవలం రూ.13,179.21 కోట్లు, 2023-24లో రూ.41,259.17 కోట్లు ఇస్తారని అంచనా వేస్తే అందులో 23.58 శాతం అంటే రూ.9,729.91 కోట్లు మాత్రమే ఇచ్చారు. కేంద్ర ప్రాయోజిత పథకాలైన ఉపాధి హామీ, ఇళ్లు, స్మార్ట్ సిటీలు, రోడ్లు.. తదితరాల పద్దుల కింద కూడా ఆశించిన మేర నిధులు రాలేదు. వీటితో పాటు గత ఆరేళ్లుగా రాని వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు (బీఆర్ఎఫ్) రూ.1,800 కోట్లు, 2014-15లో కేంద్ర ప్రాయోజిత పథకాల బకాయిలు రూ.495 కోట్లు, ఉమ్మడి సంస్థల నిర్వహణకైన ఖర్చులో ఏపీ వాటా కింద రూ.408.49 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనలు..
ఈసారి బడ్జెట్‌లో రీజినల్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు, హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 విస్తరణకు, మూసీ నది పునరుద్ధరణ, పునరుజ్జీవనం ప్రాజెక్టుకు, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు, స్కిల్ యూనివర్సిటీల నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం కేంద్రం నుండి సహాయం కోరుతోంది. ఇక హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా నిధుల కోసం విజ్ఞప్తి చేస్తుంది. అలాగే రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ కేంద్ర నిధులు, సుందరీకరణ సమయంలో రుణాలు, గ్రాంట్లు కలిపి దాదాపు రూ. 6,347.07 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని తెలంగాణ కోరుతోంది. ఇక రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం హామీ ఇచ్చిన కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంట్ పరి శ్రమల కోసం కేంద్రం నిధులు కేటాయించాలని, అలాగే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం కింద తెలంగాణకు రావలసిన నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తుంది. రాష్ట్రానికి ఆర్థిక మద్దతు, రాయితీలు, ఎంఎస్‌ఎంఈలకు, టెక్స్‌టైల్, ఫార్మా రంగాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలని కోరుతుంది. అలాగే రైల్వే, ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి, కొత్త విమానాశ్రయాలు, రైల్వే కనెక్టివిటీ మెరుగుపరిచే ప్రాజెక్టులు.. సాంకేతిక విద్య, ఉపాధి, స్కిల్ డెవలప్‌మెంట్ హబ్‌లు, కొత్త ఐఐటీ, ఐఐఎం వంటి సంస్థలకు నిధులు, కొత్త నవోదయ, కేంద్ర విద్యాలయాల కోసం కేంద్ర నిధులను మంజూరు చేయాలని అభ్యర్థిస్తుంది.
సమైక్య స్ఫూర్తితో...
2025-26 కేంద్ర బడ్జెట్ పరిమాణం 10 శాతం పెరిగి రూ.55 లక్షల కోట్లకు చేరుకుంటుందనే అంచనాలున్నాయి. ఆ పెరుగుదల మేరకు అన్నీ రాష్ట్రాలకు కూడా సమాన స్థాయిలో కేటాయింపులు జరగాలని రాష్ట్ర ప్రభుత్వాలు కోరుకుంటున్నాయి. డివిడెండ్ కింద ఆర్‌బీఐ ఈసారి కేంద్రానికి రూ.2 లక్షల కోట్లు ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని, ఆ డివిడెండ్, సెస్సులు, అదనపు ఆదాయాన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు అండగా బదిలీ చేయాలని ఆర్థిక వేత్తలు, మేధావులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ప్రాణహిత లేదంటే పాలమూరు ప్రాజెక్టులో ఒక దానికి ఖచ్చితంగా జాతీయ హోదా ఇవ్వాలని కోరుతున్నారు. ఈ ఏడాది జీడీపీ తగ్గినందున ఆదాయ పన్ను పరిమితి పెంచాలని, ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గినందునే జీడీపీ తగ్గిపోతోందని ఆర్‌బీఐ కూడా ధ్రువీకరించిన నేపథ్యంలో ప్రజల కొనుగోలు శక్తి పెరగాలంటే అసంఘటిత రంగంలోని కార్మకుల వేతనాలను పెంచాలని అటు ప్రభుత్వం ఇటు కార్పొరేట్ వర్గాల నుంచి వినిపిస్తోంది. కేవలం రాయితీలకే పరిమితం కాకుండా ప్రజల నిజమైన ఆదాయం పెరిగే విధంగా కేంద్రం బడ్జెట్ ప్రతిపాదనలకు రూపకల్పనలు చేస్తూ.. రాష్ట్రాల అభివృద్ధి సమష్టి బాధ్యతగా సమైక్య రాష్ట్రాల స్ఫూర్తితో కేటాయింపులు చేసినప్పుడే దేశం అసలు సిసలైన అభివృద్ధి చెందుతుందన్న నగ్న సత్యాన్ని గ్రహించి ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
- డాక్టర్. బి. కేశవులు. ఎండి. సైకియాట్రీ,
85010 61659






