కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాలకు ఆశాజనకమయ్యేనా!

by Ravi |   (  Updated:2025-01-31 01:15:48  IST  )

కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాలకు ఆశాజనకమయ్యేనా!
X

బడ్జెట్ ప్రక్రియ ప్రారంభం కాగానే ప్రజా జీవనం మీద ప్రభావం వెయ్యగల ఆర్థిక వార్తలు గతంలో హోరెత్తేవి. ఈ మధ్యకాలంలో దీనికి అంత ప్రాధాన్యత లేదు. అందుకు కారణం ప్రసారాల సాధనాలు, మీడియా రంగంపై పాలక వర్గాల వ్యూహాత్మక ఒత్తిడే. పేద, మధ్యతరగతి ప్రజలను ఆశల పల్లకిలో ఊరేగిస్తూ తర్వాత వారిని ముంచడానికి పాలకులు ఆర్థిక శాస్త్ర పదజాలాన్ని అడ్డం పెట్టుకోవడం పరిపాటి అయింది. ఈ నేపథ్యంలో 2025-26 కేంద్ర బడ్జెట్ రేపు రాబోతుంది. కాగా దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఇటీవలి కాలంలో అంచనాలకు మించి క్షీణించింది. ద్రవ్యోల్బణం అగ్రస్థానంలో కొనసాగుతుంది. భారత కరెన్సీ ఒక డాలర్ కావాలంటే 86 రూపాయలకు పైగా చెల్లించే కనిష్ట స్థాయికి పతనమైంది. గ్రామీణ ప్రాంతాల్లో దారిద్య్రం తీవ్ర స్థాయిలో ఉంది. వీటన్నింటికి తోడు ఎంఎస్ఎంఈ రంగంలో సంక్షోభం నెలకొంది. ప్రజల ఆదాయాల్లో, సంపదలో వ్యత్యాసాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి.

ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.4 శాతానికే పరిమితమవుతుందన్న ప్రభుత్వ ముందస్తు అంచనాలు ఆర్థిక మందగమనాన్ని సూచిస్తున్నాయి. ఇవి గతంలో భారత రిజర్వు బ్యాంకు వేసిన వృద్ధి అంచనాల (6.6శాతం) కంటే తక్కువగా ఉండటం, అనేక అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు సహితం జీడీపీ వృద్ధిరేటును ఆరు శాతానికే పరిమితం చేయడం ఆందోళన కలిగిస్తోంది. పాలకులు దార్శ నికతతో జీడీపీ వృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేయడంతో పాటు దేశీయ వినియోగాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టాలి. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు దోహదం చేసేలా బడ్జెట్ రూపకల్పన జరగాలి. అత్యంత ప్రధానమైన వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేటాయింపులు పెంచాలి. విద్య, వైద్య రంగాలకు జీడీపీలో తగు మోతాదులో కేటాయింపులుండాలి. ద్రవ్యోల్బణం దెబ్బకు విలవిల్లాడుతున్న మధ్యతరగతి ప్రజానీకానికి కొంత ఉపశమనాన్ని కల్పించే దిశగా అడుగులు పడాలి. స్థూలంగా వృద్ధికి ఊతమిచ్చే కీలక ప్రతిపాదనలతో బడ్జెట్ రూపొందాల్సిన అవసరముంది.

కొనుగోలు శక్తి పెరగాలి!

దేశంలో జీడీపీ పెరగాలంటే వినియోగం పెరగాలి. వినియోగం పెరగాలంటే ప్రజలలో కొనుగోలు శక్తి పెరగాలి. అందుకు వారి చేతుల్లో డబ్బులుండాలి. గతేడాది పట్టణ వినియోగం తగ్గడం వల్ల దాని ప్రభావం జీడీపీపై పడింది. పట్టణ వినియోగాన్ని పెంచేందుకు తక్షణ చర్యలు చేపట్టాలి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగు పరచి, జీతభత్యాల పెంపునకు దోహదపడే విధాన రచన అత్యావశ్యకం. కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా మౌలిక వసతుల కల్పనపై భారీగా ఖర్చు చేయాలి. ప్రభుత్వం మూలధనపు వ్యయంపై నిధులు వెచ్చిస్తే సిమెంట్, స్టీల్, నిర్మాణ యంత్రాలకు డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు ఫ్యాక్టరీల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. ఫలితంగా అవి మరిన్ని పెట్టుబడులు పెడతాయి. తయారీ, నిర్మాణ రంగంలో ఉద్యోగాల కల్పన జరుగుతుంది.

పన్ను మినహాయింపు పరిమితి పెంచాలి!

దేశంలో కొనసాగుతున్న ఆదాయపు పన్ను విధానాన్ని హేతుబద్ధం చేయాలి. దేశాభివృద్ధికి పాలకవర్గాల విధానాలతో పాటు పన్నుల రాబడి కూడా అంతే ముఖ్యం. కనుక వేతన జీవుల నుండి, నెలసరి నియమిత ఆదాయ వర్గాల నుండి ముక్కు పిండి వసూలు చేసే పన్నుతో మాత్రమే అది సాధ్యం కాదు. సంపన్న వర్గాల నుండి సరైన పన్ను రాబట్టుకునే విధంగా చర్యలు ఉండాలి. దేశంలో 140 కోట్ల జనాభా ఉండగా, ఆదాయపు పన్ను చెల్లింపుదారుల శాతం దాదాపు 6-7% మాత్రమే. ఈ గణాంకాల ప్రకారం, సుమారు 8 నుండి 9 కోట్ల మంది మాత్రమే ఆదాయపు పన్ను ఫైలింగ్ చేస్తుంటారు. అయితే, ఫైలింగ్ చేసిన వారందరిలోనూ ఆదాయపు పన్ను చెల్లించే వారి సంఖ్య మరింత తక్కువగా ఉంటుంది. కనుక పన్ను వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సి ఉంది. ఈ క్రమంలో బడ్జెట్‌లో ఆదాయపు పన్ను శ్లాబులను కుదించి ఆదాయ పన్ను భారాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. 10 -15 లక్షల మధ్య ఆదాయం పై పన్ను భారాన్ని 15 శాతానికి తగ్గించాలి. దీనివల్ల పన్ను చెల్లింపులు పెరగడంతో పాటు ప్రజల వద్ద ఆదాయాల్లో కొంత మిగులు ఏర్పడి ఆ మేరకు కొనుగోలు శక్తి పెరుగుతుంది.

వ్యవసాయ కేటాయింపులు పెంచాలి

భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో వ్యవ సాయం వాటా 15 శాతమే. అయితే మొత్తం ఉపాధిలో 45 శాతాన్ని వ్యవసాయ రంగమే కల్పిస్తుంది. గడిచిన ఐదేళ్లలో స్థిర ధరల దగ్గర ఈ రంగం ఏటా 4.18 శాతం వృద్ధి రేటు నమోదు చేసినప్పటికీ రైతుల పరిస్థితి దుర్భరంగా ఉంది. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుంది. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఉపాధి కల్పనకు కేటాయింపులు పెంచాలి. వ్యవసాయ రంగానికి మరింత రుణ సాయం అవసరం కాబట్టి వచ్చే బడ్జెట్లో రుణ లక్ష్యాన్ని రూ.32 లక్షల కోట్లకు పెంచాలి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం సుదూర స్వప్నంగానే మిగిలిపోయింది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు వివిధ పంటలకు కనీస మద్దతు ధర ప్రకటిస్తున్నా, వాస్తవంగా రైతులకు అవసరమైన మద్దతు లభించడం లేదు. అందుకే వ్యవసాయ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించడంతో పాటు మరిన్ని పంటలకు కనీస మద్దతు ధరలను ప్రకటించాలి. కిసాన్ క్రెడిట్ కార్డులపై ప్రస్తుతమున్న రూ.3 లక్షల రుణ పరిమితిని రూ.5 లక్షలకు పెంచడం గురించీ ఈ బడ్జెట్‌లోనైనా ఆలోచించాలి. ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ పథకం కింద అందిస్తున్న ఆర్థిక సాయాన్ని పెంచేందుకు ప్రయత్నించాలి.

ఎంఎస్ఎంఈలను ఆదుకోవాలి

దేశంలో దాదాపు 12 కోట్ల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తూ జీడీపీలో 33 శాతానికి పైగా వాటా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) సకాలంలో ఆర్థిక సాయం అందక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. వీటికి రావాల్సిన బకా యిలు పేరుకుపోయాయి. ఈ సంస్థలను ఆదుకునేందుకు పీఎల్ఐ పథకాన్ని మరింత విస్తృ తంగా వర్తింపజేయాలి. వాటి ఎగుమతులపై మరిన్ని ప్రోత్సాహకాలు కల్పించాలి.

పర్యావరణ పరిరక్షణకు చర్యలుండాలి

ప్రపంచ దేశాలను తీవ్రంగా కలిచివేసే సమస్యల్లో పేదరికం తర్వాత పర్యావరణమే ఎక్కువ. పర్యావరణ పరిరక్షణకు భారతదేశం ఆశిస్తున్నట్లు 2030 నాటికీ 50 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజెన్ తయారు చేయాలంటే పునరుత్పాదక ఇంధన వనరుల సాయంతో 100 -125 గిగా టన్నుల విద్యుత్ ఉత్పాదన సామర్ధ్యాన్ని అదనంగా సమకూర్చుకోవాలి. విద్యుద్విశ్లేషణ సాధనాలు, ఇతర ఉపకరణాలను దిగుమతి చేసుకోవడం కాకుండా స్వదేశంలోనే తయారుచేసుకోవాలి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే ఎనిమిదో బడ్జెట్లోనైనా కీలక అంశాలపై దృష్టి పెట్టాలి. పాలక వర్గాలు కార్పొరేట్ల పల్లకి మోసే బోయలుగా కావడానికి బదులుగా ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రజలను ఆశల పల్లకిలో కాక అభివృద్ధి మేనాలో ఊరేగించాల్సి ఉంది.

- డా. ఏ. పున్నయ్య,

విభాగాధిపతి, అర్థశాస్త్ర విభాగం,

తెలంగాణ విశ్వవిద్యాలయం.

99480 17934

Next Story