స్థానిక ఎన్నికల్లో.. బీసీ రిజర్వేషన్ అమలు పరుస్తుందా?

by Ravi |   (  Updated:2025-06-06 01:15:44  IST  )

భారతదేశంలో మెజార్టీలుగా ఉన్న బీసీలకు.. 78 సంవత్సరాల స్వతంత్ర భారతంలో జనగణనతో పాటు కులగణన చేస్తామన్న

స్థానిక ఎన్నికల్లో.. బీసీ రిజర్వేషన్ అమలు పరుస్తుందా?
X

భారతదేశంలో మెజార్టీలుగా ఉన్న బీసీలకు.. 78 సంవత్సరాల స్వతంత్ర భారతంలో జనగణనతో పాటు కులగణన చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని చూసి ఎన్నో ఏండ్ల కల నెరవేరుతోందని ఆనందపడాలో? తెలంగాణ రాష్ట్రంలో వడ్డించిన విస్తరిలా ముందున్న 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు గ్రహణం పడుతుందని ఆందోళన చెందాలో? అర్థం కావడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో వారిలో ఒక పక్క ఆనందం.. మరో పక్క ఆందోళన ఉంది.

తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన రెండు బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం లభించింది. ఈ బిల్లు ద్వారా విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 % రిజర్వేషన్‌ కల్పించేందుకు అవకాశం ఉంటుంది. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్‌ కల్పించే బిల్లును సైతం అసెంబ్లీ ఆమోదం తెలిపి పార్లమెంట్‌కు పంపింది.

కేంద్ర ప్రభుత్వం ప్రకటనతో..

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కాబోతున్నాయని గ్రామీణ పట్టణ స్థానిక సంస్థల స్థాయి బీసీ నాయకులు ఆశల పల్లకిలో ఊగుతున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎన్నో ఏండ్లుగా బీసీలు డిమాండ్ చేస్తున్నందుకుగానూ జన గణనలో కులగణన చేస్తామని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రకటన వల్ల ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలవుతాయా? జనగణనలో కులగణన పూర్తయ్యే వరకు బీసీలు 42 శాతం రిజర్వేషన్ల కోసం ఆగాల్సిందేనా? అనేది అర్థం కావడం లేదు. కేంద్ర ప్రభుత్వం జనగణనలో కుల గణన పూర్తయ్యే రాష్ట్రం పంపిన ఆ బిల్లును ఆమోదించకపోతే 42 శాతం బీసీ రిజర్వేషన్లకు గ్రహణం పతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నలుగా ముందున్నాయి.

రిజర్వేషన్ తగ్గించడంతో..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ రాజ్ చట్టం 1994 ప్రకారం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. కానీ 2019లో ఎస్సీ, ఎస్టీలకు స్థానిక సంస్థలలో ఇచ్చే రిజర్వేషన్లను 16 శాతం నుండి 27.21 శాతానికి పెంచింది. అ సమయంలోనే హైకోర్టు వెంటనే స్థానిక సంస్థలకు ఎన్నికలు పెట్టాలని ఆదేశించడంతో అప్పటి ప్రభుత్వం ఆఘమేఘాల మీద ఆర్డినెన్స్ జారీ చేసి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదనే సాకుతో బీసీల రిజర్వేషన్లు 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గించి ఎన్నికలు జరిపింది. దీంతో బీసీలు మూడు నాలుగు జడ్పీ చైర్మన్, ఐదు ఆరు మునిసిపాలిటీ చైర్మన్ రిజర్వ్ స్థానాలు, పదుల సంఖ్యలో జడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వ్ స్థానాలు, వందల సంఖ్యలో ఎంపీటీసీ, సర్పంచ్, కౌన్సిలర్ రిజర్వ్ స్థానాలు, వేల సంఖ్యలో వార్డ్ మెంబర్ రిజర్వ్ స్థానాలు కోల్పోయారు.

2018 చట్ట ప్రకారం ఎన్నికలు జరిపితే..

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చట్ట ప్రకారం కుల గణన పూర్తిచేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఖరారు చేస్తూ బిల్లులు ఆమోదించి కేంద్రానికి పంపింది. పార్లమెంటు ఈ బిల్లులను ఆమోదించి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చినట్లయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు అయ్యేవి. కానీ కులగణన డిమాండ్ దేశవ్యాప్తంగా ఎక్కువ అవుతుండటంతో జనగణనలో కులగణన చేపడతామని కేంద్రం ప్రకటించడంతో తెలంగాణ రాష్ట్ర శాసనసభ పంపిన బిల్లును అంగీకరించడం దాదాపు అసాధ్యమేనని అంటున్నారు విశ్లేషకులు.. కేంద్రం ఆ బిల్లులను ఆమోదించకపోవడం అదే సమయంలో స్థానిక సంస్థల కాలం పూర్తయి చాలాకాలం కావస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు ప్రస్తుత చట్టం ప్రకారం పెట్టాలా? లేదా కొత్త చట్టాన్ని తీసుకురావాలా? అనే సంశయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుత పంచాయతీ రాజ్ 2018 చట్టం ప్రకారం బీసీలకు 22 శాతం రిజర్వేషన్‌తో ఎన్నికలు నిర్వహిస్తే బీసీలు ఆయా పదవులు నష్టపోవాల్సి వస్తుంది.

రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లాల్సిందే..

అందుకే కులగణన చేసిన ఘనత గల రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ప్రస్తుత పద్ధతి ప్రకారం ఎన్నికలకు వెళ్లరాదు. శాసనసభ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును ఆమోదించి పార్లమెంటుకు పంపింది కాబట్టి 42% బీసీ రిజర్వేషన్లతో కూడిన ఆర్డినెన్స్ జారీచేసి ఎన్నికలు నిర్వహిస్తే అటు బీసీలకు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయోజనం చేకూరుతుంది. ఎవరైనా కోర్టుకు వెళ్లినా రాజ్యాంగబద్ధంగా ప్రక్రియ నిర్వహించారు కాబట్టి కోర్టులు 42 శాతం రిజర్వేషన్లను ఆమోదించవచ్చు. ఒకవేళ ఆమోదించకపోయినా అది ప్రజల ముందు ప్రశ్నగా నిలుస్తుంది. బీసీల 42 శాతం రిజర్వేషన్లు అమలు కాకపోవడానికి కారకులు ఎవరో ప్రజలే నిర్ణయించుకుంటారు. ప్రజా క్షేత్రంలో వారికి తగిన గుణపాఠం నేర్పుతారు. ఏదేమైనా చాలా కాలంగా ఉన్న జనగణనలో కులగణన డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం అంగీకరించినప్పటికీ క్రెడిట్ అంతా తెలం గాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుంది. ప్రస్తుతం 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తే ఆ క్రెడిట్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుంది. ఒకవేళ 42% బీసీ రిజర్వేషన్లు అమలు కాకుంటే చిత్తశుద్ధి గల రాజకీయ పార్టీలు బీసీలకు 42 శాతం స్థానాలు కేటాయించాలి. లేదంటే బీసీ సమాజం ముందు ఆయా పార్టీలు దోషులుగా నిలబడాల్సి వస్తుంది.

జుర్రు నారాయణ యాదవ్,

సామాజిక విశ్లేషకులు

94940 19270

Next Story