తమిళ "వన్నార్" పదం తొలగిస్తారా?

by Ravi |   (  Updated:2025-01-19 01:00:32  IST  )

నూన్యత భావాన్ని అనుభవిస్తున్న కొన్ని కులాల పేర్లను మార్చేందుకు తెలంగాణ బీసీ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది.

తమిళ వన్నార్ పదం తొలగిస్తారా?
X

నూన్యత భావాన్ని అనుభవిస్తున్న కొన్ని కులాల పేర్లను మార్చేందుకు తెలంగాణ బీసీ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. బీసీ (ఎ) గ్రూపులోని రజక / చాకలి/వన్నార్ సమూహంలో తమిళ పదమైన "వన్నార్" తొలగించి, హిందీ పదమైన "ధోభీ"ని చేర్చాలనే ప్రతిపాదన బీసీ కమిషన్ ముందుంది. కొందరు ఏకపక్షంగా "వన్నార్" పదాన్ని తొలగించాలని కమిషన్‌కు లేఖ రాయటం, కమిషన్ వారి లేఖలకు స్పందించడంతో రజకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

రజకులు సంచార కులస్తులు.. సంచార కులస్తుల ఉనికి అన్ని ప్రాంతాల్లో ఉంటుందనే సత్యం తెలిసి కూడా, "వన్నార్" పదాన్ని తొలగించాలని కోరటం సహేతుకం కాదు. వందల ఏళ్లుగా నిజాం గడ్డమీద నివాసం ఉంటూ, 68 ఏళ్లుగా తెలంగాణ ప్రాంత బీసీ జాబితాలో అధికారికంగా ఉన్న "వన్నార్" కులం పేరును తొలగించడం ప్రాంతీయ విద్వేషాలకు అవకాశం కల్పించినట్టే. "వన్నార్" పదాన్ని తొలగిస్తే, తెలంగాణలో ఉన్న తమిళుల పక్షాన తమిళనాడు ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడే పరిస్థితి కచ్చితంగా వస్తుంది. తమిళులకు నష్టం జరుగుతుంటే తమిళనాడు ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు కదా! అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరమే మేలు.. "వన్నార్" పదాన్ని తొలగించే ప్రతిపాదనను బీసీ కమిషన్ తిరస్కరించాలి. "వన్నార్" తొలగించాలని కోరటం తమిళ రజకుల హక్కును హరించడమే. రజక కులానికి సంబంధించిన అన్ని పర్యాయపదాలను, సమానార్థక పదాలను చేర్చటం... తెలంగాణలో నివసిం చే సరిహద్దు రాష్ట్రాల రజకుల పట్ల సమ న్యాయం పాటించటమేనని బీసీ కమిషన్ గుర్తించాలి.

బట్టలు ఉతకటం ప్రపంచంలో ఒక వృత్తి. కానీ ఆసియా ఖండంలో ఇది ఒక కులానికి సంబంధించిన వెట్టి చాకిరీ. బట్టలుతికే వ్యక్తిని ఇంగ్లీషులో "వాషర్ మెన్" అని, 3వ భాష హిందీలో "ధోభీ" అని పిలుస్తారు. రజకుల్ని దేశంలోని భాషా ప్రాయోజిత రాష్ట్రాల్లో, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో పిలుస్తున్నారు. ఇక్కడ బాధాకరమైన అంశం ఏమిటంటే, వృత్తి పేరూ (చాకలి), కులం పేరూ (చాకలి) రెండూ ఒకటే కావటం. చాలా మందికి తెలిసే ఉంటుంది. "చాకలి బట్టలు ఉతుకును" అనే అర్థాన్ని పాఠ్య పుస్తకాల ద్వారా తరతరాలుగా ప్రజల మెదళ్లలోకి ఎక్కించారు. ఫలితంగా వృత్తి చేసే వ్యక్తిని కులం పేరుతో వాడుకగా పిలిచే చాకలీ, చాకలోడు, చాకలిది అనే పిలుపు వల్ల, ఆ కులంలో ఇతర వృత్తులు చేసేవారు అవమానాలాకు, నూన్యతకు గురైన సందర్భాల్లోంచి "చాకలి" కులం పేరు మార్చాలనే డిమాండ్ ముందుకొచ్చింది.

కులం పేరు మార్చాలంటూ తొలి డిమాండ్

ఈ దేశానికి స్వతంత్రం వచ్చాక తమ కులం పేరు మార్చాలని మొట్టమొదటగా ప్రభుత్వం తలుపు తట్టింది "చాకలి" కులస్తులే. ఈ క్రమంలో 1948 లోనే "చాకలి" కులాన్ని "రజక" కులంగా మారుస్తూ మద్రాస్ ప్రభుత్వం గెజిట్ చేసింది. ఈ క్రమంలో వృత్తి పేరు - కులం పేరు ఒకటిగా ఉండే కులాలు, తమ కులాల పేర్లను మార్చాలని ప్రభుత్వాలకు మొర పెట్టుకున్నాయి. తదనంతర కాలంలో మంగలిని - నాయి బ్రాహ్మణగా, కుమ్మరిని - శాలివాహనగా, కళావంతులును - సూర్య బలిజగా ప్రభుత్వం మార్పులు చేసింది. ఇప్పుడు కొందరు "వన్నార్" పదాన్ని తొలగించి, 'ధోభీ' పదాన్ని చేర్చాలని ఏకపక్షంగా కమిషన్‌ని కోరటం, ఇంకొందరు "ధోభీ" పదాన్ని వ్యతిరేకించడం ఆవేదన కలిగిస్తోంది. వారు వ్యక్తీకరిస్తున్న అభిప్రాయాలు, వ్యతిరేకించడానికి వారు చూపుతున్న కారణాలు హేతుబద్ధంగా లేవు.

ఇస్లాం ధోభీ, హిందూ ధోభీ ఒకటేనా?

"ధోభీ" పదాన్ని చేర్చొద్దని అభ్యంతరం చెప్పేవారు ప్రధానంగా ఇస్లాం మతం ఆచరించే బీసీ ఈ గ్రూపులో "ధోభీ" పేరుతో ఒక కులం ఉందని కమిషన్ దృష్టికి తీసుకువస్తున్నారు. బీసీ ఏ గ్రూపులో ఉన్న రజకులు హిందూ మతాన్ని ఆచరిస్తారని, బీసీ (ఎ) గ్రూపులో "ధోభీ" పదం చేరిస్తే, బీసీ (ఈ) గ్రూపులో ఉన్న ముస్లిం "ధోభీ" కులస్తులు, బీసీ (ఎ) గ్రూపులోని "ధోభీ"గా క్యాస్ట్ సర్టిఫికేట్లు తీసుకొని లబ్ధి పొందుతారనీ, తద్వారా బీసీ (ఎ) గ్రూపులోని రజకులు నష్టపోతారని అనుమానం వ్యక్తం చేశారు. నిజానికి బీసీ (ఎ) గ్రూపులో ఉన్నది 68 కులాలు, బీసీ (ఈ) గ్రూపులో ఉన్నది కేవలం 14 కులాలు.. బీసీ (ఎ) గ్రూపుకు 7 శాతం రిజర్వేషన్ ఉండగా, బీసీ (ఈ) రిజర్వేషన్ 4 శాతం. బీసీ ఏ కులాల మధ్య ఉన్న కాంపిటీషన్ బీసీ (ఈ) గ్రూపులో లేదు. బీసీ(ఈ) గ్రూపులో "ధోభీ" కులానికి బీసీ ఏ ద్వారా లబ్ధి పొందాల్సిన అవసరం ఎప్పటికీ రాదు.

యూపీ మార్గం అనుసరణీయం!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హిందూ మతం ఆచరించే "ధోభీ" కులం షెడ్యూల్డ్ కులాల జాబితాలో ఉంది. ఇస్లాం మతం ఆచరించే "ధోభీ" కులం బీసీ కులాల జాబితాలో ఉంది. "ధోభీ" కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చే క్రమంలో, జాతీయ బీసీ కమిషన్ కూడా ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. "ధోభీ" షెడ్యూల్డ్ కులాల జాబితాలో ఉండటంతో, ఓబీసీ జాబితాలో "ధోభీ" కులాన్ని చేర్చేందుకు జాతీయ బీసీ కమిషన్ అంగీకరిస్తూ, "ధోభీ" పదం పక్కన బ్రాకెట్లో ఎస్సీ జాబితాలో లేని వారు అని స్పష్టంగా పేర్కొనాలని సూచించింది. జాతీయ బీసీ కమిషన్ చెప్పినట్టుగా ఉత్తర ప్రదేశ్ ఓబీసీ లిస్టులో ఉంటుంది.

రజకులపై గౌరవం చూపాలి!

తెలంగాణ బీసీ కమిషన్ రజక పర్యాయపదంగా "ధోభీ" పదాన్ని చేర్చేందుకు సిఫార్సు చేస్తే, బీసీ (ఎ) గ్రూపులో చేర్చే "ధోభీ" పదం పక్కన (Hindu Traditions) అని రాస్తే సరిపోతుంది. హిందూ ధోభీ కులస్తుల పేర్లకు, ఇస్లాం ధోభీ కులస్తుల పేర్లకు పోలికే ఉండదు. సులువుగా తేడా తెలుస్తుంది. అధికారులకు కూడా క్యాస్ట్ సర్టిఫికెట్ జారీ చేసేందుకు ఎలాంటి సమస్యలూ తలెత్తవు. బీసీ కమిషన్ తెలంగాణ బీసీ జాబితాలో రజక/చాకలి పర్యాయ పదంగా వన్నార్ ను కొనసాగించడంతో పాటు, తెలంగాణకు సమీప రాష్ట్రాలలో రజకులను పిలిచే పరీత్ (మహారాష్ట్ర), మడివాల (కర్ణాటక), వన్నార్ (తమిళనాడు, కేరళ), ధోభీ (ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర), పదాలను కూడా చేర్చటం తెలంగాణలో నివసిస్తున్న సరిహద్దు రాష్ట్రాల రజకుల పట్ల ప్రభుత్వం గౌరవం చూపినట్టవుతుంది.

పొటికలపూడి జయరామ్

రాష్ట్ర అధ్యక్షులు, ఏపీ రజక రిజర్వేషన్ పోరాట సమితి

95151 84699

Next Story