గ్రూప్-1 మెయిన్స్ పేపర్లను రీవాల్యుయేషన్ చేస్తారా.. పరీక్ష పెడతారా?

by Ravi |   (  Updated:2025-09-12 01:00:31  IST  )

తెలంగాణ హైకోర్టు గతంలో ప్రకటించిన గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలు రద్దు చేసింది. మళ్లీ మెయిన్స్‌ పేపర్లను రీవాల్యుయేషన్‌ చేసి వీటి

గ్రూప్-1 మెయిన్స్ పేపర్లను రీవాల్యుయేషన్ చేస్తారా.. పరీక్ష పెడతారా?
X

తెలంగాణ హైకోర్టు గతంలో ప్రకటించిన గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలు రద్దు చేసింది. మళ్లీ మెయిన్స్‌ పేపర్లను రీవాల్యుయేషన్‌ చేసి వీటి ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని, ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే పరీక్షలు మళ్లీ నిర్వహించాలని టీజీపీఎస్సీను హైకోర్టు ఆదేశించింది. ఇందుకు కోర్టు టీజీపీఎస్సీకి 8 నెలల గడుపును విధించింది. ఈ తీర్పు గ్రూప్- 1లో జరిగిన అవకతవకలను బలపరిచింది.

గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం అభ్యర్థుల వాదనలతో ఏకీభవించి తీర్పు వెల్లడించింది. మరి ఇప్పటికైనా ప్రతిభ గల విద్యార్థులకు న్యాయం జరుగుతుందా? లేదా అనేది వేచి చూడాలి. ఈ తీర్పు ప్రభావం భవిష్యత్ నియామకాలపై కూడా పడనుంది.

90 శాతం మంది వారే..

గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షను.. 2024 అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు నిర్వహించారు. దాదాపు 21,000 పైచిలుకు అభ్యర్థులు ఈ పరీక్ష రాసారు. ఇందులో 12,000 మంది అంటే 60 శాతం ఇంగ్లీష్‌లో ఎగ్జామ్ రాసారు. ఎంపికైన వారిలో 90 శాతం ఆంగ్లంలో రాసిన విద్యార్థులే ఉన్నారు. తెలుగు మీడియంలో 8,000 మంది విద్యార్థులు అంటే 40 శాతం విద్యార్థులు పరీక్ష రాస్తే, కేవలం 10 శాతంలోపే సెలెక్ట్ అయ్యారు. ఇక్కడ భాషా పరమైన వ్యత్యాసం స్పష్టంగా కనబడుతుంది. ఉర్దూ మీడి యంలో 9 మంది ఎగ్జామ్ రాసారు. వారిలో ఒకరు సెలెక్ట్ అయ్యారు. ఈ గ్రూప్- 1 ఫలితాలను గమనిస్తే తెలుగు మీడియం వాళ్లు చాలా నష్టపోయారని అర్ధమవుతుంది. దీంతో గ్రూప్- 1పరీక్ష ఫలితాలపై అభ్యర్థులు పలు అనుమానాలు లేవనెత్తి హైకోర్టును ఆశ్రయించారు. టీజీపీఎస్సీ తన వాదనలో ప్రస్తుతం తెలుగు మీడియం విద్యార్థుల కర్మ, వారి పరిస్థితి అంతే అన్నట్టుగా మాట్లాడింది.

అది నుంచి అనుమానాలే..

గతంలో టీజీపీఎస్సీ అడ్వకేట్‌ను న్యాయమూర్తి గ్రూప్- 1 మెయిన్స్ పేపర్లను దిద్దించే క్రమంలో ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ వాళ్లకి వేరే వేరే కీ ఇచ్చారా? అని అడినప్పుడు ఇవ్వలేదన్నారు. తరువాత వాదనలో కీ ఇచ్చామని చెప్పడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే అసలు మూల్యాంకనం సరిగ్గా జరిగిందా? జరగలేదా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షలో సగటు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థికి వచ్చిన మార్కుల కన్నా ఎంతో విశ్లేషణాత్మకంగా రాసిన తెలుగు మీడియం అభ్యర్థులకు తక్కువ రావడమే దీనికి నిదర్శనం. మరోవైపు కొన్ని పరీక్ష సెంటర్ల నుంచే మెజార్టీ అభ్యర్థులు ఎంపిక కావడం పలు అనుమానాలకు దారి తీసింది. గతంలో ఈ నియామకాల్లో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు ఎంపిక చేస్తున్నప్పుడు జీవో 55ను అనుసరించేవారు. ప్రస్తుత నియామకం కోసం జీవో 29 తీసుకువచ్చారు. దీంతో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉల్లంఘన జరగడం వలన సామాజిక వర్గాల వారికి అన్యాయం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వం మొండి వైఖరితో ముందుకెళ్లి మెయిన్స్ పరీక్ష నిర్వహించింది. ఇది అభ్యర్ధులలో ఆందోళనలకు కారణమయింది.

రీ మెయిన్స్ నిర్వహించడమే పరిష్కారం!

రాష్ట్రంలో గ్రూప్-1 సర్వీసును ఉన్నతమైన ఉద్యోగంగా భావిస్తారు. ఆ సర్వీస్ సాధించాలని నిరుద్యోగుల కల. దాదాపు 10 ఏళ్ల తర్వాత నోటిఫికేషన్ వేశారు. అప్పుడు జరిగిన అవకతవకల నేపథ్యంలో ఒకసారి గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు అయింది. తర్వాత ప్రభుత్వం మారింది. మళ్లీ నూతన నోటిఫికేషన్‌తో ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది. ఇప్పుడు మరోసారి హైకోర్టు గ్రూప్-1 ఫలితాలు రద్దు చేసిన నేపథ్యంలో టీజీపీఎస్సీ పరీక్ష నిర్మాణంలో విశ్వసనీయత, అభ్యర్థులు పరీక్షల పట్ల నమ్మకాన్ని కోల్పోతుంది. ఇప్పుడు హైకోర్టు రీవాల్యుయేషన్, మరొకటి రీమెయిన్స్ గురించి చెప్పింది. ఇందులో రీవాల్యుయేషన్ సాధ్యమయ్యే పరిస్థితి కనబడటం లేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమ నిబంధనలలోని నియమం-3 (ix) (d) ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ రీవాల్యుయేషన్ లేదనీ చెప్పింది. ఈ నేపథ్యంలో తిరిగి మెయిన్స్ పరీక్ష నిర్వహించడమే సరైనదని నిపుణులు అంటున్నారు. అభ్యర్థులు సైతం పారదర్శకంగా మళ్లీ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. టీజీపీఎస్సీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే అభ్యర్థులు ఆర్థికంగా చాలా నష్టపోయారు. భవిష్యత్ ప్రక్రియ ఎలాంటి అవకతవకలు లేకుండా జరగాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఉద్యోగ నియామకాలపై నమ్మకం కలుగుతుంది.

-సంపతి రమేష్ మహారాజ్

79895 79428

Next Story