రైతును ఏడిపించి బాగుపడతారా!?

by Disha edit |
రైతును ఏడిపించి బాగుపడతారా!?
X

'రైతు కన్నీరు కార్చిన ఏ ప్రాంతమూ బాగుపడదని' ఒక నానుడి. కేసీఆర్‌ ప్రభుత్వంలో నేడు తెలంగాణ రైతాంగం అటువంటి దుస్థితినే ఎదుర్కొంటున్నారు. ఆరుగాలం కష్టపడి ప్రతిమనిషికి పట్టెడు అన్నం పెట్టే రైతన్న తన భవిష్యత్తు అంధకారమై తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. తెలంగాణ ప్రభుత్వ అసమర్థ విధానాలతో ఆత్మస్థయిర్యం కోల్పోయిన కొందరు రైతన్నలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రైతును రాజును చేస్తామంటూ ఉద్యమకాలంలో నమ్మబలికిన కేసీఆర్‌ రైతులు పండిరచే పంటలకు కొత్తగా చుక్కనీరు అందించడం లేదు. వ్యవసాయరంగంపై ముందుచూపు, సరైన ప్రణాళికలు లేకపోవడంతో తెలంగాణ రైతాంగం పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

వ్యవసాయానికి పెట్టుబడి, ఇతర సాగు అవసరాలకు అవసరమైన ఖర్చులకు 'రైతుబంధు' పథకం ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం డాంభికాలు పలికింది. కానీ, రైతుబంధు పథకం రూపకల్పనలో సరైన మార్గదర్శకాలు రూపొందించడంలో ప్రభుత్వ వైఫల్యం మూలంగా చిన్న సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక ఎకరా ఉన్న పేద రైతుకు, 50 ఎకరాలున్న ధనిక రైతుకు రైతుబంధును ఒకేరకంగా అమలు చేయడంపై రైతాంగం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సాధారణ రైతులకు ఉపయోగపడే పద్ధతిలో రైతుబంధు పథకంలో మార్పులు చేయాలని కోరుతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం అవుతున్నా రైతుబంధు పథకం నిధుల విడుదలలో ప్రభుత్వం తీవ్రజాప్యం చేస్తోంది. ఇప్పటివరకు రైతుబంధు పథకానికి ప్రభుత్వం రూ.7,500 కోట్ల నిధులు మంజూరు చేయాల్సి ఉన్నా ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు.

జాడలేని రుణమాఫీ

రాష్ట్రంలో రైతు రుణమాఫీ కోసం దాదాపు రెండు లక్షల మంది రైతులు ఎదురుచూస్తున్నారు. రైతులకు ఇవ్వాల్సిన రూ.857 కోట్ల రుణమాఫీ నిధులను కేసీఆర్‌ ప్రభుత్వం నిలిపివేసింది. 'తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి ఏక కాలంలో లక్షరూపాయల రుణమాఫీ' అమలు చేస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టో పేజి నెం.9 లో వ్యవసాయరంగంపై తమ విధానాన్ని ప్రకటిస్తూ టీఆర్‌ఎస్ హామీ ఇచ్చింది. రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వ అలసత్వం వలన రైతాంగానికి వచ్చే ఇతర డిపాజిట్లను సైతం బ్యాంకు అధికారులు రుణమాఫీ కింద జమచేసుకుంటున్నారు. దీనితో రైతు రుణమాఫీ పథకం 'ఎక్కడ వేసిన గొంగలి అక్కడే' అన్న చందంగా ఉన్నది.

ఆర్‌బీ‌ఐ లెక్కల ప్రకారం రైతులకు 18 శాతం వ్యవసాయ రుణాలు ఇవ్వాలి. అంటే రైతులకు న్యాయంగా ఇవ్వాల్సిన రుణాలు లక్ష కోట్లపై మాటే. ఇది సక్రమంగా అమలైతే వడ్డీవ్యాపారుల నుండి రైతులకు విముక్తి కలుగుతుంది. రైతన్నలు ఆత్మహత్య చేసుకోవాల్సిన దయనీయమైన పరిస్థితులు ఉత్పన్నం కావు. తెలంగాణ రాష్ట్రంలో 14 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. అంటే, రాష్ట్రంలో 30 శాతం కౌలు వ్యవసాయమే. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న కౌలు రైతులకు ఎటువంటి భరోసా, రక్షణా లేదు. కేంద్రం తీసుకువచ్చిన 2011 కౌలు రైతు చట్టాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. కౌలు రైతులకు రుణార్హత కార్డులు ఇచ్చింది. రెండేండ్ల పాటు వారి హక్కుల అమలుకు ప్రభుత్వం సహకరించింది కూడా. తరువాత భూయజమానులు, కౌలు రైతులు మాట్లాడుకుని సమస్యలను పరిష్కరించుకోవాలంటూ ప్రభుత్వం చేతులు దులుపుకున్నది.

పాపం కౌలు రైతులు

ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా వంటి ఏ పథకమూ కౌలు రైతులకు అందడం లేదు. నాబార్డు ద్వారా కౌలు రైతులు రుణాలు పొందవచ్చని జాతీయ కౌలు రైతు చట్టం చెబుతున్నా అందుకు అవసరమైన సహకారం రాష్ట్ర ప్రభుత్వం నుండి అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కౌలు రైతులను అసలు రైతులుగానే గుర్తించేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం నిరాకరించడం గర్హనీయం. వాస్తవంగా దుక్కి దున్ని వ్యవసాయం చేసే వాడే నిజమైన రైతు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ అయినా, రుణమైనా వారికే దక్కాలి. కానీ, తెలంగాణ రాష్ట్రంలో అందుకు విరుద్ధంగా కేసీఆర్‌ ప్రభుత్వ విధానం ఉండడం కౌలు రైతులకు తీరని నష్టం చేకూరుస్తోంది.

వ్యవసాయ సీజను ప్రారంభం కాగానే రైతులకు ముందుగా కావాల్సింది విత్తనాలు. రైతులకు సబ్సిడీపై నాణ్యమైన విత్తనాలు. అందించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో రైతాంగం విత్తనాలకు సొంతంగానే సమకూర్చుకుంటున్నారు. పంట కాలంలో అందించాల్సిన ఎరువుల విషయంలోనూ అదే నిర్లక్ష్య ధోరణి ప్రభుత్వంలో కనబడుతోంది. కొందరు దళారుల అత్యాశ వల్ల రైతులు నకిలీ విత్తనాలతో మోసపోతున్న ఘటనలూ చూస్తున్నాం. ఆరుగాలం చేసిన కష్టం పంట చేతికి వచ్చే సరికి నకిలీ విత్తనాల వలన రైతాంగం నిండా మునుగుతోంది. దీనికి కారణం ఎవరు? వ్యవసాయరంగంపై సరైన ప్రణాళికలు లేని కేసీఆర్‌ ప్రభుత్వానిది కాదా?

అవగాహన కల్పించని అధికారులు

వరికి ప్రత్యామ్నాయంగా రైతులు వాణిజ్యపంటల వైపు మళ్లాలని ప్రభుత్వం పదేపదే చెప్తోంది. కానీ, అందుకు సంబంధించిన సన్నాహాల విషయంలో కానీ, రైతులకు అవగాహన కల్పించే విషయంలో కానీ ప్రభుత్వం వద్ద కనీసం ప్రణాళికలు లేవంటే ఆశ్చర్యం లేదు. వరికి బదులుగా ఏ భూమిలో ఏ పంట సాగుకు అనుకూలమో తెలియాలంటే ముందు భూసార పరీక్షలు నిర్వహించాలి. ప్రభుత్వం కానీ, వ్యవసాయ శాఖ అధికారులు కానీ, ఆ దిశగా ఇప్పటివరకు చర్యలు చేపట్టిన దాఖలా లేదు. ఒకవైపు 'వరివేస్తే ఉరేనంటూ' బెదిరించడం, మరోవైపు పంట కొనుగోలు సకాలంలో చేయకపోవడం వలన రైతాంగం ఆత్మస్థైర్యం దెబ్బతింటోంది. ఏ ప్రాంతంలోనైనా పంటలు సమృద్ధిగా పండాంటే కావాల్సినంత సాగునీరు ఉండాలి.సాగునీరు ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రభుత్వానికి ముందుచూపు, అవసరమైన ప్రాధాన్యతలు ఉండాలి. కానీ, కేసీఆర్‌ ప్రభుత్వానికి ఈ రెండూ లేవనడంలో సందేహం లేదు.

ఎత్తిపోతల పథకాల నిర్మాణంలో వెనుకబడిన ప్రాంతాలకు ముందు ప్రాధాన్యం ఇవ్వాలన్న సోయే లేదు. తెలంగాణ రాష్ట్రం నదీ పరీవాహక ప్రాంతాలకు చాలా ఎత్తులో ఉంటుంది. ఇక్కడ సాగునీరు అందించాలంటే ఎత్తిపోతల పథకాలే శరణ్యం. ఎత్తిపోతల పథకాల నిర్మాణంలో వెనుకబడిన ప్రాంతాలకు ముందు ప్రాధాన్యం ఇవ్వాలి. పాలమూరు జిల్లాలలో పెండింగ్‌లో ఉన్న పాలమూరు-రంగారెడ్డి, డిరడి, కోయిల్‌‌సాగర్‌ ఫేజ్‌ 11 వంటివి ఈ కోవలోకే వస్తాయి. బంగారం పండించే భూములున్నా వ్యవసాయానికి చుక్క సాగునీరు లేక పాలమూరు ప్రజలు ముంబాయ్‌, సూరత్‌వంటి ప్రాంతాలకు వలసపోతున్నా ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం కురిసిన మాదిరిగా వ్యవహరిస్తోంది.

గొప్పలు చెప్పుకున్న సర్కారు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే 'కాళేశ్వరం ప్రాజెక్టు ను ప్రతిష్టాత్మకంగా నిర్మించామని కేసీఆర్‌ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. కాళేశ్వరం ద్వారా సాగునీరు అందించాలంటే 50 చోట్ల నీటిని ఎత్తిపోయాలని, ఒక ఎకరాకు నీటిని అందించాలంటే అయ్యే కరెంటు ఖర్చు రూ.50 వేలు అని, అది కమీషన్ల కోసం రీడిజైన్‌ చేసిన ప్రాజెక్టు అని, కాళేశ్వరం ద్వారా కొత్తగా ఏర్పడిన స్థిర ఆయకట్టు లేదని, ఒక రకంగా చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఒక తెల్ల ఏనుగువంటిదని ఇటీవల ఒక మాజీ ఐఏఎస్‌ అధికారి చెప్పిన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి.సాగునీరు అందించే విషయంలో తెలంగాణ ప్రభుత్వ డొల్లతనం ఆ ఐఏఎస్‌ మాటలలోనే తేటతెల్లం అవుతుంది.

కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరను అమలుచేయడం, మధ్య దళారులు, మార్కెటు దోపిడి నుండి రైతాంగాన్ని ఆదుకోవడంలో కేసీఆర్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. యాసంగిలో ఐకేపీ కేంద్రాలు ఉండవని, రాష్ట్రప్రభుత్వం వరి కొనుగోలు జరుపబోదని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా ప్రకటించారు. దీంతో సుమారు 14 లక్షల ఎకరాలలో రైతులు వరిపంట వేయలేదు. వరి కొనుగోలు విషయంలో కేంద్రం స్పష్టమైన విధానం ప్రకటించినా కేసీఆర్‌ ప్రతిష్టకు పోయి రైతాంగాన్ని ఆర్థికంగా దివాళా తీయించారు. వరి పండించిన రైతులు సైతం మిల్లర్లకు, దళారులకు తక్కువ ధరకే అమ్ముకునే అనివార్య పరిస్థితిని కేసీఆర్‌ సృష్టించారు. మిల్లర్లతో ప్రభుత్వంలోని పెద్దలు కుమ్మక్కు అయ్యారనేది ఎఫ్‌‌సీఐ అధికారుల తనిఖీలలో బహిర్గతమైంది.

మిల్లర్లతో టీఆర్ఎస్ నేతల కుమ్మక్కు

'గుమ్మడి కాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లుగా' సంబంధిత శాఖా మంత్రి రైసు మిల్లులలో ఎఫ్‌‌సీఐ అధికారుల తనిఖీలు ఏమిటంటూ గగ్గోలు పెడుతున్నారు. సివిల్‌ సప్లయ్‌ అధికారులు, మిల్లర్లు అంతా స్వచ్ఛంగా ఉంటే మంత్రిగారికి ఈ ఉలికిపాటు ఎందుకు? కరోనా కాలంలో ప్రధాని నరేంద్రమోడీ పంపిన బియ్యం పేదలకు పంచలేదనే నిజం బయట పడినట్లుగానే తమ అవినీతి భాగోతం బయటపడుతుందేమోనని భయమా? రైతు సంక్షేమ రాజ్యాన్ని కాంక్షిస్తున్న ప్రధాని మరోసారి వివిధ పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించి తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు. రైతాంగానికి అవసరమైన మనోధైర్యాన్ని, భరోసాని కల్పించటంలో బీజేపీ నాయకత్వంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం ఎప్పుడూ అగ్రభాగాన నిలుస్తోంది.

రానున్న కాలంలోనూ రైతాంగానికి మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుండి అమలవుతున్న ఫసల్‌ బీమా పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం నీరుగార్చింది. కేంద్రం ఇచ్చే నిధులను రైతాంగానికి చేరకుండా అడ్డుకుంటుంది. రైతుప్రభుత్వం అని బాకాలు ఊదే కేసీఆర్‌ కనీసం ఫామ్‌హౌస్‌ వీడి రైతుల కష్టాలను చూడకపోవడం గర్హనీయం. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పెద్దఎత్తున ఉద్యమకార్యాచరణ నిర్వహించేందుకు బీజేపీ సన్నద్ధమవుతోంది. రైతన్నలంతా మద్దతుగా నిలిచి న్యాయమైన సమస్యల పరిష్కారానికి తోడ్పాటునందించాల్సిందిగా కోరుతున్నాం.

బండి సంజయ్‌ కుమార్‌

ఎంపీ, కరీంనగర్‌

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు


Next Story

Most Viewed