- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ పీఆర్సీలోనైనా.. ఉద్యోగుల ఆశలు నెరవేరేనా?
తెలంగాణ రెండో వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) నివేదికపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల అంచనాలు, ఫిట్‌మెంట్, హెచ్‌ఆర్‌ఏ, మాస్టర్ స్కేల్, డీఏ బకాయిలు, గడువు పొడిగింపుల ప్రభావం..

వేతనం, ఉద్యోగికి వచ్చే నెలసరి ఆదాయం మాత్రమే కాదు.. అతని కుటుంబ ఆర్థిక భద్రతకు, జీవన ప్రమాణాలకు ఆధారం. అందుకే ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ ప్రక్రియ ఎప్పుడూ ఆసక్తికరంగానే కాక, ఆర్థికంగా, సామాజికంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంటుంది. తెలంగాణలో రెండో వేతన సవరణ కమిషన్ నివేదిక కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్న ఈ సమయంలో, పీఆర్సీల చరిత్ర, ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్ సవాళ్లను పరిశీలించడం అవసరం..
నిరంతరం పెరిగే జీవన వ్యయం, ద్రవ్యోల్బణ ప్రభావం, మారుతున్న సామాజిక అవసరాలకు అనుగుణంగా ఉద్యోగుల జీవన ప్రమాణాలను కాపాడటమే 'వేతన సవరణ' ప్రధాన ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వం ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి పే కమిషన్‌ను నియమిస్తుండగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ కమిషన్ (PRC) ఏర్పాటు చేయడం ఒక సాంప్రదాయంగా వస్తోంది.
రెండవ పీఆర్సీ.. ప్రస్తుత స్థితి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చారిత్రాత్మక మార్పుల నుండి, స్వతంత్ర తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలిచిన ప్రస్తుత రెండవ వేతన సవరణ కమిషన్ వరకు సాగిన ఈ ప్రస్థానం, కేవలం జీతాల పెంపు మాత్రమే కాదు.. అదొక సుదీర్ఘ ఆర్థిక, సామాజిక విశ్లేషణ. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల వేతనాల పునర్వ్యవస్థీకరణ కోసం రెండవ వేతన సవరణ కమిషన్ అక్టోబర్ 2 2023న అధికారికంగా ఏర్పాటు చేశారు. జూలై 1 2023 నుండి ఈ కొత్త వేతన సవరణ అమలులోకి రావాల్సి ఉంది. మధ్యంతర ఉపశమనం కమిషన్ ఏర్పాటు సమయంలో ఉద్యోగులకు 5% ఐ.ఆర్‌ను ప్రకటించడం జరిగింది. తాజా గడువు పొడిగింపు ఈ కమిషన్ నివేదిక సమర్పణ గడువును ప్రభుత్వం ఇటీవల మరో 6 నెలల పాటు పొడిగిస్తూ, సెప్టెంబర్ 30 2026 వరకు సమయం ఇచ్చింది.
'సిఫార్సు' వర్సెస్ 'ప్రకటన'
పీఆర్సీల చరిత్రలో కమిషన్లు శాస్త్రీయంగా లెక్కగట్టి ఇచ్చే సిఫార్సుల కంటే, ప్రభుత్వం ప్రకటించే ఫిట్మెంట్ శాతమే ఎప్పుడూ ఎక్కువగా ఉంటోంది. మొదటి తెలంగాణ పీఆర్సీ కమిటీ 7.5% ఇస్తే, ప్రభుత్వం 30% ఇచ్చింది. ప్రస్తుతం నడుస్తున్న తెలంగాణ రెండవ పీఆర్సీపై ఉద్యోగులు, ఉపాధ్యా యులు, పెన్షనర్లు ద్రవ్యోల్బణం, పెరిగిన జీవన వ్యయాన్ని అంచనా వేస్తూ 45% నుండి 50% వరకు ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం, కమిషన్ ఏ మేరకు సమతుల్యత పాటిస్తాయో వేచి చూడాలి. 1978 నాటి కృష్ణస్వామి కమిషన్ ప్రవేశపెట్టిన మాస్టర్ స్కేల్ విధానం తెలుగు రాష్ట్రాల ఉద్యోగులకు ఒక గొప్ప రక్షణ కవచం. లోయర్ క్లాస్ నుండి హైయర్ క్లాస్ ఉద్యోగి వరకు ఒకే గొలుసుకట్టు పరిధిలోకి రావడం వల్ల స్టాగ్నేషన్ సమస్య తగ్గుతుంది. రాబోయే రెండవ పీఆర్సీలో కూడా ఈ మాస్టర్ స్కేల్ పరిమితులను మరింత విస్తరిం చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
గడువు పొడిగింపుతో.. ఉద్యోగుల్లో అసంతృప్తి
నిజానికి తెలంగాణ రెండవ పీఆర్సీ నివేదిక 2024లోనే రావాల్సి ఉన్నప్పటికీ, నిరంతర గడువు పొడిగింపుల వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లలో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతున్న తరుణంలో, పీఆర్సీ నివేదిక ఆలస్యం కావడం వల్ల పెండింగ్ డీఏల బకాయిలతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆందో ళన వ్యక్తపరుస్తున్నారు. మొదటి పీఆర్సీలో కేంద్ర ప్రభుత్వ తరహాలోనే హెచ్.ఆర్.ఏ రేట్లను తగ్గించడం ఉద్యోగులకు నష్టాన్ని చేకూర్చింది. 2వ పీఆర్సీలో ఈ హెచ్.ఆర్.ఏ స్లాబులను పునరుద్ధరించాలని, అలాగే ఇతర అలవెన్స్‌లను కూడా పెంచాలనే డిమాండ్లు బలంగా ఉన్నాయి. సమగ్రంగా పరిశీలిస్తే, పీఆర్సీ అనేది కేవలం జీతాల పెంపుదల ప్రక్రియ మాత్రమే కాదు.. అది ప్రభుత్వ యంత్రాంగం పనితీరును, ఉద్యోగుల సంక్షేమాన్ని సమతుల్యం చేసే ఒక ఆర్థిక త్రాసు.
ఈ పీఆర్సీలో సరైన నిర్ణయాలు తీసుకుంటే..
ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయాలు, ప్రాంతీయ వ్యత్యాసాల నడుమ పీఆర్సీలు సాగాయి, కానీ తెలంగాణలో వచ్చిన మొదటి పీఆర్సీ ఉద్యోగుల ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచింది. అందుకే ఈ సారి పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేలా మాస్టర్ స్కేల్ విస్తరణ, న్యాయబద్ధమైన ఫిట్మెంట్, హెచ్.ఆర్.ఏ, ఇతర అలవెన్సులపై సరైన నిర్ణయాలు తీసుకున్నప్పుడే ఉద్యోగుల్లో నిజమైన ఉత్సాహం నిండుతుంది. ప్రభుత్వం కాలయాపన లేకుండా ఈ కమిషన్ నివేదికను సేకరించి, సకాలంలో అమలు చేసినప్పుడే ఉద్యోగుల సంక్షేమం నెరవేరుతుంది. తద్వారా తెలంగాణ పునర్నిర్మాణ సాధనలో ప్రభుత్వ యంత్రాంగం మరింత పునరంకిత భావంతో సేవనందించేందుకు మార్గం సుగమమవుతుంది.
-మనోహర్ రావు చిలప్పగారి,
రిటైర్డ్ ప్రభుత్వ అధికారి
96406 75288






