ఇదీ సంగతి: బీజేపీ విధానాలతో దేశం బాగుపడేనా?

by Disha edit |
ఇదీ సంగతి: బీజేపీ విధానాలతో దేశం బాగుపడేనా?
X

నిజాలను అంగీకరించడానికి బీజేపీ సిద్ధంగా లేదు. దేశంలో ఉపాధి లేని కూలీలు ఆత్మహత్య చేసుకుంటున్నా కేంద్రానికి పట్టడం లేదు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ తన ఎనిమిదేండ్ల పాలనలో పది లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. పీఎస్‌యూలను అమ్మివేసి లక్షలాది ఉద్యోగులు రోడ్ల మీదికి వచ్చేందుకు కారణమైంది. ప్రభుత్వరంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసారు. లాభాలలో ఉన్న బొగ్గు సంస్థలలోనూ ప్రైవేటీకరణ అమలు చేస్తున్నారు. పాలసీలో మార్పులు తెచ్చి కోల్ ఇండియా, సింగరేణిని ఇబ్బంది పెడుతున్నారు. ఉద్యమాలు, పోరాటాలు తప్ప వేరే మార్గం లేదు. ఈ నెల చివరి వరకు కేంద్రం ఇస్తున్న ఉచిత రేషన్‌కు యూపీలో డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారు. 80 కోట్ల మందికి ఉచిత రేషన్ కూడా ఎక్కువ రోజులు కొనసాగే పరిస్థితి కనబడడం లేదు.

దేశంలో ఉపాధి హామీ పథకం కింద 15 కోట్ల మంది జీవనం సాగిస్తున్నారు. అసంఘటిత, వలస కార్మికులు 20 కోట్ల వరకు ఉంటారు. ఇందులో గత ఏడాది 42 వేల మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2020 లో 40 వేల మంది ఆత్మహత్య చేసుకున్నారు. కరోనా కారణంగానూ, అంతకు ముందు కేంద్రం బడ్జెట్ కేటాయింపును తగ్గించడం వలననూ ఉపాధి లభించని కూలీల పరిస్థితి కడు దీనంగా మారింది. 15 రాష్ట్రాలలో వీరి పరిస్థితి అద్వానంగా ఉంది. బిహార్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, బెంగాల్, మధ్యప్రదేశ్‌లో ఆత్మహత్యలు అధికంగా ఉన్నాయి.

ఎన్‌సీ‌ఆర్‌బీ రిపోర్ట్ ప్రకారం దేశంలో నిరుద్యోగం 8.4 శాతంగా ఉంది. 2017 లో 1 లక్షా 19 వేల మంది, 2020లో 1 లక్షా 53 వేల మంది, 2021లో 1 లక్షా 035 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో 100కు 25 మంది అసంఘటిత, వలస కార్మికులే ఉన్నారు. ఒకప్పుడు 12 శాతం వరకు ఉంటే ఇప్పుడు 25 శాతానికి చేరింది. ఇది అతి పెద్ద విషాదమే. ఆ కుటుంబాలకు తీరని దుఃఖమే. ఆ నొప్పి ఆ కుటుంబాలకు తప్ప ఎవరికీ తెలియదు. ఎందుకంటే, కరోనా కాలంలో వారు కుటుంబాలు సహా రోడ్ల మీద కాళ్లకు బొబ్బలు వచ్చినా, రక్తాలు కారుతున్నా బట్టలు కట్టుకుని నడుచుకుంటూనే సొంత ఊర్లకు వెళ్లారు. మృత్యువాత పడిన వారిని రోడ్డు పక్కనే తవ్వి పాతి పెట్టిన దృశ్యాలనూ చూసాం. గంగానదిలో శవాలు తేలియాడిన దృశ్యాలనూ చూసాం.

యువకులే ఎక్కువ

మహారాష్ట్రలో రోజూ ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 37 మంది రైతులు మరణించారు. కేంద్రంలో ఒక మంత్రి 2047 నాటికి 20 ట్రిలియన్‌ల దేశం అవుతుందని అంటే, మరో మంత్రి పీయూష్ గోయల్ 2052 నాటికి 52 ట్రిలియన్‌లు అంటారు. 2022 కు ఐదు ట్రిలియన్ ఎకానమీ అన్నారు మన పీఎం నరేంద్ర మోడీ. కానీ. మూడు ట్రిలియన్‌ల వద్దే ఆగిపోయాం. మోడీగారి మిత్రుడు అంబానీ దుబాయ్‌లో 640 కోట్ల రూపాయలు పెట్టి సముద్ర తీరాన అద్భుతమైన బంగ్లా కొనుగోలు చేశారు.

భారతదేశంలో ఉపాధి లభించక లక్షలాది కూలీలు ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితికి కారకులు ఎవరు? ఈ అసమానతలు ఎందాక? సామాన్య ప్రజలను కులం, మతం ఉచ్చులోకి నెడుతున్నారు. టీవీల ముందు ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూస్తూ అతిగా ఉత్సాహపడే విధంగా, అదే లోకంగా వ్యవహరించేలా చేస్తున్నారు. కుటిల రాజకీయాలు చేసి జనం మనోభావాలతో ఆడుకుంటున్నారు. చాలా పెద్ద మైండ్ గేమ్ నడుస్తున్నది. ప్రశ్నించడం పూర్తిగా ఆపేస్తే పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది. ఉపాధి లభించక ఆత్మహత్య చేసుకుంటున్నవారిలో 15 నుంచి 30 యేండ్ల వయస్సు ఉన్నవారు, 40 నుంచి 55 యేండ్లవారు ఎక్కువగా ఉన్నారు. ప్రభుత్వం ఆత్మహత్యలకు నైతిక బాధ్యత వహించాలి. కానీ, ప్రభుత్వం అసలు ఆత్మహత్యల లెక్కలే తప్పని అంటున్నది.

విపక్షాల నోరుమూత

ఢిల్లీ బోర్డర్ వద్ద 378 రోజులు కొనసాగిన ఆందోళనలో 750 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. పార్లమెంట్‌లో విపక్షాలు ఈ విషయాన్ని లేవనెత్తితే సంబంధిత మంత్రి తమకు అందిన సమాచారం ప్రకారం ఇద్దరే మరణించినట్లు తెలిసిందని అవహేళనగా మాట్లాడారు. మంత్రి ప్రకటన, విచ్చలవిడితనం చూసి దేశమే నివ్వెరపోయింది. జీఎస్‌టీ, అధిక ధరలు, పెగాసస్, రైతు సమస్యలు, నిరుద్యోగం, ఉపాధి మీద పార్లమెంట్‌లో మాట్లాడానికి విపక్షాలకు అనుమతి ఇవ్వడం లేదు. కార్మిక చట్టాల మీద మాట్లాడడానికి వీలు లేదు. విపక్ష నేతల మీద ఐటీ, సీబీఐ, ఈడీ దాడులు పెరిగాయి. తాము మాత్రమే నీతిపరులం, మిగిలిన వారందరూ అవినీతిపరులని బీజేపీ భావిస్తున్నది. మర్డర్ కేసులలో ఉన్నవారు కేంద్ర మంత్రులుగా కొనసాగుతున్నారు. ఇవన్నీ పచ్చి నిజాలు.నిజాలను అంగీకరించడానికి బీజేపీ సిద్ధంగా లేదు.

దేశం లో ఉపాధి లేని కూలీలు ఆత్మహత్య చేసుకుంటున్నా కేంద్రానికి పట్టడం లేదు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ తన ఎనిమిదేండ్ల పాలనలో పది లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. పీఎస్‌యూలను అమ్మివేసి లక్షలాది ఉద్యోగులు రోడ్ల మీదికి వచ్చేందుకు కారణమైంది. ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసారు. లాభాలలో ఉన్న బొగ్గు సంస్థలలోనూ ప్రైవేటీకరణ అమలు చేస్తున్నారు. పాలసీలో మార్పులు తెచ్చి కోల్ ఇండియా, సింగరేణిని ఇబ్బంది పెడుతున్నారు. ఉద్యమాలు, పోరాటాలు తప్ప వేరే మార్గం లేదు. ఈ నెల చివరి వరకు కేంద్రం ఇస్తున్న ఉచిత రేషన్‌కు యూపీలో డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారు. 80 కోట్ల మందికి ఉచిత రేషన్ కూడా ఎక్కువ రోజులు కొనసాగే పరిస్థితి కనబడడం లేదు

Also Read : 2024 విపక్షాల ప్రధాని అభ్యర్థిపై కేసీఆర్ క్లారిటీ


ఎండీ మునీర్

జర్నలిస్ట్, కాలమిస్ట్

99518 65223


Next Story

Most Viewed