తెలుగుదేశం మళ్లీ వెలిగేనా?

by Disha edit |
తెలుగుదేశం మళ్లీ వెలిగేనా?
X

వెయ్యేళ్ల కింద తెలుగు నేలను ఏలిన రాజరాజనరేంద్రుడి రాజధాని రాజమహేంద్రవరం. బ్రిటీష్‌ కాలం నుంచి రాజమండ్రిగా చలామణి అయి... ఇటీవలే అధికారికంగా తిరిగి పాతపేరు తెచ్చుకున్న రాజమహేంద్రవరంలో టీడీపీ కూడా ‘పాతపేరు’ వేటలో తాజా మహానాడుకు రంగం సిద్ధం చేస్తోంది. తెలుగుదేశం సంస్థాపకుడు ఎన్టీరామారావు శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సంవత్సరమే ఆ పార్టీ పునరుజ్జీవనానికి పురిటి వేదిక రాజమండ్రి కాబోతోందా? ఈ ప్రశ్నకు జవాబు... టీడీపీ ప్రస్తుత కర్త, కర్మ, క్రియగా ఉన్న చంద్రబాబునాయుడే చెప్పాలి. ఎందుకంటే, అంతా ఆయన నడత మీద, పార్టీని ఆయన నడిపే తీరుపైనే ఆధారపడి ఉంది. విజయాలన్నీ ఆయన ఖాతాలో వేస్తున్నపుడు పరాజయాలకు జవాబుదారుగా నిలవాల్సిందే! రేపటి పరిస్థితికి ఆయన బాధ్యత తీసుకోవాల్సిందే!

ఫీనిక్స్‌ పక్షిలా బూడిద నుంచి మళ్లీ పైకి లేవాల్సిన సత్తువ కావాలిప్పుడు తెలుగుదేశంకి. కారణం, నాలుగు దశాబ్దాల చరిత్రలో ఎప్పుడూ లేనంత అధ్వానంగా గత ఎన్నికల్లో టీడీపీ కుప్పకూలింది. చావో, రేవో తేల్చుకోవాల్సిన ఎన్నిక గడువు ఏడాది లోపునకు వచ్చేసింది. ఎలా సమాయత్తమవుతున్నామో సమీక్షించుకునే పరీక్షా సమయం ఈ మహానాడు. సైకిల్‌ పరుగెడుతుందా రిపేర్లకూ పనికిరానంతగా పాడై, సైడు కాల్వల్లో కొట్టుకుపోతుందా తేల్చుకునే సమయం. ఎన్నికల ముందు, అతి సమీప వేడుక మహానాడు ఈ నెల 27, 28 తేదీల్లో రాజమండ్రిలో జరుగనుంది. ఎన్నికలు 2024 ఏప్రిల్‌ లోనో, మే లోనో జరిగి, మే మాసాంతానికి ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడాలి. ఇప్పటివరకు ఎంత సన్నద్ధంగా ఉన్నారో సమీక్షించుకుంటూ, ఇక ముందు ఎలా సమాయత్తం కావాలో నిర్ణయించుకునే సందర్భం మహానాడు. ఏటా జరగాల్సిన పార్టీ పండుగ, 2019 ఎన్నికల తర్వాత కరోనా వల్ల ఒకటే మహానాడు, కిందటేడు ఒంగోలులో జరిగింది. ‘వచ్చేవి, నాకు చివరి ఎన్నికలు’ అని చంద్రబాబు ఎందుకన్నారో.... తెలీదు కానీ, తెలుగుదేశంకి చివరి ఎన్నికలు కావని, కాకూడదనీ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు కోరుకోవడంలో ఆశ్చర్యం లేదు. ప్రస్తుత పాలకపక్షం వైఎస్సార్సీపీని ధీటుగా ఎదుర్కునేంత పకడ్బందిగా టీడీపీని బలోపేతం చేస్తున్న జాడలు కనిపించడం లేదు. మరి, 2024 లో తిరిగి అధికారంలోకి వచ్చేదెలా? కిందటి ఎన్నికల్లో వైఎస్సార్సీపీ-టీడీపీ మధ్య ఓట్ల వ్యత్యాసం 10 శాతం, అది పూడ్చుకోవడం ఎలా? ఏ నిర్దిష్ట వ్యూహం లేకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు వెళితే, ఎన్నికల్లో గెలుపు టీడీపీ తలుపు తట్టేనా?

సమీక్షకు జడుపు

2019 ఘోరపరాజయం కారణాలను విశ్లేషించే లోతైన సమీక్ష టీడీపీ ఈ నాలుగేళ్లూ చేయలేదు. మున్నెన్నడూ లేనంత దారుణంగా 23 స్థానాలకు పరిమితమైంది. ఫలితాలను, ప్రజలిచ్చిన తీర్పుని సమీక్షించి, కారణాలు తెలుసుకోకుండా ఏ రాజకీయపక్షమైనా ముందడుగు వేయగలదా? చిన్న చిన్న పార్టీలు కూడా సమీక్షించుకుంటాయి. ఆత్మశోధన చేస్తాయి. ‘ఒక్క చాన్స్‌ ఇమ్మని జగన్‌ అడిగాడు, ప్రజలు ఇచ్చారు’ అని ఒక అంశంగా, ఒకే వాక్యంగా ఫలితాల సారాన్ని విశ్లేషించుకొని, తమను తాము భుజం తట్టుకున్నారు. 2014-19 మధ్యలో తమ ప్రభుత్వ వైఫల్యాలు, నాయకులు-కార్యకర్తల ఆగడాలు, అక్రమాలు, రాజధాని అమరావతి పేరిట అతి చేష్టలు... ఇవేవీ చర్చించకుండా, తూతూ మంత్రంగా నెట్టుకొచ్చారు. పార్టీ శ్రేణులకు ఏ సందేశమూ లేదు. వారిలో స్థయిర్యం పడిపోయి, నిస్సత్తువ ఆవహించింది. కొత్త భరోసా ఇచ్చే ఏ యత్నమూ జరుగట్లే. 2009, 14, 19 వరుసగా మూడు ఎన్నికల్లోనూ టీడీపీ ఓడిపోతున్న అసెంబ్లీ స్థానాలు 51. ఎస్టీ రిజర్వుడు 7 స్థానాలకు గాను 2009లో (అరకు), 2014లో (పోలవరం) ఒక్కోటి గెలిచారే తప్ప, 2019లో మొత్తం స్థానాలు టీడీపీ ఓడిపోయింది. 29 ఎస్సీ రిజర్వుడు స్థానాలకు గాను, 11 స్థానాల్లో మూడు వరుస ఎన్నికల్లోనూ ఓటమే! ఎందుకీ పరిస్థితో ఎవరికీ తెలియదు. నాయకులు, కార్యకర్తల్ని పిలిచి మాట్లాడలేదు, క్షేత్ర పరిస్థితిని లోతుగా పరిశీలించిన పాపాన పోలేదు. ‘దీన్ని అహంకారం అనాలో, ఆశ వదులుకోవడం అనుకోవాలో అంతుబట్టద’ని పార్టీకే చెందిన ఒక సీనియర్‌ చేసిన వ్యాఖ్య ఎవరినైనా ఆలోచింపజేస్తుంది, పార్టీ అధినేతను తప్ప! ‘మారాలి మారాలి అని మాకు హితబోధ చేసే మా నాయకుడు మాత్రం మారడు, సభ అయినా, టెలీ-వీడియో కాన్ఫరెన్స్‌ ఏదైనా... అదే సోది, ఇప్పటికీ గంటలు గంటలు ఉపన్యాసాలు’ అనే నాయకులు, కార్యకర్తల సంఖ్య టీడీపీలో ఎక్కువే!

జెండా తప్ప ఎజెండా ఏది!

ఏపీలో 2019 ఎన్నికల తర్వాత నిజానికి టీడీపీది ప్రతిపక్ష పాత్ర! కానీ, ఆ పాత్ర అంతో ఇంతో నిర్వహించింది న్యాయస్థానాలు, ఒకవర్గం మీడియా తప్ప టీడీపీ కాదు. రాష్ట్రంలో మీడియా... ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రతికూల, అనుకూల (పచ్చ-నీలి మీడియా) కూటములుగా నిలువునా చీలి ఉంది. ప్రభుత్వాన్ని, పాలకపక్షాన్ని గుడ్డిగా వ్యతిరేకించే పచ్చమీడియా రచించిందే ఆచరించడం తప్ప టీడీపీకి ప్రత్యేక ఎజెండా ఏమీ లేదు. క్షేత్రస్థాయి పరిశీలన, అధ్యయనాలేమీ లేవు. జనం ఏ కష్టాలు ఎదుర్కొంటున్నారు? ప్రభుత్వం ఎక్కడ విఫలమైంది? ఆయా సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలేమిటి? టీడీపీ ఏం చేస్తుంది వంటి విషయాల్లో లోతుగా వెళ్లిందే లేదు. జగన్‌-చంద్రబాబు హామీల్లో... ప్రజలు వేటిని నమ్ముతారు అనే ప్రశ్నకు చిన్న పిల్లాడైనా స‌మాధానం చెప్పగలడు. నవరత్నాలంటూ... ఇచ్చిన సంక్షేమ హామీలన్నీ నెరవేరుస్తున్నారు కనుక జగన్‌నే నమ్ముతారు. గత చరిత్ర (ట్రాక్‌రికార్డు) రీత్యా... ప్రతి ఓటరుకు కిలో బంగారు ముద్ద ఇస్తానన్నా చంద్రబాబును జనం నమ్మరు. పాలకపక్షానికున్న సమస్యల్లా... ముఖ్యమంత్రి ప్రవర్తన-మొండితనం-జనం మాట వినరనే అభియోగాలు, పార్టీ నాయకుల వైఖరి-నియోజకవర్గాల్లో దాష్టీకాలు, కక్షసాధింపు ధోరణి. ఇవే! వైసీపీ వైపు వైఫల్యాలవుతాయే తప్ప ఇవి టీడీపీ ఘనత కాదు కదా! ‘ఇదేం ఖర్మ’ ‘రాష్ట్రానికి శని పట్టుకుంది’ ‘సైకో పోవాలి’ వంటి నెగెటివ్‌ ప్రచారమే తప్ప టీడీపీ పాజిటివ్‌ ప్రచారమే లేదు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్న ప్రత్యామ్నాయ సామాజికార్థిక ప్రతిపాదనే ఉండదు. పాత నాయకత్వానికే వన్నెలు దిద్దుతారు తప్ప కొత్త నాయకత్వానికి తలుపులు తీయరు. పేరుకే అచ్చెన్నాయుడు రాష్ట్ర అధ్యక్షుడు, కానీ, జరిగేదంతా నాయకుడు నెరిపే తంతే!

అదైనా చెప్పుకోలేరా?

పాత 13 జిల్లాల సమగ్రాభివృద్ది ప్రతిపాదన ఏ మూలన ప‌డింది? సమతుల్య ప్రాంతీయ అభివృద్ది నినాదంతో ‘ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివృద్ది-నూతన రాజధాని స్థల ఎంపిక’ అని 2014 సెప్టెంబరు 4న అసెంబ్లీ వేదికగా టీడీపీ సర్కారు ఓ ప్రకటన చేసింది. ఒక్కో నియోజకవర్గంలో ఏం చేస్తారో నిర్దిష్టంగా చెప్పారు. ఆరంభించి, అలా వదిలేసిన దాన్నిపుడు తెరపైకి తీసుకువచ్చి ప్రచారం చేసుకోవచ్చు, కానీ ఆ తెలివిడి టీడీపీ చూపటం లేదు. పాలకపక్షం దాడులు, దౌర్జన్యాలు, కక్ష సాధింపులు పెరిగాయని టీడీపీ నాయకులు, కార్యకర్తలు విమర్శిస్తుంటారు. ‘అంతకంతకు మూల్యం చెల్లించుకోవాలి, వడ్డీతో తిరిగి రాబడతాం....’ ఇలా ఏదేదో, పై నుంచి కింది వరకు ఒకటే మాట అంటుంటారు! అంటే, ఏమిటి దానర్థం రేపు అధికారంలోకి వస్తే, తామూ రెట్టింపు దౌర్జన్యాలు, దాడులు, దాష్టీకాలు చేస్తామనా? స్పష్టత లేదు. గ్రామవార్డు సచివాలయ వాలెంటీర్స్‌ వ్యవస్థను తట్టుకునే, ఢీకొనే వ్యూహం-కార్యక్రమం ఏదీ టీడీపీ అమ్ములపొదిలో ఉన్నట్టు కనబడదు. జనంలోకి వెళ్లే పకడ్బందీ కార్యక్రమాలూ లేవు. ఉన్నంతలో లోకేశ్‌ పాదయాత్ర కార్యకర్తల్ని ఉత్సాహపరచడంలో ఒకింత ఊపిరైంది. ఇక, జనసేనతో పొత్తు విషయంలోనూ ఇంతవరకు ఓ స్పష్టమైన ప్రకటన చేయలేదు. జనసేన-టీడీపీ పొత్తుకు సానుకూలత పెరుగుతున్నట్టు క్షేత్ర స్థాయి సంకేతాలున్నా... టీడీపీ నాయకత్వ స్పందనే కరువు. జనసేనాని పవన్‌ కల్యాణ్‌తో చంద్రబాబు మూడు మార్లు భేటీ అయ్యారు. అవతలి పక్క అంతో, ఇంతో స్పష్టత ఉన్నా... టీడీపీ మాత్రం ‘వ్యూహాత్మక మౌనం’ పాటిస్తున్నట్టుంది! ఈ వైఖరి టీడీపీ విశ్వసనీయతను మరింత దిగజార్చేదే తప్ప, మెరుగుపరిచేది కాదు. బీజేపీ పట్ల టీడీపీది గడియారంలో ‘లోలకం’ పంథా అని జనం నవ్వుకుంటున్నారు. గత ఎన్నికల ముందు బీజేపీని తీవ్రంగా నిరసించి, ఇప్పుడు మళ్లీ యూ టర్న్‌ తిరిగి ‘మోదీ’ సానుకూల రాగాలు తీయడాన్ని ఎవరైనా ఎలా అర్థం చేసుకుంటారు? లోకనీతి లేని ‘లోలకనీతి’ చూసి మైనారిటీలు, తటస్థులు ‘తూచ్‌’ అంటున్నారని ఓ అధ్యయనం!

కుల సమీకరణాల్లో కుదేలు

కిందటి ఎన్నికల్లో ఏ కుల సమీకరణాలూ టీడీపీకి అచ్చిరాలేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తరచూ ప్రస్తావిస్తున్నట్టు, తనకు బాబుతో పోరు, పేదలు-ధనికుల మధ్య వర్గపోరు (క్లాస్‌వార్‌)గా ప్రచారం మరింత పెరగొచ్చు. అది, ఎటు దారి తీస్తుందో తెలియదు. టీడీపీ 2014తో పోలిస్తే... బీసీల్లో 8 శాతం, కమ్మల్లో 11, రెడ్లలో 22, కాపుల్లో 2 శాతం ఓట్లు 2019లో కోల్పోయినట్టు ‘సీఎస్‌డీఎస్‌-లోక్‌నీతి’ సర్వే చెప్పింది. చివర్లో బీజేపీని వ్యతిరేకించినందుకు ముస్లీంలలో మాత్రం 13 శాతం పెరుగుదల (46 శాతం) నమోదైంది. ఇప్పుడేమౌతుందో.... రాయలసీమ, కొన్ని ఇతర తీర ప్రాంతాల్లో ముస్లీం జనాభా ప్రాబల్యాన్ని బట్టి, టీడీపీ తాజా బీజేపీ సానుకూల వైఖరి వారికి నష్టం కలిగించవచ్చు. ఆయా సామాజికవర్గాల్లో తన పరిస్థితి ఏంటి అన్న పరిశీలన, అధ్యయనం ఏదీ టీడీపీ వద్ద లేదు. కిందటి ఎన్నికల్లోలాగే ఈ సారి కూడా కమ్మ వర్సెస్‌ కమ్మేతర సామాజిక వర్గాలుగా ఓటర్లలో చీలిక వస్తే వైఎస్సార్‌సీపీ రొట్టె విరిగి మళ్లీ నేతిలో పడ్డట్టే! అలా కాకుండా, ఇప్పుడు బయట ప్రచారం జరుగుతున్నట్టు.... జగన్‌ ముఖ్యమంత్రిగా ఉండాలా ఉండొద్దా అనే కార్డు మీద ఎన్నికలు జరిగేట్టయితే.... ముఖ్యమైన విపక్షంగానో, పొత్తుల్లో పెద్ద పార్టీగానో తెలుగుదేశం లబ్దిపొందే అవకాశం ఉంటుంది. అప్పటివరకు టీడీపీ లేచి నిలబడాలి.

ఆత్మవిమర్శ ‘ఈసిజి’ లాంటిది...

రాజకీయాల్లో ఉన్నవాళ్లకు ఓటమి అన్నది అవసరమైన ఔషధం. ఓటమి జ్ఞాపకాన్నిస్తుంది, గెలుపు మరుపునిస్తుంది. నియంతను కూడా నేలమీద నడిపించగలిగేది ఒక్క ఓటమి మాత్రమే! గెలుపు వైపు నడిపేది ఓటమి నేర్పే పాఠం మాత్రమే! తెలుగుదేశం, చంద్రబాబునాయుడు ఏ మేరకు ఆత్మవిమర్శ చేసుకుంటే ఆ మేరకే భవిష్యత్తులో గట్టెక్కుతారు... ఆత్మవిమర్శ ‘‘ఈసిజి’’ లాంటిది... అది తప్పు చూపించకూడదు ... గుండె ఆగిపోతుంది. ఈ సూక్తిని గమనించి ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా జరుపుకుంటున్న ‘మహానాడు’ లో నైనా పారదర్శకంగా ఆత్మవిమర్శ చేసుకుంటే ఆ పార్టీకి, ప్రజలకు మంచిది.

-దిలీప్‌రెడ్డి

పొలిటికల్‌ అనలిస్ట్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌సంస్థ,

[email protected],

99490 99802

Also Read: వైసీపీ సర్కారు నాలుగేళ్ల పాలన తీరిదే!


Next Story

Most Viewed