- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఈ సవాళ్లు దాటేనా..?
ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు, ఓటర్లు కీలకం. కానీ దేశంలో ఒకే వ్యక్తికి రెండు ఓట్లు, మరణించిన వారి పేర్లు తొలగించకపోవడం వంటివి

ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు, ఓటర్లు కీలకం. కానీ దేశంలో ఒకే వ్యక్తికి రెండు ఓట్లు, మరణించిన వారి పేర్లు తొలగించకపోవడం వంటివి ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాయి. ఈ నకిలీ ఓట్ల సమస్య దశాబ్దాలుగా ఉంది, దీనిని నివారించడం సవాలుగానే మిగిలిపోయింది. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమే కాక, దేశ భవిష్యత్తుకు కూడా ముప్పు తెస్తుంది. దీంతో ఎన్నికల సంఘం ఓటరు జాబితాలో అసాధారణమైన లోపాలు, నకిలీ ఓట్లు, ఒకే వ్యక్తికి బహుళ గుర్తింపులు వంటి సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో దేశవ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision - SIR) అనే ఓ వ్యవస్థను తీసుకురావాలని ఆలోచిస్తోంది.
ఎన్నికల సంఘం, దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను ప్రక్షాళన చేసి, స్వచ్ఛమైన జాబితాను రూపొందించాలనే లక్ష్యం అభినందనీయం. కానీ, ఈ ప్రక్షాళన కార్యక్రమం ఏకపక్షంగా, రహస్యంగా సాగితే దేశానికి మరింత ప్రమాదం. అందుకే, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) లాంటి సంస్థలు ఈ ఓటరు ప్రక్షాళన పారదర్శకంగా జరగాలి, లేకపోతే కొత్త సమస్యలు పుట్టుకొస్తాయని సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాయి.
నకిలీ ఓట్ల కారణంగా..
ఒక ప్రజాస్వామ్యంలో ఓటు అనేది కేవలం ఎన్నికల్లో ఉపయోగించే ఆయుధం మాత్రమే కాదు. అది పౌరుడికి ఉన్న అత్యంత పవిత్రమైన హక్కు. కొన్ని నకిలీ ఓట్లు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడమే కాదు, ప్రజల తీర్పును కూడా పక్కదారి పట్టిస్తాయి. ఒక నియోజకవర్గంలో కేవలం కొన్ని వందల ఓట్ల తేడాతో గెలుపోటములు నిర్ణయమయ్యే పరిస్థితుల్లో, నకిలీ ఓట్ల కారణంగా కచ్చితంగా ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేసే ప్రమాదం ఉంది. అయితే, ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపట్టాలనుకుంటున్న SIRలో భాగంగా లక్షల కోట్ల ఓటర్ల జాబితాను సమగ్రంగా సవరించడం, ప్రతి ఓటరు వివరాలను క్రాస్-వెరిఫై చేయడం సులభం కాదు. కానీ, సమగ్రంగా నిర్వహించాల్సిందే.. ఎందుకంటే ఓటరు జాబితా కోసమే కాకుండా భద్రతా అంశాల దృష్ట్యా దీనిని పకడ్బందీగా నిర్వహించాలి. ఎందుకంటే సరిహద్దు జిల్లాలైన బిహార్, పశ్చిమ బెంగాల్‌లో చొరబాటుదారులు అక్రమంగా దేశంలోకి చొరబడి, నకిలీ పత్రాలతో ఓటరు కార్డులను సంపాదించి, ఎన్నికల ప్రక్రియను పక్కదారి పట్టిస్తున్నారు. అందుకే పశ్చిమ బెంగాల్‌లో ఓట్ల దుర్వినియోగం, తరచుగా తెరపైకి వస్తుంటుంది. ఇది నేరుగా దేశ భద్రతతో ముడిపడి ఉంది. అందుకే ఎన్నికల కమిషన్ తీసుకోబోతున్న ప్రతి అడుగూ దేశ భద్రతను బలోపేతం చేసేదిగా ఉండాలి.
గోప్యతకు భంగం వాటిల్లకూడదు..
ఈ ఓటరు కార్డులు, కేవలం ఓటు వేయడానికి మాత్రమే ఉపయోగపడటం లేదు.. ఇవి పాస్‌పోర్ట్, ఆధార్ కార్డులతో పాటు ముఖ్యమైన గుర్తింపు పత్రాలుగా కూడా మారిపోయాయి. ఈ పత్రాల జారీలో లోపాలుంటే, ఇది దేశంలో అక్రమ వలసలకు, నేర కార్యకలాపాలకు ఊతమిచ్చినట్లవుతుంది. ఈ సాంకేతిక యుగంలో, ఓటరు జాబితాల ప్రక్షాళనకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే అవకాశాలున్నాయి. ముఖ గుర్తింపు (facial recognition), బయోమెట్రిక్ డేటా వంటి ఆధునిక సాధనాలను వాడి ఓటరు గుర్తింపును మరింత పకడ్బందీగా చేయవచ్చు. కానీ, ఈ సాంకేతికతతో పాటు సమాచార భద్రత, వ్యక్తిగత గోప్యత వంటి అంశాలు కూడా కీలకం. ఎందుకంటే, ఒకసారి ఈ డేటాను సేకరిస్తే, అది దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. అందుకే, ఈ సాంకేతికతను ఉపయోగించేందుకు ఒక పటిష్టమైన చట్టపరమైన, నైతికమైన నియమావళిని రూపొందించాలి. మనం 'స్వచ్ఛమైన' ఎన్నికల వ్యవస్థను కోరుకుంటే, చిరునామా సేకరించే వ్యవస్థ పారదర్శకంగా ఉండాలి. దీన్ని అదుపులోకి తేవాలంటే, ఆధార్ లాంటి వ్యవస్థను ఎన్నికల గుర్తింపు కార్డుతో అనుసంధానం చేయాలని అనేకసార్లు సూచనలు వచ్చాయి. అయితే ఈ ప్రక్రియలో భద్రత, గోప్యత అంశాలను విస్మరించకూడదు.
ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి..
ఎన్నికల కమిషన్ ఇప్పుడు తీసుకొస్తున్న SIR వ్యవస్థలో చిరునామా డేటాను ఎలా నిర్వహిస్తారు, దాన్ని ఎంత పారదర్శకంగా ఉంచుతారు అనే ప్రశ్నలకు సమాధానం కావాలి. లేకపోతే, నకిలీ ఓట్లను తొలగిస్తున్నామనే పేరుతో ఇష్టానుసారం ఓట్లను తొలగించే ప్రమాదం ఉంది. ADR వంటి సంస్థలు లేవనెత్తిన ప్రశ్నల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం, ఈ ప్రక్షాళన ప్రక్రియను ఎన్నికల సంఘం ఏకపక్షంగా కాకుండా, అన్ని వర్గాల భాగస్వామ్యంతో, న్యాయబద్ధంగా నిర్వహించాలనేదే. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు, ఓటరు జాబితాలను ప్రక్షాళన చేసేందుకు ఎన్నికల సంఘం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం కూడా పారదర్శకంగా ఉండాలని ప్రజలు, రాజకీయ పార్టీలు, పౌర సంస్థలు ఒకే గొంతుకతో డిమాండ్ చేయాలి. లేకపోతే ఈ జాబితాల ప్రక్షాళన అనేది కేవలం ఒక ప్రహసనంగా మారి, దేశ భద్రతకు మరిన్ని గండాలను సృష్టించవచ్చు. ఎన్నికల కమిషన్ ఒక స్వతంత్ర సంస్థగా దాని అధికారంతో పాటు జవాబుదారీతనాన్ని కూడా ప్రదర్శించాలి.
-డా.కట్కూరి
సైబర్ సెక్యురిటీ న్యాయ నిపుణులు
94909 34520






