- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాఠశాలల్లో పంతుళ్లతో పర్యవేక్షణలా...?
ఉపాధ్యాయుడు అంటే విద్యార్థులకు జ్ఞానం, నైపుణ్యాలు,మంచి అలవాట్లు నేర్పే వ్యక్తి. దేశ భవిష్యత్తుకు పునాది వేసే కీలక పాత్రధారి.

ఉపాధ్యాయుడు అంటే విద్యార్థులకు జ్ఞానం, నైపుణ్యాలు,మంచి అలవాట్లు నేర్పే వ్యక్తి. దేశ భవిష్యత్తుకు పునాది వేసే కీలక పాత్రధారి. విద్యార్థులకు సరైన మార్గంలో నడిపించే దీపస్తంభం లాంటివారు.వ్యక్తిత్వాన్ని,నైతిక విలువలను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తారు.దేశ భవిష్యత్తుకు పునాది వేసి, వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో సహాయపడతారు. విద్యార్థులలో ఉత్తమమైన లక్షణాలను ప్రోత్సహించి, దేశానికి సేవ చేసేలా ప్రేరేపించే మార్గదర్శకులు ఉపాధ్యాయులు.
కానీ నేటి విద్యావ్యవస్థలో ఉపాధ్యాయుడి యొక్క స్థానం ప్రశ్నార్ధకం ఉపాధ్యాయుడి ప్రథమ కర్తవ్యం గా భావించే బోధన తప్ప నేటి ఉపాధ్యాయుడు మిగిలిన కార్యక్రమాలన్నీ నిర్వహించడం ఆలోచించాల్సిన విషయం. చివరకు ఉపాధ్యాయులచే పర్యవేక్షణ బాధ్యతలు కూడా నిర్వర్తింపజేయడం కేవలం తెలంగాణ ప్రభుత్వానికే చెల్లిందనడంలో అతిశయోక్తి లేదు. సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు అనుముల రేవంత్ రెడ్డి గారి విద్యాశాఖ మంత్రిగా ఉన్న తరుణంలో ఇటువంటి దుస్థితి నెలకొనడం శోచనీయం.
మాపై టీచర్ల చేతే పర్యవేక్షణా?
పాఠశాలల పర్యవేక్షణను విద్యాశాఖ అధికారులు, డిప్యూటీ డిఈవోలు, మండల విద్యాధికారులు చేపట్టాల్సి ఉండగా రాష్ట్ర విద్యాశాఖ టీచర్లతో పాఠశాలల పర్యవేక్షణ చేయించాలని నిర్ణయించి అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీచేయడమే ఉపాధ్యాయవర్గంలో వ్యతిరేకతకు కారణమైనది. నిజానికి పాఠశాలల పర్యవేక్షణకు ఇప్పటికే విద్యాధికారులు, డీఈవోలు డిప్యూటీ విద్యాధికారులు, మండల విద్యాధికారులతో పాటు మండల నోడల్ ఆఫీసర్లు, కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు ఉండగా అది చాలదన్నట్లు మళ్ళీ కొత్తగా ఉపాధ్యాయుల బృందంతో పర్యవేక్షణలు చేయించటమేమిటని ఉపాధ్యాయ సంఘాలు,79 సంవత్సరాల చరిత్ర గల స్టేట్ టీచర్స్ యూనియన్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
బోధనకు చాలా దూరంగా టీచర్లు
ఇప్పటికే చాలామంది ఉపాధ్యాయులు డిప్యూటేషన్, ఫారిన్ సర్వీసుల పేర్లతో మండల విద్యా వనరుల కేంద్రం నుండి పాఠశాల విద్యాశాఖ కార్యాలయం వరకు బడులకు, బోధనకు దూరంగా పనిచేస్తున్నారు.మళ్ళీ పర్యవేక్షణ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండు వేలకు పైగా టీచర్లను బోధనకు దూరం చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. పర్యవేక్షణను వద్దనడంలేదు కానీ పర్యవేక్షణ ఎవరు చేయాలో వారే చేయాలిగానీ టీచర్లను పర్యవేక్షణకు పంపడంవల్ల ఆ ఉపాధ్యాయులు బోధనకు దూరం అవుతారని తద్వారా ఆ పాఠశాల విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని ఇటువంటి అనాలోచిత ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని ఎస్టీయూ ఇప్పటికే అధికారులకు ప్రాతినిధ్యం చేసినది.
సగంపైగా బోధనేతర పనులు
ఇప్పటికే పాఠశాలలో ఉపాధ్యాయులు రోజులో సగానికి పైగా బోధనేతర పనులతో సతమవుతున్నారు. విద్యార్థులకు ఫెసియల్ రికగ్నిషన్ యాప్ ద్వారా హాజరు,రాగి జావా,మధ్యాహ్న భోజనం,అల్పాహారం పంపిణీ అధికారులు అడిగే వివిధరకాల ప్రొఫార్మాలను నింపడం పంపడం తోటే సమయం సరిపోతుంది. ఇప్పుడు పర్యవేక్షణ పేరుతో కొంతమంది ఉపాధ్యాయులను నియమించడంతో ఉన్న ఉపాధ్యాయులపై అదనపు భారం పడనుంది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకుండా పోతుంది.
టీచర్ల కొరత.. భర్తీ ఎప్పుడు
ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇచ్చి,నూతన ఉపాధ్యాయుల నియామకం చేపట్టిన ప్రభుత్వం డిప్యూటీ విద్యాధికారులు, యం ఈ వోల పోస్టుల భర్తీకై తగిన నిర్ణయం తీసుకోవాలి. పక్క తెలుగు రాష్ట్రంలో వియమించినట్లు పరిపాలనకు ఒక అధికారి, అకడమిక్‌కు ఒక అధికారి అన్నట్లు ఇద్దరు యంఈవోలను నియమించాలి.ఉమ్మడి సర్వీసు రూల్స్ పేరుతో జాప్యం చేయడం వల్ల విద్యాశాఖకు తీరనినష్టం చేకూరుతుంది. ఇప్పటికే ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఉన్నది. ఇప్పుడు పర్యవేక్షణ పేరుతో మరికొంతమంది పాఠశాల్లో బోధనకు దూరమవుతారనేది వాస్తవం ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న విద్యావ్యవస్థను పరిరక్షించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.
సుధాకర్.ఏ.వి
స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (STUTS)
90006 74747






