- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చట్టం ఉంటేనే.. ఎమ్మెల్యే సీట్లు కేటాయిస్తారా? మహిళల హక్కులపై సుప్రీంకోర్టు జోక్యం
మహిళల రాజకీయ ప్రాతినిధ్యం పెంపు భారత ప్రజాస్వామ్యానికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పునాది మార్పు. ఇందుకోసమే మహిళా రిజర్వేషన్ చట్టం పార్లమెంట్ ఆమోదం పొందినప్పటికీ, జనగణన–డిలిమిటేషన్ వంటి షరతుల కారణంగా

మహిళల రాజకీయ ప్రాతినిధ్యం పెంపు భారత ప్రజాస్వామ్యానికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పునాది మార్పు. ఇందుకోసమే మహిళా రిజర్వేషన్ చట్టం పార్లమెంట్ ఆమోదం పొందినప్పటికీ, జనగణన–డిలిమిటేషన్ వంటి షరతుల కారణంగా దీని అమలు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో, నవంబర్ 11న సుప్రీంకోర్టు లేవనెత్తిన ‘తక్షణ అమలు ఎందుకు సాధ్యం కాదు?’ అన్న ప్రశ్న మహిళల హక్కులపై కొత్త చర్చకు దారితీసింది.
నవంబర్ 11న మన దేశ అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి ఒక కీలక ప్రశ్నను సంధించింది. భారత జాతీయ కాంగ్రెస్ మహిళా విభాగానికి చెందిన డాక్టర్ జయా ఠాకూర్ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భం గా ‘33% రిజర్వేషన్ లేకుండానే, లోకసభలోనూ, రాష్ట్రాల శాసనసభలలోనూ, మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం ఎందుకు సాధ్యపడదో?’ సుప్రీంకోర్టు తెలుసుకోగోరింది.
చట్టం చేసినప్పటికీ..
నిజానికి 2024 సాధారణ ఎన్నికల ముందే, 2023లోనే, ఇదే అభ్యర్థనతో జయాఠాకూర్ వేసిన ఇలాంటి వ్యాజ్యాన్ని అది కార్యనిర్వాహక శాఖ పరిధిలోకి వస్తుందని ఉన్నత న్యాయ స్థానం విచారణకు స్వీకరించలేదు. కానీ, ఇప్పుడు కోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసి, ఈ విషయాన్ని పరిశీలించేందుకు అంగీకరించిన న్యాయమూర్తులు బి.వి. నాగరత్న, ఆర్.మహాదేవన్‌ల ధర్మాసనం ప్రభుత్వాన్ని వివరంగా తమ స్పందన సమర్పించమని ఆదేశించింది. మహిళల రిజర్వేషన్‌కు సంబంధించిన బిల్లు లోకసభలో 2023 సెప్టెంబర్ 20న, రాజ్యసభ 2023 సెప్టెంబర్ 21న ఆమోదించగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2023 సెప్టెంబర్ 28న సంతకం చేశారు. దీనితో ఈ బిల్లు ‘నారీ శక్తి వందన్ అధినయం- 2023 చట్టం అయింది.’ ఈ చట్టం ప్రకారం లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలలో 33 శాతం సీట్లు మహిళలకు కేటాయిస్తారు. ప్రతి ఎన్నికల అనంతరం ఈ రిజర్వుడ్ స్థానాలను రోటేషన్ పద్ధతిలో మారుస్తారు. అయితే ఈ చట్టం అమలు తక్షణం జరగదు. జనాభా లెక్కలు పూర్తవ్వడం, నియోజకవర్గాల పరిధి పునర్విభజన పూర్తయ్యే వరకు దీని అమలు వాయిదా పడుతుంది. దీంతో, వాస్తవంగా ఈ చట్టం ప్రభావం 2029 ఎన్నికల తర్వాత మాత్రమే కనబడవచ్చని పలువురి అంచనా.
ఇది మహిళల హక్కుల నిరాకరణే!
అయితే, జనగణన, పరిధి పునర్విభజన తర్వాత మాత్రమే చట్టాన్ని అమలు చేయాలన్న ఆర్టికల్ 334 Aలో ఉన్న నిబంధన రాజ్యాంగ విరుద్ధమని, ‘అవసరం లేని అడ్డంకి’గా మారి, రాజ్యాంగ సవరణ అమలులో నిరవధిక ఆలస్యం జరుగుతోందని, సవరణ ఉద్దేశాన్ని దెబ్బతీస్తోందని పిటిషనర్ వాదన. ఉదాహరణగా 73వ, 74వ రాజ్యాంగ సవరణలు (స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్), ఆర్థికంగా బలహీన వర్గాల ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వంటి సవరణలు జన గణన కోసం ఆగకుండా వెంటనే అమల్లోకి వచ్చాయని పిటిషనర్ గుర్తు చేసింది. అంతేకాకుండా, ఇలా చేయడం మహిళల తక్షణ రాజకీయ హక్కులను నిరాకరించడమనీ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15 (3) నిబంధనలకు వ్యతి రేకమని పిటిషినర్ వాదన. అందుకే ప్రస్తుత నియోజకవర్గాల ప్రకారమే ఈ చట్టం తక్షణ అమలు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టమని ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ అభ్యర్థన.
ముందు పార్టీలే అవకాశమివ్వాలి!
ఈ విచారణ సందర్భంగా న్యాయమూర్తి నాగరత్న సామాజిక న్యాయం అనేది ‘భవిష్యత్తులో’ ఇవ్వాల్సిన వాగ్దానం కాదనీ, అది ‘ఇప్పుడే’ అమలులోకి రావాలనీ, మహిళలను నాయకత్వ వ్యవస్థలో భాగం చేయాలంటే వారికి అవకాశం ‘మొదట’ ఇవ్వాలి, తర్వాత వారు ఎలా ఎదుగుతారో సమాజం చూస్తుందన్న అభిప్రాయాలు వ్యక్త పరిచారు. రాజ్యాంగపరంగా ఇవ్వడం కంటే ముందుగానే ‘రాజకీయ పార్టీలే మహిళలకు అవకాశం ఇవ్వడం మొదలు పెట్టాలి. ఎన్నికల్లో స్థానాల కేటాయింపు విధానంలోనే మార్పు రావాలి’ అని హితవు పలికారు. పరిధి పునర్విభజన పూర్తయ్యే వరకు మధ్యంతర రిజర్వేషన్ లేదా కోటా మెకానిజం తీసుకురావచ్చు.
ఏకగ్రీవంగా ఆమోదించినప్పటికీ..
అయితే, ఈ విషయంలో ప్రభుత్వ వైఖరి మారుతుందని ఆశించడం దురాశే అనిపిస్తుంది. ఎందుకంటే 2024 ఎన్నికల ముందు తాయిలంలాగా, తక్షణ అమలుకు ఆటంకాలు ఏర్పరుస్తూనే ఈ చట్టం రూపొందించబడింది. ఇది పోస్ట్-డేటెడ్ చెక్. ఈ హిత వాక్యాలు రాజకీయ పక్షాల తలకెక్కు తాయని కూడా అనుకోం. ఎందుకంటే, ఈ బిల్లుని రాజ్యసభ, లోక్‌సభ ఏకగ్రీవంగా ఆమోదించినా ఆ తర్వాత జరిగిన 2024లో లోక్‌సభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏ ప్రధాన జాతీయ రాజకీయ పక్షం కూడా 33 శాతం మహిళా అభ్యర్థులను పోటీలో నిలపలేదు. ఈ పరిస్థితుల్లో, మహిళల హక్కులను ‘భవిష్యత్తు సౌకర్యాల’ పేరుతో వాయిదా వేయకుండా.. తక్షణ అవకాశాలుగా చూడాలని సుప్రీంకోర్టు ధర్మాసనం పరోక్షంగా చాటి చెప్పింది.
చివరగా చట్టాన్ని అమలు చేయడంపై ప్రభుత్వాల సంకల్పం అనిశ్చితంగానే ఉన్నా, న్యాయస్థానం నుంచి వచ్చే స్పష్టమైన మార్గదర్శకాలు మహిళల రాజకీయ ప్రవేశానికి కనీసం ఒక న్యాయపరమైన దారిదీపాన్ని ఇవ్వగలవు.
-మల్లాప్రగడ రామారావు
99898 63398






