- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చైనా- ఇండియా మైత్రీ బంధం.. ఇక బలపడేనా?
ప్రపంచ రాజకీయ వాతావరణం వేగంగా మారిపోతున్న తరుణంలో, ఆసియాలోని రెండు అతిపెద్ద దేశాలైన భారతదేశం

ప్రపంచ రాజకీయ వాతావరణం వేగంగా మారిపోతున్న తరుణంలో, ఆసియాలోని రెండు అతిపెద్ద దేశాలైన భారతదేశం, చైనాల మధ్య సంబంధాలు కొత్త మలుపు తిరిగాయి. భారతీయ ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకంగా 50% టారిఫ్‌ల భారం మోపిన వేళ.. ఎస్‌సీఓ వేదికగా భారత్, చైనా మైత్రీబంధం బలపడటం వేగంగా మారుతున్న అంతర్జాతీయ పరిణామాలకు దర్పణం పట్టింది. దాదాపు ఏడేళ్ల తర్వాత మోడీ చైనాలో పర్యటించడం విశేషం. గల్వాన్ ఘటన తర్వాత ఉద్రిక్తతకు నిలయంగా మారిన సరిహద్దు సమస్యను పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వంతో పరిష్కరించుకునేందుకు భారత్, చైనా ముందుకొచ్చాయి.
వాణిజ్య బంధానికి కొత్త ఊపు..
షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ) శిఖరాగ్ర సదస్సు సన్నాహక భేటీలో భాగంగా భారత ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భారత్-చైనా సంబంధాల్లో పరస్పర మైత్రి బంధం బలపడడం ఆర్థిక స్వావలంబన, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి కోసం ఆసియా దేశాలు వెతుకుతున్న దారిని ప్రతిబింబిస్తుంది. భారతీయులకు టూరిస్ట్ వీసాలు జారీ చేయడానికి చైనా ముందుకు రావడం, నేరుగా విమాన సర్వీసులను పునరుద్ధరించే ప్రక్రియ మొదలవడం వంటి నిర్ణయాలు పటిష్ట ద్వైపాక్షిక సంబంధాలకు దోహద పడతాయి. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు సంకీర్ణ ప్రపంచ రాజకీయాల నడుమ భారత్-చైనా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలపరుస్తున్నాయి.
వ్యూహాత్మక స్వతంత్రతపై స్పష్టత
ఈ భేటీలో ఒక ముఖ్యమైన అంశం మూడో దేశ జోక్యాన్ని అనుమతించకుండా, పరస్పర వ్యూహాత్మక సార్వభౌమత్వాన్ని గౌరవించుకోవాలని ఇరుదేశాల మధ్య అంగీకారం ఏర్పడింది. ఇది భారతదేశం, చైనా రెండూ తమ స్వతంత్రతను కాపాడుకుంటూనే, పరస్పర ప్రయోజనాల కోసం కలిసి పని చేయాలన్న ధృఢ సంకల్పానికి సంకేతం. అలాగే ఈ సమావేశంలో చర్చకు వచ్చిన మరో అంశం, చైనా కంపెనీలకు భారత్‌లో అవకాశాలు కల్పించడం ద్వారా విద్యుత్ వాహన రంగాన్ని వేగంగా అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టడం. భారతదేశంలో పెరుగుతున్న ఇ-వాహన అవసరాన్ని తీర్చడంలో ఈ సహకారం కీలక పాత్ర పోషించగలదు.
బ్రిక్స్, ఎస్‌సీఓలో భారత పాత్ర
ఇరుదేశాల మధ్య పునర్నిర్మిత మైత్రి వాతావరణం, భారత్‌కు బ్రిక్స్, ఎస్‌సీఓ వంటి అంతర్జాతీయ వేదికలపై మరింత బలమైన నాయకత్వాన్ని అందించే అవకాశాన్ని తెలియజేస్తుంది. చైనా నుండి వస్తున్న మద్దతు, భారతదేశం విశ్వవ్యాప్తంగా ప్రభావాన్ని పెంచే అవకాశాలను ప్రసారం చేస్తోంది. పంచశీల సూత్రాల ఆధారంగా ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించగలిగితే ప్రాంతీ య స్థిరత్వానికి దోహదం చేస్తాయి.
ఘర్షణల కన్నా మైత్రి మేలే!
ఈ భేటీ ద్వారా భారత్-చైనా నాయకులు ప్రపంచానికి పంపిన సందేశం స్పష్టమైనది. ఘర్షణల కన్నా మైత్రి మేలని, వ్యత్యాసాల కన్నా సహకారం ప్రధానమని, అనుమానాల కన్నా విశ్వాసం మిన్న అని, శతాబ్దానికి ఒక్కసారి వచ్చే ఈ తరహా అంతర్జాతీయ మలుపులో, ఆసియా దేశాల మధ్య సుస్థిరత, శాంతి, వ్యాపార ప్రయోజనాలు ప్రాధాన్యత పొందాలని కోరుకుంటే, ఇటువంటి నిర్ణయాలు ఒక నూతన దిశను సూచిస్తాయి. భారత్-చైనా మైత్రి బంధం ఇప్పటివరకు అనేక అడ్డంకులు ఎదుర్కొంది. అయితే, ఇప్పుడు ఆ బంధాన్ని భవిష్యత్ తరాల సంక్షేమం దృష్టిలో ఉంచుకుని మలచాల్సిన సమయం వచ్చింది. రాజకీయాలను పక్కన పెట్టి ప్రజల అవసరాలకు పూరకంగా వ్యవహరించగలిగితే, భారత్-చైనా బంధం కేవలం ద్వైపాక్షికంగా కాక, ప్రపంచ శాంతికి మార్గదర్శకంగా నిలవగలదు.
-వాడవల్లి శ్రీధర్
99898 55445






