బీఆర్ఎస్ ఈ సభతోనైనా.. పునర్వైభవం సాధించేనా?

by Ravi |   (  Updated:2025-04-27 01:30:59  IST  )

కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా 2001లో ఏర్పడిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి.. 2022లో

బీఆర్ఎస్ ఈ సభతోనైనా.. పునర్వైభవం సాధించేనా?
X

కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా 2001లో ఏర్పడిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి.. 2022లో పార్టీ పేరును బీఆర్ఎస్‌‌గా మార్చకుంది. పార్టీ ఏర్పాటై 25 సంవత్సరాలైన సందర్భంలో రజతోత్సవ వేడుకలు నేడు జరగబోతున్నాయి. ఈ వేడుకల్లో భవిష్యత్‌లో ఆ పార్టీ గమనం ఎటువైపు ఉండబోతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.

గులాబీ పార్టీ ఏర్పాటుకు ముందు.. యువజన కాంగ్రెస్ నాయకుడిగా కేసీఆర్ రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి సిద్దిపేట నుండి పోటీ చేసి ఓడిపోయినా.. 1985లో మళ్ళీ ఎన్నికలు జరిగితే సిద్దిపేట నుండి టీడీపీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు.. 1997లో చంద్ర బాబు హయాంలో మంత్రిగా, 1999లో డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టారు.

పార్టీ ఏర్పాటైన తొలి ఏడాదిలోనే..

అప్పటికే ప్రత్యేక తెలంగాణ కోసం కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నా సాధ్యం కాకపోవడంతో.. సొంత రాజకీయ పార్టీ పెట్టడానికి కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవితో పాటు టీడీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీని 2001 ఏప్రిల్ 27న ఏర్పాటు చేశారు. పార్టీ ఏర్పాటైన తొలి ఏడాదిలోనే వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీలను గెలిచి అప్పటి వరకు తెలంగాణాలో బలంగా ఉన్న టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు టీఆర్ఎస్ సవాల్ విసిరింది.

కేసీఆర్ ఆమరణ దీక్ష.. పెను మలుపు

2004 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో.. 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నా అది తెలంగాణ కోసమే అన్నట్లుగా ప్రచారం చేయడంలో గులాబీ పార్టీ సఫలం అయింది. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణంతో సీఎంగా రోశయ్య పదవీ బాధ్యతలు స్వీకరించిన సమయంలోనే హైదరాబాద్ ఫ్రీ జోన్ అంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడం వల్ల విద్యార్థులు, ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. వీరు చేస్తున్న పోరాటాలకు మద్దతుగా ఇక తెలం గాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా కేసీఆర్ 2009 నవంబర్ 29న ఆమరణ దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు.. దీక్షకు కూర్చున్న రోజే పోలీసులు అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించారు. అదే రోజు సాయంత్రం కేసీఆర్ దీక్ష విరమించినట్లు వార్తలు రాగానే.. తెలంగాణ పౌర సమాజం ముఖ్యంగా విద్యార్థులు,యువత ఆందోళనలు చేపట్టారు.

దశాబ్దాల తెలంగాణ కల సాకారం

దీంతో అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలైందని డిసెంబర్ 9న ప్రకటించడం, సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళనల నేపథ్యంలో డిసెంబర్ 23న మరొక ప్రకటన, తర్వాత 2010 లో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు, ఇన్ని సంఘటనల మధ్య ఉద్యమంలో శ్రీకాంతాచారి, వేణుగోపాల్ రెడ్డి, సిరిపురం యాదయ్య, కిష్టయ్య, యాదిరెడ్డి లాంటి వందలాది అమరుల త్యాగాల పునాదుల మీద, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ , ప్రతిపక్ష బీజేపీలు మద్దతు ఇవ్వడం వల్ల సీమాంధ్ర ఎమ్మెల్యేలు రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించినా రాజ్యాంగంలోని 3వ ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్ ఆమోదం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆరు దశాబ్దాల ప్రజల ఆకాంక్ష నెరవేరింది.

ప్రత్యామ్నాయమే లేని దశ

2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యమ పార్టీగా బరిలో దిగిన టీఆర్ఎస్ 63 సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకుని కేసీఆర్ మొదటిసారి సీఎంగా బాధ్యతలను స్వీకరించారు. మొదటి విడతలో జిల్లాల పునర్విభజన, సంక్షేమ పథకాలు, ప్రాజెక్టుల నిర్మాణం వంటి వాటిపై దృష్టి సారించారు. ఈ సమయంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగలేకపోయాయి. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కాంగ్రెస్ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేయడం వంటి కారణాలు టీఆర్ఎస్‌కి కలిసొచ్చి 88 సీట్లు గెలుచుకుని రెండోసారి అధికారాన్ని చేపట్టేలా చేశాయి.

టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ వరకూ...

ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు అంటూ టీఆర్ఎస్‌గా ఉన్న పార్టీ పేరును బీఆర్ఎస్‌గా నామకరణం చేసి కొత్త పేరును తెరమీదకు తెచ్చారు. బీజేపీ,కాంగ్రెసేతర కూటమిగా ఏర్పడాలని దేశవ్యాప్తంగా పర్యటించి ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. అయితే ఇదంతా పెద్దగా ప్రభావం చూపలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. తదనంతరం 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటును కూడా బీఆర్ఎస్ గెలవలేకపోయింది. ఇంత ఘోర వైఫల్యం పార్టీ ఏర్పాటైనప్పటి నుండి రాలేదు.

అధికారమే పరమావధిగా ఎత్తులు..

ఆర్థిక వనరుల లేమి, హామీల అమలులో జాప్యం, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం వల్ల కేంద్రం నుండి రావాల్సిన నిధులు సకాలంలో రాకపోవడం, కాంగ్రెస్ లీడర్లు, కేడర్ మధ్య సమన్వయ లోపం ఉండటం వంటి అంశాలు బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తులో కలిసి వచ్చే అవకాశం లేకపోలేదు. అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు మూడున్నర ఏండ్ల సమయం ఉంది. రానున్న రోజుల్లో గులాబీ పార్టీ పుంజుకుని మళ్లీ అధికారాన్ని చేపట్టే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్తుంది.

(నేడు బీఆర్ఎస్ రజతోత్సవాల సందర్భంగా)

- డాక్టర్ అశోక్ మంద

ఉస్మానియా యూనివర్సిటీ

99590 46499

Next Story