ఏఐ వల్ల నూతన వలసవాదం వస్తుందా?

by Ravi |   (  Updated:2025-05-21 01:00:23  IST  )

మనం కృత్రిమ మేధస్సుతో నడిచే పునరుజ్జీవన యుగం అంచున ఉన్నామా లేక అసమానతలు, హరించుకుపోయిన స్వేచ్ఛలతో

ఏఐ వల్ల నూతన వలసవాదం వస్తుందా?
X

మనం కృత్రిమ మేధస్సుతో నడిచే పునరుజ్జీవన యుగం అంచున ఉన్నామా లేక అసమానతలు, హరించుకుపోయిన స్వేచ్ఛలతో నిండిన భవిష్యత్తులోకి నిద్రమత్తులో నడుస్తున్నామా? ఇటీవల విడుదలైన 2025 మానవాభివృద్ధి నివేదిక ఈ ప్రశ్నను ఎలాంటి శషభిషలు లేకుండా సూటిగా సంధించింది. అంతే కాకుండా కృత్రిమ మేధస్సు మానవ అభివృద్ధిపై, అసమానతలపై చూపగలిగే ప్రభావాన్ని గురించి విపులంగా చర్చించింది.

కృత్రిమ మేధస్సు లేదా ఏఐ. ఇది మనుషుల్లా ఆలోచించే, నేర్చుకునే, నిర్ణయాలు తీసుకునే సాంకేతికత. ఇది ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలను మార్చగల శక్తివంతమైన సాధనం. 21వ శతాబ్దం రెండవ శకంలో, మానవ అభివృద్ధిని కృత్రిమ మేధస్సు ఎంతగానో ప్రభావితం చేయబోతోంది. అయితే ఈ శక్తి సమానత్వానికి మార్గం చూపుతుందా? లేక అసమానతలను శాశ్వతంగా కదిలించలేని గోడగా మార్చుతుందా? అనేది ఇప్పుడు అందరినీ పీడిస్తున్న ప్రశ్న. ఇప్పటికే ఉన్న అన్యాయాలను, విభేదాలను ఎదుర్కోలేకపోతే, ఏఐ వాటిని మరింతగా పెంచే ప్రమాదం ఉందని ఈ నివేదిక కుండ బద్దలు కొట్టింది.

భారతదేశం... విస్మయకరమైన విభజన!

ఒకవైపు ఏఐ శక్తిని వినియోగించుకుంటూ పురోగమించే దేశాలు, మరోవైపు అదే సాంకేతికత వలన మరింత వెనుకబడిపోతున్న దేశాలు.. ఇలా ఆధునిక పరిజ్ఞానాన్ని కొద్ది దేశాలు లేదా వర్గాలు మాత్రమే నియంత్రించే స్థితి వస్తే.. ఈ పరిస్థితి నూతన వలసవాదానికి దారి తీస్తుందేమో అనే భావన ప్రజల్లో ప్రబలుతోంది. ఓ నివేదిక ప్రకారం ఒకవైపు భారతదేశం ప్రపంచంలో అత్యధికంగా ఏఐ నైపుణ్యం కలిగిన ప్రజలను కలిగిన దేశంగా ఎదుగుతోంది. యువతలో ఈ పరిజ్ఞానం వేగంగా పెరుగుతోంది. భారతదేశంలోని పట్టణాల్లో ఉన్న విద్యార్థులు, సాంకేతిక నిపుణులు ఏఐలో విప్లవం సృష్టించగల సామర్థ్యం కలిగి ఉన్నారు. కానీ ఇదే సమయంలో, గ్రామీణ ప్రాంతాలు, నిరుపేదలు, గిరిజన సమాజాలు, తక్కువ విద్య కలిగిన వర్గాలు డిజిటల్ విభజన వలయంలో చిక్కుకుపోయాయి. తక్కువ విద్య కలిగిన ప్రజలకు ఇంటర్నెట్ ప్రాప్తి తక్కువగా ఉంది. దీని వల్ల ఏఐ ఆధారిత ఆరోగ్య సేవలు, విద్యా శిక్షణలు, సంక్షేమ పథకాలు ఈ వర్గాల వరకు చేరడం అసాధ్యం ఔతుంది. అంతేగాక, మహిళలలో ఏఐ వినియోగం చాలా తక్కువగా ఉండటం కూడా లింగ అసమానతలకు దోహదం చేస్తోంది.

ఉన్నవాళ్లకే మరిన్ని అవకాశాలు..

ఏఐ అధికంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు, అది తక్కువ నైపుణ్యాలతో చేసే ఉద్యోగాలను ఆటోమేట్ చేస్తున్నది. దీనివల్ల అసంఘటిత రంగంలోని పనిచేసే వర్గాలు... రోజువారీ కార్మికులు, కస్టమర్ సర్వీస్, డేటా ఎంట్రీ, డాక్యుమెంటేషన్ వంటి పనులు చేసే ప్రజలు త్వరితంగా ఉపాధిని కోల్పోయే ప్రమాదంలో ఉన్నారు. అదే సమయంలో, ఏఐతో కలిసి పని చేయగలిగే నైపుణ్యాలు ఉన్నవారు (ఉదాహరణకు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, డిజైన్ అనలిస్టులు, డేటా సైంటిస్టులు) మాత్రం ఏఐ వల్ల తమ పని సామర్థ్యాన్ని పెంచుకుంటున్నారు. ఇది “ఉన్నవాళ్లకే మరిన్ని అవకాశాలు, లేని వాళ్లకు మరింత వెనుకబాటుతనమే” అనే పరిస్థితిని మరింత పెంచుతుంది.

ఏఐ పట్ల భారత దృక్పథం

ఈ అసమానతలపై విజయం సాధించాలంటే, నివేదిక సూచిస్తున్న మూడు మార్గాలను భారతదేశం తీవ్రంగా పరిగణించాలి. ఒకటి ఏఐను మానవ నైపుణ్యాలకు తోడ్పడేలా వినియోగించే విధానాలు రూపకల్పన చేయాలి. ఇది ఉద్యోగాలను తొలగించే దిశగా కాకుండా, మన నైపుణ్యాలను మరింత అభివృద్ధి చేసే దిశగా పనిచేయాలి. రెండు ఏఐ ఆధారిత ఆవిష్కరణలను సామాజిక ప్రయోజనాలు.. ముఖ్యంగా ఆరోగ్యం, విద్య, సంక్షేమ రంగాలలో మలచాలి. మూడు పేదలు, మహిళలు, గిరిజనులు, యువత ప్రతి ఒక్కరికి ఏఐను ఉపయోగించగల నైపుణ్యాలను అందించేలా పెట్టుబడి పెట్టాలి.

కీలక మలుపులో భారత్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక సాధనం మాత్రమే. దీన్ని ఎలా ఉపయోగించాలో నిర్ణయించేది మనమే’ అన్న విషయం గుర్తు పెట్టుకోవాలి. భారతదేశం ప్రస్తుతం కృత్రిమ మేధస్సు (ఏఐ) విప్లవాన్ని ఎదుర్కొంటున్న ఒక కీలక మలుపు వద్ద నిలబడి ఉంది. ఈ టెక్నాలజీని మానవ హక్కులు, సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువలు వంటి ప్రాథమిక అంశాలతో సమన్వయం చేసినప్పుడే నిజమైన డిజిటల్ పురోగతికి దారి తీస్తుంది. అలా కాని పక్షంలో అది అసమానతలు పెంచి, స్వేచ్ఛ హరించిపోయే సమాజానికి దారితీసే ప్రమాదాన్ని కలిగించవచ్చు. ఇది మన సమాజం, ఆర్థిక వ్యవస్థ, ప్రజాస్వామ్య భవిష్యత్తును ప్రభావితం చేసే ఘట్టం. కాబట్టి ఏఐను సమగ్ర దృష్టితో ఆలోచిస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.

-చక్రధర్ బుద్ధ

పరిశోధకులు, లిబ్టెక్ ఇండియా

92465 22344

Next Story