ఆర్ఎస్ఎస్ రిజిస్ట్రేషన్‌పై రాద్ధాంతమా?

by Ravi |   (  Updated:2026-07-21 01:15:52  IST  )

ఆర్ఎస్ఎస్ రిజిస్ట్రేషన్‌పై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాజకీయ వివాదం, ఆర్ఎస్ఎస్ సేవా కార్యక్రమాలపై మద్దతుదారుల వాదనలు, ఈ అంశంపై కొనసాగుతున్న చర్చపై వ్యాసం..

ఆర్ఎస్ఎస్ రిజిస్ట్రేషన్‌పై రాద్ధాంతమా?
X

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయ దుమారం రేపాయి. ప్రభుత్వం వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన చేసిన సూచనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విమర్శకులు దీనిని ఒక సాధారణ పరిపాలనా అంశంగా చూస్తుంటే, ఆర్ఎస్ఎస్ మద్దతుదారులు మాత్రం దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు, సామాజిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థపై రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలుగా అభివర్ణిస్తున్నారు.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దేశభక్తికి, త్యాగనిరతికి కేరాఫ్ చిరునామా. ఆ సంస్థ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా వేలాది హిందూ సమ్మేళనాలను నిర్వహించడంతో, సంఘ్ మనుగడ, కార్యదక్షత, క్రమశిక్షణ, దేశభక్తి, త్యాగనిరతిని వ్యతిరేకించే హిందూ వ్యతిరేక శక్తులతో పాటు, మైనారిటీల సంతుష్టీకరణనే రాజకీయ ధ్యేయంగా ముందుకు సాగే కాంగ్రెస్ నాయకులు కూడా దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొన్నారు..

దళిత నాయకుడితో విమర్శలు.. వారి వ్యూహమే!

ఆర్ఎస్ఎస్ సంస్థ రాజకీయ క్షేత్రం భారతీయ జనతా పార్టీ కేంద్రంలోనూ, అనేక రాష్ట్రాలలో అధికార పగ్గాలను చేతబట్టడంతో కాంగ్రెస్ నాయకులకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకూ, ఆయన కుమారుడు కర్ణాటక రాష్ట్ర హోం మంత్రి ప్రియాంక్ ఖర్గేకూ చాలా ఇబ్బందికరంగా ఉంది. కులాల వారిగా, భాషల వారీగా, ప్రాంతాల వారీగా, సాంప్రదాయాల వారిగా విడిపోయిన హిందూ సమాజం ఆధ్యాత్మికంగా, ధార్మికపరంగా, మతపరంగా ఏకం కావడం కుహనా లౌకిక వాద హిందూ రాజకీయ నాయకులకు సుతరాం ఇష్టం ఉండదు.. ఇక ఆర్ఎస్ఎస్‌ను దూషించడానికి దళిత సమాజానికి సంబంధించిన మల్లికార్జున ఖర్గేను ఆయన కుమారుడిని కాంగ్రెస్ పార్టీ ముందు ఉంచడం వెనుక వ్యూహాత్మక ప్రణాళిక ఉంది. వారి విమర్శలకు ప్రతి విమర్శలు హిందుత్వ సంస్థల నుండి వచ్చినప్పుడు 'దళిత స్వాభిమాన కులం కార్డు'వాడుకోవచ్చు అనే దూరదృష్టి ఆ పార్టీకి ఉంది. ఆర్ఎస్ఎస్ సంస్థకు రిజిస్ట్రేషన్ లేదని, రిజిస్ట్రేషన్ లేకుండా కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారని, ఆ సంస్థకు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలని మీడియా ముందు అనేకమార్లు ప్రియాంక ఖర్గే వాపోవడం విచిత్రంగా ఉంది.

సేవల సమయంలో రిజిస్ట్రేషన్ గుర్తు రాలేదా?

దేశ భద్రత, రక్షణకు సంబంధించిన క్లిష్ట పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు విశేష సేవలు అందించారు. 1947లో కశ్మీర్‌పై పాకిస్తాన్ దాడి సమయంలో శ్రీనగర్ విమానాశ్రయంలోని మంచును తొలగించి భారత సైన్యం చేరేందుకు సహకరించారు. కశ్మీర్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి రాజా హరిసింగ్‌ను ఒప్పించడానికి ఆర్ఎస్ఎస్ రెండవ అధ్యక్షులు గురూజీని నాటి హోం మంత్రి పటేల్ ప్రత్యేక విమానంలో శ్రీనగర్‌కు పంపించిన విషయం ఈ దేశంలోని యువతకు తెలియనే తెలియదు.. 1962 చైనా యుద్ధ సమయంలో అనేక పట్టణాల్లో ట్రాఫిక్ నిర్వహణ కార్యక్రమాలు, 1971 బాంగ్లాదేశ్ అవతరణ కోసం మన సైన్యం జరిపిన ఆపరేషన్ కార్యక్రమాల్లో స్వయం సేవకులు సహాయ సహకారాలు అందించారు. వరదలు, భూకంపాలు, రైలు ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రభుత్వం కంటే ముందుండి బాధితులకు నిరుపమాన సేవలు అందించడం ఆ సంస్థ కార్యకర్తలకు మాత్రమే సాధ్యమవుతుంది. దివిసీమ ఉప్పెన దుర్ఘటనలో కుళ్ళిపోయిన శవాలను ఎత్తడానికి పోలీసు బలగాలు, సైన్యం ముందుకు రాని సమయంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అందించిన నిస్వార్థ సేవలు దివిసీమ గ్రామ ప్రజలకు మాత్రమే తెలుసు.. పైన తెలిపిన అన్ని సేవా కార్యక్రమాలు చేసే సమయంలో సేవలు పొందే బాధితులు గానీ, అప్పుడున్న ప్రభుత్వాలు గానీ 'రిజిస్ట్రేషన్ లేని సంస్థ కార్యకర్తలు ఈ నిరూపమాన సేవలు ఎలా అందిస్తారు?' అని ప్రశ్నించి ఉంటే బాగుండునేమో!

ఆర్ఎస్ఎస్ ఆలోచనతో.. ఎన్నో సేవా సంస్థలు..

ఇస్లాం సంస్కృతి విషయంలో భావసారుప్యమున్న నెహ్రూ మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ పట్ల వ్యతిరేక వైఖరి కలిగి ఉండేవారు.. ఆర్ఎస్ఎస్ గురువుగా స్వీకరించిన భగవద్వజాన్ని భారతదేశంలో ఎగరకుండా చేస్తానని తీవ్రమైన పదజాలంతో ఆయన మాట్లాడిన మాటలు ఈ దేశంలోని చాలామందికి తెలియదు. అయితే 1962 చైనా యుద్ధం అనంతరం ఆయన వైఖరిలో మార్పు వచ్చి, 1963 గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో 3,000 మంది ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు పాల్గొనేలా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ చారిత్రక విషయాలు తెలియకుండా ఆర్ఎస్ఎస్‌పై విమర్శలు చేయడం సరైంది కాదు.. దేశ భద్రత, సమైక్యత, తీవ్రవాద సమస్యలపై అవగాహన లేకుండానే కాంగ్రెస్ నాయకులు ఆర్ఎస్ఎస్‌ను విమర్శించడం తమ పార్టీకే నష్టం. ఆర్ఎస్ఎస్ ఆలోచనలతో ప్రేరణ పొందిన అనేక మంది సేవా సంస్థలను స్థాపించి సమాజ సేవ చేస్తున్నారని, వనవాసి కళ్యాణ ఆశ్రమం, వివిధ ఉపాధ్యాయ సంఘాలు, విద్యా భారతి వంటి సంస్థలు అందుకు ఉదాహరణలు. ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా దాతల సహకారంతో వేలాది పాఠశాలలు, వందలాది సేవా సంస్థలు ఆర్ఎస్ఎస్ ప్రేరణతో పనిచేయడం దేశానికి ఒక వరం. ఇవేవి ప్రియాంక్ ఖర్గేకు తెలియదు..

రిజిస్ట్రేషన్.. ఆర్ఎస్ఎస్‌కు అవసరం లేదు!

ఇక ఏదైనా ఒక సంస్థ రిజిస్టర్ చేయించుకోవడానికి ఆ సంస్థ ప్రభుత్వం నుండి కొన్ని రక్షణలను, సహాయ సహకారాలను ఆశించడం కోసమే అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. కానీ ఆర్ఎస్ఎస్ తాను అందించిన సేవలకు ప్రతిఫలం ఆశించదు.. సంస్థను నడుపుకోవడానికి ప్రభుత్వం నుండి నిధులను కోరదు.. ఆ సంస్థ నడవడానికి ఆ సంస్థ కార్యకర్తలే గురుదక్షిణ రూపంలో నిధిని సమకూర్చుకుంటారు. ఈ సంస్థ పనితీరును దగ్గర ఉండి చూసేవారికి ఆ సంస్థకు రిజిస్ట్రేషన్ అవసరమా? లేదా? అనే విషయాన్ని తేల్చగలరు. ఇక చివరగా సనాతన భారతీయ సంస్కృతికి వారసులుగా నిలిచిన హిందువులను పరాక్రమవంతులుగా, సాహసవంతులుగా, దేశభక్తులుగా మలిచే ఆర్ఎస్ఎస్‌ను అనవసరంగా దూషించే ప్రయత్నం సూర్యుని వైపు తిరిగి ఉమ్మి వేయడం లాంటిదే.

-ఉల్లి బాలరంగయ్య,

94417 37877

Next Story