- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలో ఆత్మహత్యల కలకలం..
భారతదేశంలో పెరుగుతున్న ఆత్మహత్యల వెనుక ఉన్న ప్రధాన కారణాలు.. మానసిక ఆరోగ్య ప్రాధాన్యం..

భారతదేశంలో ప్రతి సంవత్సరం వేలాది మంది వివిధ కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నారు. విద్యార్థులు పరీక్షల్లో విఫలమైనందుకు, యువత ఆన్‌లైన్ గేమ్స్ లేదా ఆర్థిక సమస్యల కారణంగా, రైతులు అప్పుల భారం వల్ల, ఉద్యోగులు పని ఒత్తిడితో, గృహిణులు కుటుంబ కలహాల వల్ల, మరికొందరు మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు.. ఇది కేవలం వ్యక్తిగత విషాదం మాత్రమే కాదు.. కుటుంబాలను, సమాజాన్ని, దేశ అభి వృద్ధిని ప్రభావితం చేసే ప్రజారోగ్య సమస్య..
ఆత్మహత్యలకు కారణం ఒకటి కాదు..
భారత ప్రభుత్వ జాతీయ నేర రికార్డుల బ్యూరో (NCRB) నివేదికల ప్రకారం, ఇటీవలి సంవత్సరాల్లో ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో ఆత్మహత్యలు నమోదవుతున్నాయి. యువతలో, ముఖ్యంగా 18–30 సంవత్సరాల వయస్సు గల వారిలో ఈ సమస్య ఆందోళనకరంగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆత్మహత్యను ప్రపంచవ్యాప్తంగా నివారించగల మరణాల ప్రధాన కారణాల్లో ఒకటిగా పేర్కొంటోంది. మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడటానికి సాధారణంగా ఒకే కారణం ఉండదు. అనేక జీవన, సామాజిక, భావోద్వేగ, ఆర్థిక, మానసిక అంశాలు కలిసినప్పుడు ప్రమాదం పెరుగుతుంది. చాలామంది జీవితానికి వారు ఈ పోటీ ప్రపంచంలో విజేతగా నిలవడమే ఏకైక విజయమార్గంగా చూస్తారు. ముఖ్యంగా విఫలమైతే జీవితం ముగిసిపోయిందనే భావన కొందరిలో ఏర్పడుతుంది. మనోవిజ్ఞాన శాస్త్రంలో దీనిని Catastrophic Thinking అంటారు. అంటే ఒక అప జయాన్ని జీవితాంతం నష్టంగా భావించడం. తల్లిదండ్రుల అంచనాలు, బంధువుల పోలికలు, సమాజ ఒత్తిడి, సోషల్ మీడియాలో విజయాల ప్రదర్శన ఈ భావనను మరింత పెంచుతాయి..
ఆత్మహత్యకు ముందు హెచ్చరిక సంకేతాలు..
దేశంలో ఆత్మహత్యలు పెరగడానికి ఒకే కారణం లేదు. వివిధ సర్వేలు, పరిశోధనలు, అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు చూపుతున్నదేమిటంటే, వ్యక్తిగత, కుటుంబ, సామాజిక, ఆర్థిక, మానసిక అంశాలు పరస్పరం ప్రభావితం చేసినప్పుడు ఆత్మహత్య ప్రమాదం పెరుగుతుంది. చాలా సార్లు బయటకు కనిపించే ఒక సంఘటన మాత్రమే తుది కారణంలా అనిపించినా, దానికి ముందు చాలా కాలంగా పేరుకుపోయిన ఒత్తిడులు, నిరాశ, మద్దతు లోపం వంటి అంశాలు ఉంటాయి.. నీట్ పరీక్షలకు సంబంధించిన ఒత్తిడి పేపర్ లీక్, పరీక్ష రద్దు, మళ్లీ పరీక్ష నిర్వహణ వంటి పరిణామాల తర్వాత పలువురు విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ఆత్మహత్యకు ముందు చాలామంది వ్యక్తుల్లో కొన్ని హెచ్చరిక సంకేతాలు కనిపిస్తాయని మనో విజ్ఞాన నిపుణులు చెబుతున్నారు. తరచుగా నిరాశతో కూడిన మాటలు మాట్లాడడం, ఇక జీవితం వ్యర్థం లేదా నేను లేకపోతే అందరూ బాగుంటారు వంటి వ్యాఖ్యలు చేయడం, కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగుల నుంచి దూరంగా ఉండడం, ఇష్టమైన పనులపై ఆసక్తి కోల్పోవడం, నిద్ర, ఆకలి, ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పులు రావడం, తీవ్ర ఆందోళన, కోపం లేదా నిస్స హాయతతో కనిపించడం, విలువైన వస్తువులను ఇతరులకు ఇవ్వడం, వీడ్కోలు చెప్పినట్లుగా ప్రవర్తించడం, మద్యం లేదా మాదకద్రవ్యాల వినియోగం పెరగడం వంటి లక్షణాలు ప్రమాద సూచికలుగా పరిగణించబడతాయి.
సానుభూతి, ముందస్తు సహాయం మస్ట్!
అయితే ఈ లక్షణాలు ఉన్న ప్రతి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడతారని కాదు.. కానీ ఇలాంటి సంకేతాలు కనిపించినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకుండా, ఆ వ్యక్తిని సాను భూతితో వినడం, భావోద్వేగ మద్దతు అందించడం, అవసరమైతే మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించేలా ప్రోత్సహించడం ద్వారా అనేక ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. ఈ సంకేతాలను కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, స్నేహితులు గమనిస్తే ముందస్తు సహాయం అందించే అవకాశం ఉంటుంది.
-అనూరాధ నాయుడు ఎం
మనోవికాస నిపుణులు
83175 88344






