పితృకార్యాలు ఎందుకు చేస్తారో తెలుసా! చేయకపోతే ఏమవుతుంది?

by Ravi |   (  Updated:2022-09-13 18:30:22  IST  )

స్వకులం పీడయేప్రేతః పరచ్ఛిద్రేణ పీడయేత్ జీవన్స దృశ్యతే స్నేహీ మృతో దుష్టత్వమాప్నుయాత్’ శ్రీ మహావిష్ణువు ప్రవచించిన గరుడ పురాణంలోని

పితృకార్యాలు ఎందుకు చేస్తారో తెలుసా! చేయకపోతే ఏమవుతుంది?
X

కర్ణుడు భూలోకంలో గడిపిన రోజులనే 'మహాలయ పక్షమని పేరు. ఈ మహాలయ పక్షములో చివరి రోజు 'మహాలయ అమావాస్య' గా పిలుస్తారు. ఈ పక్షమున మానవులే కాదు దేవతలు కూడా తమ అభీష్టాల కోసం పితృ దేవతలను ఆరాధిస్తారు. ఒకవేళ ఆర్థిక భారం వలన, సమయాభావం వలన శ్రాద్ధకర్మలు చేయలేనివారి కోసం కొన్ని ధార్మిక సంస్థలు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. శ్రాద్ధకర్మ చేత పితృ దేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి వంశాభివృద్ది జరుగుతుంది. పితృదేవతల అనుగ్రహం ఉంటేనే భగవద్ అనుగ్రహం కలుగుతుంది. మహాలయం చేయడం వలన సంతోషాలు, పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయి.

స్వకులం పీడయేప్రేతః పరచ్ఛిద్రేణ పీడయేత్ జీవన్స దృశ్యతే స్నేహీ మృతో దుష్టత్వమాప్నుయాత్' శ్రీ మహావిష్ణువు ప్రవచించిన గరుడ పురాణంలోని ఈ శ్లోకం కడుపులో పెట్టుకొని పెంచిన తల్లిదండ్రుల ప్రాణాలు పోయాక వారిని నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుందో చెబుతుంది. ప్రేత రూపం విడిపించని కులాన్ని కులం వంశం పితరులే నాశనం చేస్తారు. తామే స్వయంగా చేయవచ్చు లేదా శత్రువుల చేత చేయించవచ్చు. శరీరం ఉన్నప్పుడు నా వారు అనుకుని ప్రేమతో సాకిన పితరులే, ప్రేత రూపం విడిపించకపోతే ఆగర్భ శత్రువులుగా మారి పీడిస్తారు. ప్రేతలు ఎవరెవరిని ఎలా బాధిస్తాయో విష్ణుమూర్తి గరుడునికి చెప్పారు. ఆయన చెప్పినదానిని బట్టి మహాలయ పక్షాలు, తిస్రోష్టకాలు, అమావాస్య ప్రాధాన్యం తెలుసుకొని పితరులను అర్చించాలి. ప్రస్తుత మహాలయ పక్షం 10 సెప్టెంబర్ 2022 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 25 అమావాస్యతో పూర్తవుతుంది.

ఈ పక్షంలో ఉదయమే ప్రధాన ద్వారం దగ్గర నిలబడి పితృదేవతలను స్మరించి వారికి నమస్కారం చేస్తూ 'పితృపక్షము పాటించుటకు అశక్తుడను కావున నన్ను మన్నించి దీవెనలు అందజేయండి' అని మనస్సులో ప్రార్థన చేయడం వలన ఎన్నో శుభ ఫలితాలు ఉంటాయి. భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ఎంత విశిష్టమైనదో బహుళ పక్షం పితృదేవతా పూజలకు అంత శ్రేష్ఠమైనది. అందుకే దీనిని 'పితృపక్షమని' కూడా అంటారు. ఈ పక్షమున పితృదేవతలకు శ్రాద్ధకర్మలు నిర్వహించవచ్చు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజూ పితృదేవతలకు తర్పణ, శ్రాద్ధ విధులను నిర్వహించాలి. తండ్రి జీవించి, తల్లిని కోల్పోయినవారైతే ఈ పక్షంలో వచ్చే నవమినాడు, తల్లీ తండ్రీ ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి. ఈ పక్షమంతా చేయలేనివారు ఒక్క మహాలయ అమావాస్య సెప్టెంబర్ 25న నైనా చేసి తీరాలి.

పురాణ గాథ

దానశీలిగా పేరొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఆకలి, దప్పిక కావడంతో చెట్టుకున్న ఫలం కోసుకొని తిందామనుకున్నాడు. కానీ, ఆశ్చర్యంగా అది బంగారపు ముద్దగా మారిపోయింది. మిగతా చెట్లతోనూ అదే అనుభవం. దీంతో దప్పిక తీర్చుకుందామని సెలయేటిని సమీపించి నీటీని నోటి ముందర ఉంచితే ఆ నీరు బంగారు నీరుగా మారిపోయింది. ఈ పరిస్థితి స్వర్గంలోనూ ఎదురైంది. దీంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటని వాపోతుండగా 'కర్ణా నీవు ఎంతో దానశీలిగా పేరుపొందినా, ఆ దానాలన్నీ బంగారం, వెండి, డబ్బు రూపేణా చేశావు. ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకు ఈ దుస్థితి' అని ఆకాశవాణి పలుకులు వినిపించాయి. దీంతో కర్ణుడు తన తండ్రి సూర్యదేవుని ప్రాధేయపడతాడు. వారిద్దరు ఇంద్రుడిని వేడుకుంటారు.

దేవరాజైన ఇంద్రుడు కర్ణునికి ఒక అవకాశం ఇస్తూ 'నీవు భూలోకానికెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి, మాతా పితరులకు తర్పణలు వదిలి తిరిగి రమ్మని ' అన్నాడు. ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి నాడు భూలోకానికి చేరి ఇంద్రుడు చెప్పినవన్నీ చేశాడు. దీంతో ఆయన కడుపు నిండిపోయి ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపిన రోజులనే 'మహాలయ పక్షమని పేరు. ఈ మహాలయ పక్షములో చివరి రోజు 'మహాలయ అమావాస్య' గా పిలుస్తారు. ఈ పక్షమున మానవులే కాదు దేవతలు కూడా తమ అభీష్టాల కోసం పితృ దేవతలను ఆరాధిస్తారు. ఒకవేళ ఆర్థిక భారం వలన, సమయాభావం వలన శ్రాద్ధకర్మలు చేయలేనివారి కోసం కొన్ని ధార్మిక సంస్థలు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. శ్రాద్ధకర్మ చేత పితృ దేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి వంశాభివృద్ది జరుగుతుంది. పితృదేవతల అనుగ్రహం ఉంటేనే భగవద్ అనుగ్రహం కలుగుతుంది. మహాలయం చేయడం వలన సంతోషాలు, పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయి.


తిరుమల మనోహర్ ఆచార్య

శ్రీ రామానుజ యాగ్నిక పీఠం

దక్షిణ భారతదేశ సహాయ కార్యదర్శి

హైదరాబాద్

99890 46210

Next Story