బనకచర్లపై ఈ ద్వంద్వ వైఖరి ఎందుకు?

by Ravi |   (  Updated:2025-06-20 01:30:31  IST  )

గోదావరి నీరు సముద్రంలోకి పోయినా పర్వాలేదు.. కానీ దిగువున ఉన్న ఆంధ్రప్రదేశ్ మాత్రం వాడుకోవడానికి వీల్లేదంటూ అడ్డంగా

బనకచర్లపై ఈ ద్వంద్వ వైఖరి ఎందుకు?
X

గోదావరి నీరు సముద్రంలోకి పోయినా పర్వాలేదు.. కానీ దిగువున ఉన్న ఆంధ్రప్రదేశ్ మాత్రం వాడుకోవడానికి వీల్లేదంటూ అడ్డంగా వాదిస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు.. తెలంగాణకు అన్యాయం జరుగుతోందంటూ నీళ్ల రాజకీయం చేసి మరోసారి సెంటిమెంట్ రెచ్చగొట్టి రాజకీయం జుర్రు కోవాలని చూస్తున్నారు.. గోదావరి వృధా జలాలపై జల రాజకీయాలు చేసి రాజకీయ లబ్ది పొందా లన్న ధోరణి వారిలో కనపడుతోంది.

గోదావరి నీళ్ల తరలింపు అంశం రాజకీయాలు చేసి, తెలంగాణా ప్రజల్లో భావోద్వేగాలు, సెంటిమెంటు‌ను రెచ్చ గొట్టి రాజకీయంగా బతకాలన్న దురాశతోనే నీటి నిప్పు రాజేస్తున్నారు. గోదావరి నుండి సముద్రంలోకి పోతున్న అపారమైన వరద నీటిని వాడుకునేందుకు గోదావరి–బనకచర్ల అనుసంధానం రూపకల్పన చేశారు సీఎం చంద్రబాబు.. కానీ ఈ అనుసంధానంపై తెలంగాణ యాగీ చేయడం దురదృష్టకరం. ఏ నదీ అయినా పరీవాహక ప్రాంతంలో చిట్టచివరన ఉండే రాష్ట్రానికి మిగులుతో పాటు వరద జలాలపై హక్కును సహజ న్యాయ సూత్రాల ప్రకారం ట్రిబ్యునల్ కల్పిస్తాయి.

వృధా నీటిపై ఇంత రాద్దాంతమా..?

గోదావరి–బనకచర్ల అనుసంధానంపై బీఆర్‌ఎస్ మొదట రగడ మొదలు పెట్టింది. ఆ పార్టీ మీడియాలో ప్రతిరోజూ వరస బెట్టి ఈ అనుసంధానంపై ఆంధ్రప్రదేశ్‌కు వ్యతిరేక కథనాలు రాస్తూ విషం కక్కుతుంది. ఇప్పటి వరకు కృష్ణానది నీళ్లన్నీ దోచుకుపోయారని, ఇప్పుడు గోదావరి నీళ్లపై కన్ను పడిందంటూ సెంటిమెంట్ రెచ్చగొడుతూ తప్పుడు కథనాలు రాస్తున్నారు.. ఎగువ రాష్ట్రం తెలంగాణా ఉపయోగించుకోగా మిగిలిన నీరు మాత్రమే కిందకు పోతుందన్న ఇంగితం కూడా లేకుండా బీఆర్‌ఎస్ వ్యవహరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తుంది. బీఆర్‌ఎస్ చేస్తున్న ప్రచారంతో తామెక్కడ వెనుకబడిపోతామోననే భయంతో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్‌కు వంత పాడుతూ గోదావరి -బనక చర్ల అనుసంధానానికి తాము వ్యతిరేకమని మొదలుపెట్టి కేంద్రానికి ఫిర్యాదులు చేస్తున్నారు.

తెలంగాణకు ఏ నష్టం లేదు..

గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుతో ఎగువ రాష్ట్రం తెలంగాణకు ఎటువంటి నష్టం లేదు. కేవలం సముద్రంలోకి వృధాగా పోతున్న వరద నీటిని మాత్రమే తరలిస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతుంది. కానీ రాజకీయ దురు ద్దేశంతో ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని బీఆర్ఎస్ నాయకులు కేంద్రానికి ఫిర్యాదులు చేస్తూ మొండిగా వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు ఎన్నడూ వ్యతిరేకించలేదు. అయినా చంద్రబాబు తెలంగాణా ప్రాజెక్టులను ఆడుకొన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు.. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై జరుగుతున్న విచారణను డైవర్ట్‌ చేసేందుకే బీఆర్‌ఎస్‌ నేతలు బనకచర్ల ప్రాజెక్టుపై విషం కక్కుతున్నారు..

ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించి..

2019లో జగన్- కేసీఆర్ హైదారాబాద్‌లో ప్రగతి భవన్‌లో సమావేశం అయి అలై బలై నిర్వహించారు.. ఏపీ ప్రజలకు ప్రయోజనం కలిగించేలా అన్నీ అంశాల్లో ఇచ్చి పుచ్చుకొనే ధోరణితో వ్యవహరిస్తామని ఆదర్శాలు వల్లించారు. రెండు రాష్ట్రాల మధ్య ఖడ్గ చాలనం కాదు, కరచాలనం కావాలి.. కత్తులు దూసేది లేదు. చేతులు కలుపుతాం అని పొరుగు రాష్ట్రాలతో ఇచ్చి పుచ్చుకునే విధంగా వ్యవహరిస్తాం అన్నారు కేసీఆర్. దశాబ్దాల సాగునీటి కష్టాలను దూరం చేసేందుకు గోదావరి నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు తరలించాలని ఇద్దరు సీఎంలు నిర్ణయించారు. కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువని అందుకే గోదావరి నీటిని ఉపయోగించుకుని రాయల సీమ, తెలంగాణా ప్రాంతాల సాగునీటి సమస్యను పరిష్కరించాలని రెండు ప్రభుత్వాలు వేసిన ఈ అడుగు దేశానికి ఆదర్శంగా నిలుస్తుందంటూ ఇద్దరు ముఖ్యమంత్రులు ఆనాడు సుద్దులు చెప్పారు.. కానీ ఓడిపోయాక ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో రాజకీయాలు చేసి సెంటిమెంట్ రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారు.

జల రాజకీయం ఇంకా ఎన్నాళ్లు..?

బీఆర్‌ఎస్ నాయకులకు భావోద్వేగం, సెంటిమెంట్ లేకుండా పూటగడవదు. రాజకీయ మనుగడ లేదు.. వారు సెంటిమెంట్‌ను రగిలించడమే లక్ష్యంగా జల రాజకీయం చేస్తున్నారు.. సముద్రంలోకి వృధాగా పోతున్న జలాలనే బనకచర్ల తీసుకెళ్తుంటే తెలంగాణకు జరిగే నష్టం ఏమిటో అర్థం కావడం లేదు. తెలంగాణాలో గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద మేడిగడ్డ బ్యారేజీ, అన్నారం బ్యారేజీ, సుందిళ్ల బ్యారేజీ కట్టారు. మహారాష్ట్రలో పుట్టిన గోదావరి తెలంగాణలోని బాసర, మంథని, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలం మీదుగా ఆంధ్రప్రదేశ్‌కి వెళ్తుంది. భద్రాచలం దాటిన తర్వాత ఇక ఆ నీరంతా రాజమండ్రి, అంతర్వేది మీదుగా సముద్రంలో కలుస్తుంది. ఏపీలో గోదావరిపై ధవళేశ్వరం మాత్రమే ప్రధాన ప్రాజెక్ట్ వుంది. ప్రస్తుతం పోలవరం నిర్మాణంలో ఉన్నది.

సీమ కరువును తీర్చే ప్రాజెక్ట్

రాయలసీమ రైతుల అవసరాల దృష్ట్యా, గోదావరి నీళ్లు తరలించడం ద్వారా పల్నాడు, రాయలసీమ, వెలుగొండ, ప్రకాశం జిల్లాల సాగునీటి కష్టాలు తీర్చి రాయలసీమను కరువు రక్కసి నుండి కాపాడనున్నది బనకచర్ల ప్రాజెక్టు.. బనక చర్ల రాయలసీమ సాగునీటి జీవనాడి. పోలవరం - బనకచర్ల అనుసంధానం ద్వారా బనకచర్ల రెగ్యులేటర్‌కు గోదావరి వరద జలాలు తరలించి రాయలసీమను కరువు రక్కసి నుంచి రక్షించాలని సీఎం చంద్రబాబు సంకల్పించారు. వృధాగా పోతున్న విలువైన గోదావరి నది జలాలు సముద్రం పాలు అవుతున్న పరిస్థితుల్లో కృష్ణాకు, గోదావరి జలాలు తరలించి వృధా జలాలను సద్వినియోగం చేసేందుకు చంద్రబాబు భగీరథ ప్రయత్నం చేస్తుంటే.. సైంధవుల వలె అడ్డుపడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు.

నీరుకొండ ప్రసాద్

98496 25610

Next Story