- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిల్లలకు హాలిడేస్‌లో హోంవర్క్ ఎందుకు?
ఎవరు ఎప్పుడు కనుక్కున్నారో, ఎట్లా మొదలు పెట్టినరో కానీ ఈ హాలిడే హోమ్ వర్క్ పిల్లల జీవితాల్లోకి ఒక భూతం లాగా వచ్చింది.

ఎవరు ఎప్పుడు కనుక్కున్నారో, ఎట్లా మొదలు పెట్టినరో కానీ ఈ హాలిడే హోమ్ వర్క్ పిల్లల జీవితాల్లోకి ఒక భూతం లాగా వచ్చింది. హాలిడేస్‌కి అర్థమే మార్చేసిన ఈ సంస్కృతిని మొదలు పెట్టింది బడులే కానీ, తల్లిదండ్రులకు కూడా ఇదే కావాలి. టీచర్లను ఇంకా కొంచెం ఎక్కువ హోమ్ వర్క్ ఇవ్వమంటారు.. పిల్లలు మొదట కొన్ని రోజులు బానే ఉన్నా, రీఓపెనింగ్ దగ్గర పడే కొద్దీ, స్కూల్ మొదలవుతుందన్న దిగులుతో పాటూ ఈ హోమ్ వర్క్ చెయ్యాలన్న గుబులుతో సతమతమవుతుంటారు.
ఆ పిల్లలు ఆడుకుంటున్నా, ఏం చేస్తున్నా మనసులో ఒక పక్క అవి బాధిస్తూనే వుంటాయి. ఇది పెద్దవాళ్లు అర్థం చేసుకోలేనంత రాకెట్ సైన్స్ ఏం కాదు. మరి పిల్లలంటే ఎందుకంత కసి. తల్లిదండ్రులు వాళ్లని హాయిగా ఏ దిగులు లేకుండా సెలవుల్లో సంతోషంగా ఎందుకుండనివ్వరు?
ఇదెక్కడి శాడిజం?
చిన్నపిల్లలు అన్ని రోజులు చదువుకు దూరంగా ఉంటే అన్నీ మర్చిపోతారని కొందరి వాదన. మర్చిపోయినదాని కంటే వేగంగా పిల్లలు నేర్చుకోగలుగుతారు అని కూడా తెలుసు కదా. సెలవులయిపోతూనే ఐఐటీ పరీక్ష ఏం రాయడం లేదు కదా. ఈ హాలిడే హోంవర్క్ సంస్కృతి లేని కాలంలో చదువుకున్న వాళ్ళేమన్నా ఇబ్బంది పడి ఒక్కో సంవత్సరం రెండు, మూడు సార్లు చదివినరా? ఎండాకాలం సెలవులు మాత్రమే కాదు, దసరా సెలవులు, సంక్రాంతి సెలవులు, క్రిస్మస్ సెలవులు ఆఖరికి లాంగ్ వీకెండ్స్‌ని కూడా వదలరు. ఒక్క రెండు రోజులు సెలవు వస్తే, మరుసటి రోజు తప్పకుండా CT (క్లాస్ టెస్ట్) పెడతారు. ఇదెక్కడి శాడిజం? పరీక్ష ముందు సెలవులు కాబట్టి ఇంకొంచెం బాగా చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చని పేరెంట్స్ కూడా దీన్ని సమర్థిస్తారు.. కానీ పిల్లలు సెలవుల్లో ఆనందాన్ని కోల్పోతున్నారని వాళ్లకు కొంచెం కూడా అనిపించదు. అట్లనే ఒక్కోసారి దసరా సెలవులు, సంక్రాంతి సెలవుల తర్వాత పరీక్షలు పెడతారు. కొంచెం ప్లాన్ చేసుకొని, సెలవుల ముందే పరీక్షలు పెడితే సిలబస్ తలకిందులై కొంపలు మునిగిపోతాయా?
సమ్మర్ క్యాంపులకు తరమడమేంటి?
బలంగా నాటుకుపోయిన ఇంకో సంస్కృతి.. సమ్మర్ క్యాంప్. పిల్లలు టైం వేస్ట్ చేయకుండా ఏదో ఒకటి నేర్చుకోవాలనీ, ఖాళీగా ఉంటే సోమరితనం అలవాటవుతుందనీ, దాని కోసమన్నా తొందరగా లేస్తారనీ ఇట్లా ఏవేవో కారణాలు.. పాపం పిల్లలు రోజూ పొద్దున్నే లేచి కనీసం ప్రశాంతంగా టాయిలెట్‌కి కూడా పోకుండా, ఉరుకులు పరుగులతో బాక్సులు పట్టుకుని బస్సులెక్కి బళ్లకు పోయి చిన్నప్పుడే గ్యాస్ట్రిక్ ప్రాబ్లెమ్స్, మల బద్ధకంతో బాధ పడుతుంటారు. కనీసం సెలవుల్లో నైనా హాయిగా ఉండనివ్వొచ్చు కదా. అప్పుడప్పుడు సోమరితనంగా ఉండటం ఫర్వాలేదు. సమ్మర్ క్యాంపుకు పోకపోయినా, పిల్లలు సెలవులలో ఇంట్లో ఏమేం నేర్చుకోవాలి, సెలవుల్ని ఎట్లా సద్వి నియోగం చేసుకోవాలి అని ప్రవచనాలు.. పిల్లలంటే ఎప్పడు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాల్నా? ఆటలాడుకోవడం, ఆనందంగా ఉండడం కన్నా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఏముంటుంది.
మీ బాల్యాన్ని వారికి ఇవ్వరా?
ఏదో హాయిగా ఇష్టమొచ్చినట్టు మామూలుగా ఆడుకోకూడదు, ఏదో ఇష్టమున్నట్టు డ్రాయింగ్ చేసుకోకూడదు, మ్యూజిక్ పెట్టుకుని ఎగురుతూ ఎంజాయ్ చెయ్యకూడదు. అన్ని క్లాస్‌కి పోయి నేర్చుకోవాల్సిందే. ఇవన్నీ ఇప్పటి నుంచే బిజీగా లేకపోవడం పాపం, పనికి మాలినతనం అని వాళ్ల మెదళ్లలో బలమైన బీజం నాటుతాయి. తల్లిదండ్రులు పిల్లలకు అన్నీ ఇస్తారు, తమకంటే గొప్ప చదువులు చదవాలి, ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉండాలనుకుంటారు. దాని కోసం బాగా కష్టపడతారు. కానీ ఎక్కువ కాకపోయినా కనీసం తాము బాల్యంలో ఆనందించినంత ఆనందించాలని మాత్రం కోరుకోరు. పైగా బాల్యాన్ని కుదించేస్తారు.
తల్లిదండ్రులకే ఇష్టం లేకపోతే..
సెలవు దినాల్లో హోం వర్క్ చేయడం అనేది నేను ఇప్పటివరకు విన్న అత్యంత చెత్త విషయం. హాలిడేస్‌లో హోంవర్క్ ఏంది? ఈ మొత్తం ప్రక్రియను 'హాలిడే హారర్- Schools & Parents Co. Pvt Ltd' అని పిలవచ్చు. పిల్లలకు ఇష్టం లేకున్నా టైం వేస్ట్ కాకూడదని సమ్మర్ క్యాంపులకు పంపడం ఎంత అన్యాయం? సెలవుల్లో అయినా పిల్లలు ఆడుకోవడం, సంతోషంగా గడవడం తల్లిదండ్రులకే ఇష్టం లేకపోతే పిల్లలకు ఏది దిక్కు?
- మాలతి పల్లా
90103 96655






