కోనసీమ మంటకు కారణమెవరు?

by Disha edit |
కోనసీమ మంటకు కారణమెవరు?
X

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు, వాటికి పేర్లు పెట్టడం ఇటీవలే జరిగిన రాజకీయ పరిణామం. తెలంగాణాలో కూడా ఇలాంటి కసరత్తు జరిగింది. ఒక ప్రాంతపు పాలనాపర సరిహద్దులు మార్చడం అంటే, అక్కడి రాజకీయ, భౌగోళిక, నైసర్గిక స్వరూపాలను ఆనాటి పాలకుల ప్రయోజనాలకు అనుగుణంగా మార్చడం అని అర్థం. 'ప్రజల వద్దకు పాలన' అనే మరొక వివరణ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి మార్పులలో రాజకీయ ప్రయోజనాలు, ఎన్నికల వ్యూహాలు, పాలక శక్తులకు, వారి మిత్రులకు కలిగే ఆర్థిక ప్రయోజనాలు కలగలిసి ఉంటాయి.

ఉదాహరణకు కొత్త జిల్లాలలో కొత్త స్థిరాస్తి వ్యాపారానికి అందే ఊపు, ఆ వ్యాపారం తెచ్చే ఆర్థిక వనరులు, వాటిని నియంత్రించే కుల-వర్గ శక్తులు, వాటి రాజకీయ ఎదుగుదల వంటి వాటిని గమనించవచ్చు. కొత్త పాలనాపర యూనిట్లను రూపొందించడం మొదలు, వాటికి పేర్లు పెట్టడం వరకు అన్నీ అధికార, రాజకీయాలతో ముడిపడి ఉంటాయి. భౌగోళిక ప్రాంతాలకు కొంత సాంస్కృతిక వారసత్వం, గుర్తింపు ఉంటుంది. వాటిలో ఆధునికత కు పూర్వ కాల వైభవపు మేళవింపు, ప్రాంతీయ ప్రత్యేకతలు కూడా ఉంటాయి. మైదాన ప్రాంతం ఉండే ఊర్లకు వందల ఏండ్ల చరిత్ర ఉంటుంది. ఆయా ప్రాంతాల ప్రజలకు దానికి సంబంధించిన పురాతన స్మృతులు కూడా ఉంటాయి. వాటి ఆధారంగానే ప్రాంతాల పేర్లలో మార్పులు చేయవలసి ఉంటుంది. నాడులు, సీమలు, నకరాలు (వ్యాపార కూడళులు) స్థానిక జన మానసాలలోకి ఇంకిపోయి ఉంటాయి.

వీటిని మరిచారు

జిల్లాలకు పేర్లు పెట్టేటప్పుడు స్థానిక అంశాలను ఎక్కువగా పరిగణనలోకి తీసుకుంటే బాగుంటుంది. అందుకే తెలంగాణలో జిల్లాలకు వ్యక్తుల పేర్లను పెట్టకుండా ప్రాంతాల పేర్లు, దేవతల పేర్లను జోడించారు. కొన్ని నిరసన స్వరాలు వినిపించినా, ప్రశాంతంగానే సద్దుమణిగాయి. ఏపీలో వైసీపీ సర్కార్ రాజకీయ, భౌగోళిక మార్పుల విషయంలో చాలా చిక్కులలో ఉందనిపిస్తుంది. రాజధానులు ఎన్ని? అమరావతిని ఏం చేయాలి? వంటి వాటితో మొదలు కొత్త జిల్లాల పేర్లలో కూడా వీటిని మనం గమనించవచ్చు.

జిల్లాల ఏర్పాటును అధికార పక్షం తమ రాజకీయ భవిష్యత్తును మెరుగుపరుచుకోవడానికి వాడుకుంటుంది. దీంతోనూ చిక్కులు వస్తాయి. చారిత్రక వ్యక్తులు, సమకాలీన ప్రభావశీల వ్యక్తుల పేర్లను జిల్లాలకు పెట్టినప్పుడు, వాటిని స్వీకరించడంలోనే సమస్య ఉంది. సదరు మహనీయులను ఆయా ప్రాంతాలవారు గౌరవించవచ్చు కానీ, ఆయన పేరును ప్రాంతంలోని అందరూ ఇష్టపడకపోవచ్చు. ఈ సూక్ష్మం గమనించవలిసినదే. అందుకే పేర్ల విషయంలో తగిన జాగ్రత్త అవసరం. ఇటీవలి కాలపు గొప్ప మనుషుల పట్ల సమాజంలో తీవ్ర ప్రేమలు కానీ, తీవ్ర వ్యతిరేకతలు కానీ ఉన్నప్పుడు సమస్య మరింత జటిలం అవుతుంది. కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టడం ఇటువంటి స్థితికి ఉదాహరణ.

వీరిని అధ్యయనం చేశారా?

బాబాసాహెబ్‌ను గౌరవపూర్వక, విమర్శనాత్మక దృక్పథంతో అధ్యయనం చేయడం, ఆకళింపు చేసుకోవడం, అంచనా వేసుకోవడం జరగడానికి ఈ దేశంలో చాలా కాలమే పడుతుందని ఈ దుస్సంఘటనల పరంపర మరోసారి వెల్లడిస్తున్నది. ఆచరణ, అధ్యయనం, సాధన పట్టుదల, సాహసాలతో సానుకూల సామాజిక ఆర్థిక పరివర్తన కోసం పని చేసిన మహానుభావులను గురించి రాజ్యం, పౌర సమాజం, విద్యా వేత్తలు ప్రజారాసులకు పరిచయం చేయాల్సి ఉంటుంది. తమ కార్యాచరణ ద్వారా ప్రజల మన్నన పొంది, ప్రజల జ్ఞాపకంలో భాగంగా ఉండే మహానుభావులను సమగ్రంగా దర్శించడం చాలాసార్లు జరగదు. ప్రభుత్వ యంత్రాంగమూ, రాజకీయ బృందాలు, ఇతర శక్తులు వారిని తమ తమ పరిమిత అవసరాలకోసం, స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటూ ఉంటాయి.

ఉదాహరణకు బాబాసాహెబ్‌గానీ, గాంధీగానీ మనలో చాలామందికి నిగూఢ పరిచయం లేదు. అంబేద్కర్ అంటే రాజ్యాంగమూ, రిజర్వేషన్లు అనీ, గాంధీ అంటే శాంతి, సమాజ సేవ అని మాత్రమే తెలుసు. గొప్పవారిని రాజకీయాల కోసం వాడుకోవడం అనేది వికృతత్వం. ఇది బాబాసాహెబ్ విషయంలో అయితే చాలా ఎక్కువగానే జరుగుతున్నది. ఈసారి ఆ పని వైసీపీ సర్కారు చేసిందని అనిపిస్తున్నది. అంబేద్కర్ ఆశయాల మీద గానీ, ఆయన ఆచరణల మీద గానీ ఆ పార్టీకి శ్రద్ధ ఉందని అనుకోవడం దండుగ. అమలాపురం లోక్‌సభ స్థానం ఎస్‌సీ‌లకు రిజర్వ్ అయి ఉంది. ఆ నియోజకవర్గంలోని మూడు అసెంబ్లీ స్థానాలు కూడా ఎస్‌సీ రిజర్వుడే. దీనిని బట్టి చూస్తే సర్కారుకు ఈ పేరు మార్పు మీద ఉన్న ఆలోచన అర్థం అవుతుంది.

ఆంధ్ర ప్రాంతానికి చెందిన దళిత భూమిక నుండి వచ్చిన మహానుభావుల పేరు కోనసీమకు పెట్టి ఉంటే బాగుండేది. బాబాసాహెబ్ పేరు ఇప్పుడు ఆంధ్ర దళితులకు, కాపులకు దళితులు కాని ఇతర సమూహాలకు నడుమ వివాదంగా మారింది. అధికార, విపక్షాలు ఎవరికి వారు రాజకీయ పంట పండించుకోవాలని చూస్తున్నారు. బాబాసాహెబ్ అందరివాడా? కొందరి వాడా? అన్న చర్చ ఎడతెగకుండా సాగుతున్నది. తెలుగు నేలలో దళితవాద స్వరాన్ని బలంగా వినిపించిన కృష్ణా-గోదావరి ప్రాంతాల దళిత మేధో ప్రపంచం ఈ సంవాదాన్ని నిర్మించిందా? అన్నది పరిశీలించాలి. దళితులకు, దళితేతరులకు నడుమ కృష్ణా-గోదావరి డెల్టాలలో అపనమ్మకాలు, మానసిక దూరాలు, విరోధ భావాలు మూడు దశాబ్దాలుగా పెరిగాయి తప్ప తగ్గలేదు. అవే ఇప్పుడు మండుతున్న కోనసీమకు కారణాలు.

డా.హెచ్. వాగీశన్

అసిస్టెంట్ ప్రొఫెసర్,

నల్సార్ లా యూనివర్సిటీ

హైదరాబాద్

94402 53089



Next Story