- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గాజాలో గెలిచిందెవరు? ఓడిందెవరు?
గాజాలో ఇజ్రాయెల్ సైనిక నష్టాలపై కొత్త వివరాలు వెల్లడైనవి. 466 రోజుల జినోసైడ్‌లో గెలిచింది ఎవరు? ఓడింది ఎవరు

గాజాలో ఇజ్రాయెల్ సైనిక నష్టాలపై కొత్త వివరాలు వెల్లడైనవి. 466 రోజుల జినోసైడ్‌లో గెలిచింది ఎవరు? ఓడింది ఎవరు? ఇంతవరకు ఆ ప్రభుత్వం చెప్పిన సైనిక మరణాల సంఖ్య 400 అనేది నిజం కాదు. వారు 5942 మంది. ఇజ్రాయెల్ ప్రతిపక్షాలు వెయ్యి మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించారని విమర్శ చేసినప్పుడు నెతన్యాహూ ప్రభుత్వం అబద్దమని ఖండించింది. గాయపడ్డ పేషెంట్లలో మరణించిన సైనికులతో కలిపి ఆఖరికి ఒప్పుకున్న ఐదున్నర వందల సంఖ్య కూడా నిజం కాదు. కానీ ఇప్పుడు వారి సంఖ్య 5942గా ఒప్పుకుంది. యుద్ధకాలంలో మృతుల పేర్లు బదులు సంఖ్యల్ని ప్రకటిస్తూ వచ్చింది. పేర్లు దాచి విమర్శకులకు నిజ నిర్ధారణకు అవకాశం లేకుండా చేసింది. మృత కుటుంబాలకు పరిహారం చెల్లించే సమయంలో ఆ వివరాల్ని బయటపెట్టక తప్పదు కదా! ఇప్పుడు జరిగింది సరిగ్గా ఇదే!
యుద్ధానికి ఏడాది నిండిన సందర్భంగా ఇజ్రాయెల్ "HAARETZ" దినపత్రిక గాయపడ్డ సైనికుల సంఖ్య పదివేలకి చేరిందని ఆరోపిస్తే ప్రభుత్వం అది అబద్దమని ఖండించి ఇప్పుడు ఆ సంఖ్య 15,000 దాటిందని స్వయంగా ఒప్పుకుంది. యుద్ధ విరమణ తర్వాత హారెట్జ్ దినపత్రికలో.. ఇజ్రాయెల్ సైనిక విశ్లేషకులు అమోస్ హార్టల్ కాల్పుల విరమణకు ప్రధాన కారణం సర్కార్ చెప్పే బందీల విడుదల కాదు, సైనిక నష్టాలే.. కారణమని వ్యాఖ్యానించారు. పారా మిలిటరీ సహా గాజాకు తరలించిన సైనిక బలగాల సంఖ్య మూడున్నర లక్షలు.. గాజా విస్తీర్ణం 365 చ.కి.మీటర్లు.. చ.కి. మీ.కి సైనికులు 960 మంది. ఓ చ.కి.మీ.కి 250 ఎకరాలకి పంచితే ఒక్క ఎకరానికి నలుగురు దురాక్రమణ సైనికులతో గాజా భీభత్స దృశ్యాన్ని ఊహిద్దాం.
ఇజ్రాయెల్ సాధించిన ఫలితాలు..
గాజా జనాభా 23 లక్షల మంది. జనసాంద్రత ఎక్కువ. సగటు కుటుంబ సభ్యుల సంఖ్య పది మంది వరకు కూడా ఉంటుంది. రెండు నుండి రెండున్నర లక్షల కుటుంబాల గాజా! ఒక కుటుంబానికి ఒకటి కంటే ఎక్కువ తుపాకులు కాపలా ఉంటాయి. ఇది పసిపిల్లల నుండి వృద్ధుల వరకు లెక్కిస్తే! గాజా టెర్రర్ స్థితిని ఊహిద్దాం. యుద్ధం ప్రారంభించింది 7-10-2023 తేదీన, యుద్ధ విరమణ జరిగిన తేదీ 19-1-2025. యుద్ధ కాలం 466 రోజులు.. సగటున రోజుకు ఇజ్రాయెల్ సైనికుల మరణాల సంఖ్య 13. రోజుకు గాయపడ్డ సైనికుల సంఖ్య 32. ఇజ్రాయెల్ యుద్ధ ప్రకటన ప్రకారం గాజా హమాస్ మిలిటెంట్ల సంఖ్య 25 నుండి 30 వేల మంది. నిజానికి నెతన్యాహూ ప్రభుత్వ యుద్ధ లక్ష్యాలు రెండు.. ఒకటి సాయుధ హమాస్ మిలిటెంట్లను సజీవంగా బందించడం లేదా చంపి నిర్జీవం చేయడం. రెండూ 230 మంది బందీలను సజీవంగా విడిపించడం. అయితే సజీవంగా బంధించిన హమాస్ మిలి టెంట్ల సంఖ్య సున్నా. సజీవంగా చిక్కిన ఇజ్రాయెల్ బందీల సంఖ్య సున్నా. హమాస్ సాయుధుల్ని సజీ వంగా బంధించినట్లు అధికారికంగా ప్రకటించిన సంఖ్య సున్నా. హమాస్ సాయుధుల్ని చంపి శవాల్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించిన సంఖ్య సున్నానే.
గాజా ఎగ్జిట్ ప్యాకేజీ
గాజాను విడిచిపెట్టాలనే పౌరుల కోసం ఇజ్రాయెల్ ప్రభుత్వం యుద్ధం మధ్య ఒక ప్యాకేజీ ప్రకటించింది. కన్నంలోకి పొగ పంపి బయటకు వచ్చే ఎలుకకు బతకడానికి అవకాశం కల్పించిన పధకమది. ఇళ్లు, వాకిళ్లు ధ్వంసించి జనాన్ని రఫా సరిహద్దుకి చేర్చాక గాజాకు తిరిగి రాబోమనే హామీతో 'రఫా' గుండా ఈజిప్ట్, ఇతర అరబ్ దేశాలకి వెళ్లడానికి స్వేచ్ఛ కల్పించిన గొప్ప"ఉదార" పధకమది. మా నేల విముక్తికై నూరేళ్ల పాలస్తినా విమోచనా పోరాటంలో ప్రతి కుటుంబం ఒకరినో ఇద్దరినో ప్రాణాలను అర్పించిన చరిత్ర మా జాతికి వుంది. అట్టి మా వీరజాతి మృత్యువుకు భయపడి తమ పుట్టిన మాతృదేశంతో శాశ్వత బంధం తెంచుకోదు. ఈ దేశద్రోహ కర ప్యాకేజీకి తలవంచబోదు.. అని ఆ రోజే హమాస్ కౌంటర్ ప్రకటన చేసింది. రఫా గుండా వెళ్ళాలనుకునే పౌరులపై హమస్ భౌతిక ఒత్తిడి లేదు. పైగా అది ఇజ్రాయెల్ సైనిక ప్రాంతం. మానసికంగా వెళ్లాలని భావించే గాజా పౌరుల్ని ఆటంకపరిచే వారెవ్వరూ లేరు. ప్యాకేజీ ప్రకటించాక రఫా టోల్ గేట్ వద్ద వెళ్లే పౌరుల కౌంటింగ్ కోసం ఓ కౌంటర్ తెరిచింది. అయితే, రఫా టోల్ గేట్ ద్వారా బయటకు వెళ్ళిన గాజా పౌరుల సంఖ్య జీరో.
శవాలతో సంతకం చేసిన డీల్
హమాస్‌ని మట్టుబెట్టే వరకూ యుద్ధ విరమణ చేసేది లేదని ఇజ్రాయెల్ సర్కార్ ప్రపంచం ఎదుట పదేపదే భీష్మ ప్రతిజ్ఞలు చేసింది. 466 రోజుల యుద్ధం తర్వాత దోహాలో అదే హమాస్ ప్రతినిధులతో సంతకం చేసిన యుద్ధ విరమణ ఒప్పందం ప్రకారం సైనిక బలగాల్ని ఉపసంహరణ చేయడం గమనార్హం! విజేతలుగా రావాల్సిన తమ సేనలు శవాల్ని మోసుకొచ్చాయి. శవాలుగా మారాల్సిన హమాస్ నేతలు సంతకం చేసిన శాంతి ఒప్పందాన్ని ఇజ్రాయెల్ చచ్చినట్లు అమలు చేయాల్సి వచ్చింది.
మరో మాట
ఇజ్రాయెల్ నష్టాలు చెప్పి గాజా జన నష్టాలెందుకు చెప్పడం లేదని ఎవరైనా అడగవచ్చు. నిజానికి గాజా పౌర మరణాలు, క్షతగాత్రుల సంఖ్యలు ఇంతకంటే అనేక రెట్లు ఎక్కువే..! ఇది ఆ నష్టాల్ని లెక్కించే సందర్బం కాదు. ఇది జింకల సమూహంపై దాడికి దిగి నష్టపోయిన సింహం గూర్చి, చీమల చేతుల్లో చిక్కి దెబ్బతిన్న పాము గూర్చి మాట్లాడే సందర్భం. ఇది జింకల, చీమల మరణాల గూర్చి మాట్లాడే సందర్భం కాదు. పైగా బతకడం కోసమే పుట్టే జాతి ఇజ్రాయెల్‌ది. పోరాడడం కోసం పుట్టేది పాలస్తీనా జాతి. గాజాలో ప్రతి మరణం ఓ జననమే. అవి పాలస్తీనా జాతీయ విమోచనోద్యమ విత్తులై పునర్జన్మ ఎత్తుతాయి. అక్కడ మృతులు కూడా చిరంజీవులే. ఇజ్రాయెల్ మరణాలు కుక్క చావులే. ఇది వీరమరణాల గూర్చి, వాటి స్ఫూర్తితో నిర్మాణం కానున్న నూతన స్వేచ్ఛా జాతీయ రాజ్యం గూర్చి మాట్లాడే సందర్భం కాదు. ఇది పరజాతి భక్షణ కోసం దురాక్రమణ యుద్ధానికి దిగి దెబ్బతిన్న రాజ్యం గూర్చి మాట్లాడుకునే సందర్భం. అందుకే గాజా పౌర సమాజ నష్టాల గూర్చి మాట్లాడలేదు.
అర లక్ష మృతులు, లక్షకు పైగా క్షతగాత్రుల గూర్చి నిర్లక్ష్యం చేశానని ఎవరూ అపార్థం చేసుకోకండి.. మనుషుల గూర్చి మాట్లాడుకునే సందర్భాల్లో తప్ప కుండా గాజా ప్రజల కష్టనష్టాల గూర్చి, ప్రాణ బలిదానాల గూర్చి మరో సందర్భంగా మాట్లాడుకుందాం. మనం సాటి మనుషుల కోసం కన్నీళ్లు కార్చుదాం. ఎవరు విజేతలు? ఎవరు పరాజితులు? మదపుటేనుగా? చెట్టెలుకలా? విషసర్పమా? చలి చీమలా? ఇప్పుడు చెప్పండి. మీరే తీర్పు చెప్పండి.
-పి. ప్రసాద్
94907 00715






