- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ విమాన ప్రమాదానికి బాధ్యత ఎవరిది?
కొన్ని వేల విమానాలు ప్రపంచమంతా రోజూ తిరుగుతుంటాయి. అసాధారణ జాగ్రత్తలు, నిర్వహణ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంటాయి.

కొన్ని వేల విమానాలు ప్రపంచమంతా రోజూ తిరుగుతుంటాయి. అసాధారణ జాగ్రత్తలు, నిర్వహణ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంటాయి. ముఖ్యంగా అత్యుత్తమ నైపుణ్యం కలిగిన పైలట్లు మాత్రమే విమానాలు నడుపు తారు. కాబట్టి చాలా తక్కువ ప్రమాదాలు ఏవియేషన్‌లో నమోదవుతాయి. అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 విమానానికి జరిగిన ఘోర ప్రమాదంతో విమాన ప్రయాణాలంటేనే వణికి పోవాల్సిన పనిలేదు..
నిత్యం వందలాది ప్రయాణికులను మోసుకుపోయే విమానాలను నడిపే పైలట్లు చివరి క్షణం వరకు సేఫ్‌గానే నడపాలని చూ స్తారు. కానీ, అత్యాధునిక సాంకేతిక సంపత్తి కలిగినవిగా పేరొం దిన బోయింగ్ విమానాలు పేక మేడల్లా కూలిపోవడం ఏమిటి? టేకాఫ్ జరిగిన నిమిషంలోనే అహ్మదాబాద్ విమానాశ్రయం అవతల దెబ్బతిన్న పక్షిలా జనావాసాలపై పడిపోవడం ఏమిటి?
టేకాఫ్ దూరం ఇంత తక్కువనా?
ప్రమాదానికి ముందు విమానం కండిషన్ ఎలా ఉందన్నది ఒక ఎత్తయితే, టేకాఫ్ సమయంలో బయటపడిన విషయాలు దిగ్బ్రాంతి కలిగిస్తున్నాయి. రెండున్నర కిలోమీటర్లు రన్‌వేపై ప్రయాణించాల్సిన ఎయిరిండియా విమానం కేవలం ఒకటిన్నర కిలోమీటర్ దూరం మాత్రమే ప్రయాణించి టేకాఫ్ తీసుకోవడానికి కారణం ఏమిటి? అయితే ఈ విమానాన్ని 9 వేల పైగా గంటల ఫ్లయింగ్ అనుభవం ఉన్న సీనియర్ పైలట్ నడిపారు. ఇంత తక్కువ సమయంలో టేకాఫ్ చేయడమే ఈ ప్రమాదానికి కారణమా? అనేది తేల్చాలని వైమానిక నిపుణుల మాట.
విమానంలో అసాధారణ పరిస్థితులు..
ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు ఇదే ప్లైట్‌లో వచ్చిన ఆకాష్ అనే ఓ ప్యాసింజర్ ఈ విమానంలో అసాధారణ విషయాలను గమనించారు.. నేను ట్యాక్సీలో కూర్చున్నట్లుగా ఉంది. ఇందులో ఏసీలు పనిచేయడం లేదు. ఉక్కపోత భరించలేక ఇబ్బందులు పడుతున్నాం. సీట్ ముందున్న టీవీ స్క్రీన్‌లు, విమాన సిబ్బందితో మాట్లాడే పరికరం బటన్స్, సీటుపైన ఉండే లైట్లు ఏవీ పని చేయడం లేదు. మ్యాప్స్ కూడా పని చేయలేదు. అంతా అస్తవ్యస్తంగా ఉందని ఆరోపించారు. డ్రీమ్ లైనర్ గురించి చాలా గొప్పగా చెప్పాలనుకున్నాను కానీ, విమానం లోపల ఏవీ సరిగా పనిచేయలేదనీ, వరస్ట్ కండిషన్‌తో డ్రీమ్ లైనర్ ప్లేన్ ఉందని కంప్లయింట్ చేస్తానంటూ ట్వీట్ చేశారు. ఆల్ రెడీ ప్రాబ్లమ్ ఉన్న ఇలాంటి విమానాన్ని ఎలా నడుపుతున్నారంటూ వీడియో ద్వారా ఆకాష్ ఎయిర్ ఇండియాను ప్రశ్నించాడు.
ఎన్ని సార్లు మొరాయించిందంటే..
మెయింటెనెన్స్‌లో ఎయిర్ ఇండియా చూపిన నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, ఏ మాత్రం శ్రద్ధ వహించినా వందలాది మంది ప్రాణాలు నిలిచేవని కొందరి విశ్లేషణ.. తాజాగా ప్రమాదం జరిగిన విమానం గతంలో పలుమార్లు మొరాయించిందని గడిచిన ఏడాది కాలంలో రెండుసార్లు సాంకేతిక సమస్యలు తలెత్తాయని వీరి అభిప్రాయం. గత జూన్‌లో ఈ విమానానికి ప్రమాదం తప్పిందని గత డిసెంబర్‌లో ఇదే ఫ్లైట్‌లో పొగలు వచ్చాయని దీనిపై డీజీసీఏ అలర్ట్ చేసినా ఎయిర్ ఇండియా పట్టించుకోలేదని వారంటున్నారు. విమానాలు ఎప్పుడూ తెల్ల ఏనుగులే.. సరిగా పని చేసినంత వరకు ఏ సమస్యా ఉండదు. లోపాలు ఏర్పడటం మొదలయితే వాటి నిర్వహణ ఖర్చులు భారీ స్థాయిలో ఉంటాయి. చిన్న చిన్న లోపాలు అని సర్దుకుని వెళ్లే క్రమంలోనే అనుకోని ప్రమాదాలు జరుగుతాయని చెబుతున్నారు.
గ్రౌండ్ లెవల్‌లోనే ఏదో జరిగిందా?
పైలట్లకు విమానం టేకాఫ్ చేసేముందు 150 చెక్ లిస్టులను గమనించి ఓకే చేయాలనేది ప్రతి విమాన సంస్థకు స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంటుంది. ఇవన్నీ ఓకే అయితేనే విమానం టేకాఫ్ చేస్తారు. ఎక్కడ చిన్న లోపం కనిపెట్టినా టేకాఫ్ కాదు. సాధారణంగా ఒక విమానంలో 50 వేల వరకు విడి భాగాలు ఉంటాయి. వీటిలో ఏ ఒక్కటి పని చేయకున్నా విమానం ప్రమాదానికి గురవుతుంది. అయితే నిన్న ప్రమాదానికి గురయిన విమానం ఒక నిమిషంలోపు టేకాఫ్ అయి వెంటనే ప్రమాదానికి గురయిదంటే విమానంలోనే ఎక్కడో లోపం ఉందని అనుమానాలు పెరుగుతున్నాయి. విమానం పనిచేయలేదంటూ పైలట్లు మేడే కాల్ చేసిన సెకన్లలోనే కూలిపోవడం ఇప్పటికైతే అంతుపట్టడం లేదు.
రెండు ఇంజన్లు ఎప్పుడూ ఫెయిల్ కావు!
విమాన ప్రమాదాలకు ప్రధానంగా సాంకేతిక లోపాలు, అనుభవం లేని పైలెట్లు, వాతావరణ బాగోలేకపోవడం వంటివి కన్పిస్తుంటాయి. ఈ సందర్భంగా దాదాపు 25 వేల ఫ్లయింగ్ గంటల అనుభవం ఉన్న తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈవో, కెప్టెన్ ఎస్ఎన్ రెడ్డి కొన్ని విషయాలు చెప్పారు. విమానంలో రెండు ఇంజన్లు సాధారణంగా విఫలం కావని, ఫ్యూయల్‌లో సమస్య ఉంటేనే అలా జరుగుతుందని ఆయన తేల్చి చెప్పారు. టేకాఫ్ పూర్తి కాకముందే విమానం నిర్ణీత ఎత్తు లో పైకి ఎగరక ముందే కింద కూలిపోయిందంటే పైలట్ల నియంత్రణకు కూడా సాధ్యం కాని ప్రమాదం జరిగిందనే అర్థం. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్, బ్లాక్‌బాక్స్ డీకోడ్ చేస్తే తప్ప అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదానికి కచ్చితమైన కారణాలను చెప్పలేం. నిపుణులు, ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బోర్డు, డీజీసీఏ విచారణ జరిపిస్తాయి. మానవ తప్పిదమా? సాంకేతికత కారణమా? అనేది అప్పుడే తేలుతుందని ఆయన చెప్పారు.
టాటాల ప్రతిష్ట చిన్నబోయిందా..?
విమానాల నిర్వహణలో దారుణ నిర్లక్ష్యం కారణంగానే టాటా వంటి కార్పొరేట్ దిగ్గజం కూడా తలవంచుకోవలసి వచ్చిందా? మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు పారేసి భారం దింపుకుంటారా? ప్రయాణికుల ప్రాణాలను కాపాడటానికి ఏమైనా సీరియస్ చర్యలు తీసుకుంటారా అనేది ప్రశ్న. అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ఏ ఉగ్రవాద సంస్థపైనో, ఉగ్రవాద చర్యపైనో సాకు చూపించి తప్పించుకోలేరన్నదే వాస్తవం. కేంద్ర ప్రభుత్వం ప్రమాద కారణాలని నిపుణుల పర్యవేక్షణలో కనుగొని తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కె. రాజశేఖర్
73964 94557






