ప్రభుత్వ భూములపై కబ్జాల పర్వం..?

by Ratna Kumari |

కబ్జాదారుల కబంధహస్తంలో ప్రభుత్వ భూములు..చూసీచూడనట్లు అధికార యంత్రాంగం అంటూ బెల్లంకొండ సతీష్ ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ భూములపై కబ్జాల పర్వం..?
X

దిశ, అనంతగిరి : కబ్జాదారుల కబంధహస్తంలో ప్రభుత్వ భూములు..చూసీచూడనట్లు అధికార యంత్రాంగం అంటూ బెల్లంకొండ సతీష్ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ పాలవరం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 324లో సుమారు నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని ఆరోపించారు. గతంలో ఈ భూమిలో కొంత భాగాన్ని పాలవరం తండా పల్లె ప్రకృతి వనం కోసం కేటాయించగా, మిగిలిన ప్రభుత్వ భూమిని కొందరు అక్రమంగా ఆక్రమించుకున్నారని తెలిపారు.పాలవరం గ్రామ శివారులో భూముల విలువలు భారీగా పెరగడంతో ప్రభుత్వ భూములపై కబ్జాదారుల కన్ను పడిందని, ప్రజల ఆస్తిని ప్రైవేటు ఆస్తిగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.

పాలవరం మాత్రమే కాకుండా మండలంలోని ఇతర గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోందని పేర్కొన్నారు. పలుమార్లు రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై ఆర్డీవో సూర్యనారాయణ, తహసీల్దార్ కమలాకర్‌కు ఫిర్యాదు చేశామని, వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. పాలవరం సర్వే నంబర్ 324లో జరిగినట్లు ఆరోపిస్తున్న భూ ఆక్రమణలపై సమగ్ర విచారణ చేపట్టి ప్రభుత్వ భూమిని వెంటనే స్వాధీనం చేసుకుని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ భూములను పరిరక్షించడంలో అధికారులు నిర్లక్ష్యం వీడి కఠిన చర్యలు చేపట్టాలని బెల్లంకొండ సతీష్ డిమాండ్ చేశారు.

Next Story